పవన్‌కు బండి సంజయ్ ప్రశంస.. రీజనేంటి?
తెలంగాణకు చెందిన బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్.. పవన్‌ను వేనోళ్ల కొనియాడారు. `పవన్ పెద్దమనసు చాటుకున్నారు
By: Garuda Media | 22 Dec 2025 6:00 AM ISTఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌కు ఊహించని ప్రశంసే దక్కింది. తెలంగాణకు చెందిన బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్.. పవన్‌ను వేనోళ్ల కొనియాడారు. `పవన్ పెద్దమనసు చాటుకున్నారు. బీఆర్ఎస్ నేతల కంటే ఆయనే నిజమైన అంజన్న భక్తుడు`` అని బండి పేర్కొన్నారు. దీనికి కారణం.. తెలంగాణలోని కొండగట్టు ఆంజనే యస్వామి(అంజన్న) ఆలయానికివచ్చే భక్తుల కోసం 96 గదులతో కూడి భారీ భవనాన్నినిర్మించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నుంచి సుమారు 35 కోట్ల రూపాయలు ఇప్పించేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నించి సక్సెస్ అయ్యారు.
తాజాగా టీటీడీ ఈ నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అంజన్న ఆలయం ఎదుర్కొంటున్న సుదీర్ఘ కాల సమస్య పరిష్కారం కానుంది. ఈ నిర్మాణాన్ని వచ్చే ఏడాది ప్రారంభించి 15 మాసాల్లో పూర్తి చేయాలని ప్రాధమికంగా నిర్ణయిం చారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్..పవన్‌కల్యాణ్‌పై ప్రశంసలు గుప్పించారు. అంజన్నపై భక్తితో పవన్ కల్యాణ్ చేసిన ప్రయత్నం ఫలించిందన్నారు. ఇదేసమయంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్‌పై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ అంజన్న ఆలయ అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు కేటాయిస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.
అయితే.. ఒక్క రూపాయి కూడా బీఆర్ ఎస్ హయాంలో ఇవ్వలేదని బండి తెలిపారు. ప్రజలనే కాదు.. దేవుళ్లను కూడా కేసీఆర్ మోసం చేశారని వ్యాఖ్యానించారు. ఇక, ప్రస్తుత ప్రభుత్వం కూడా భక్తులపై భారం మోపడమే తప్ప.. ఆలయ సౌకర్యాలపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. ఆలయ అభివృద్ధికి రూపాయి కూడా వెచ్చించకుండా.. సేవల రుసుములను మాత్రం భారీగా పెంచారని బండి దుయ్యబట్టారు. ``అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలు పట్టించుకోలేదు. కానీ, పవన్ కల్యాణ్ పెద్ద మనసుతో స్పందించారు. ఆయనకు ధన్యవాదాలు`` అని పేర్కొన్నారు. కాగా.. జనసేన-బీజేపీ పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. అయినా.. గతంలో ఎప్పుడూ బండి సంజయ్.. పవన్ గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం.
