Begin typing your search above and press return to search.

పదవి నుంచి తొలగించినా.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో రాజకీయ వేడి నిత్యం పెరుగుతూనే ఉంది. ఈ తరుణంలో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి.

By:  A.N.Kumar   |   3 Aug 2025 4:30 PM IST
Bandi Sanjay Fires Back I Wont Change With or Without Position
X

తెలంగాణలో రాజకీయ వేడి నిత్యం పెరుగుతూనే ఉంది. ఈ తరుణంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. చొప్పదండి నియోజకవర్గంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తనపై వస్తున్న ఆరోపణలకు ఘాటుగా స్పందించారు.

“పదవి మారినా నేను మారను”

"కేంద్ర మంత్రిగా ఉన్నా లేకున్నా నేను మారను. నేను ప్రజల మనిషిని. నాపై వచ్చే అవాస్తవాలను ప్రచారం చేయొద్దని కోరుతున్నా" అంటూ బండి సంజయ్ స్పష్టంగా చెప్పారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో తనను మంత్రి పదవి నుంచి తొలగించారని, తానే రాజీనామా చేశానంటూ జరుగుతున్న ప్రచారాలపై ఆయన తీవ్రంగా స్పందించారు. అవన్నీ అవాస్తవాలేనని ఖండించారు.

“పదవి కోరి కాదు.. పార్టీ ఆహ్వానం ఇచ్చి ఇచ్చింది”

బండి సంజయ్ మాట్లాడుతూ "నాకు మంత్రిత్వం కావాలని ఎప్పుడూ కోరలేదు. పార్టీ ఆహ్వానం ఇచ్చి నాకు బాధ్యతలు అప్పగించింది. భవిష్యత్తులో పార్టీ అవసరమైతే ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా" అన్నారు. తనను టార్గెట్ చేస్తూ కొంతమంది పని లేని వారు విమర్శలు చేస్తున్నారని, కానీ తాను ఎప్పుడూ ప్రజల కోసమే పనిచేస్తానని హామీ ఇచ్చారు.

"రిజర్వేషన్లపై కాంగ్రెస్ కక్షసాధింపు విధానం"

రాజకీయంగా కీలకమైన రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావిస్తూ, బండి సంజయ్ బీసీ సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. "42 శాతం రిజర్వేషన్ ఒక వర్గానికే ఇస్తే, మిగతా వర్గాల పరిస్థితి ఏమిటి? ముస్లింలకు 10 శాతం ఇచ్చి, అదే సమయంలో బీసీలకు 42 శాతం అంటారా? ఇది వంచన కాదు ఏమిటి?" అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

“బీజేపీ లక్ష్యం బీసీల అభ్యున్నతి”

బండి సంజయ్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వమే బీసీలకు మేలు చేయాలన్నదే లక్ష్యంగా పనిచేస్తోందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా బీసీ వర్గానికి చెందినవాడేనని, ఆయన్ను ప్రధానిగా చేసింది బీజేపీయే అని గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాల్లో 71 లక్షల కోట్ల రూపాయలు రైతులకు అందించిందని వెల్లడించారు. తనపై విమర్శలు చేస్తున్నవారిపై స్పందిస్తూ “ విమర్శలు చేయడం తగదు. నేను ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చా, ప్రజల కోసమే ఉంటా. ఒక్కొక్కరి లెక్కలు త్వరలో తేలతాయి” అని బండి సంజయ్ హెచ్చరించారు.

బండి సంజయ్ వ్యాఖ్యలు పార్టీ అంతర్గత పరిస్థితులకు, రాష్ట్ర రాజకీయాలకు ప్రాధాన్యతను చాటుతున్నాయి. పదవికి అతీతంగా ప్రజలతో మమేకమైన నాయకుడిగా కొనసాగుతానన్న ఆయన వ్యాఖ్యలు బీజేపీ వర్గాల్లో విశ్వాసాన్ని పెంచనున్నాయి. మరోవైపు, రిజర్వేషన్ అంశంపై బీసీలకు మద్దతుగా తీసుకున్న స్థానం, కాంగ్రెస్ ప్రభుత్వంపై వేసిన విమర్శలు రాజకీయ దిశలో కొత్త చర్చలకు దారి తీశాయి.