Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరూ ముచ్చట...ఎంత బాగుందో కదా !

అవును ఆ ఇద్దరూ కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటే ఎంత బాగుందో కదా అనిపిస్తోంది. ఆ ఇద్దరూ తెల్లారి లేస్తే సోషల్ మీడియా వేదికగా ఒకరి మీద ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటారు.

By:  Satya P   |   28 Aug 2025 6:20 PM IST
ఆ ఇద్దరూ ముచ్చట...ఎంత బాగుందో కదా !
X

అవును ఆ ఇద్దరూ కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటే ఎంత బాగుందో కదా అనిపిస్తోంది. ఆ ఇద్దరూ తెల్లారి లేస్తే సోషల్ మీడియా వేదికగా ఒకరి మీద ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటారు. అలాగే మీడియా ముందు కూడా ఒకరి మీద మరొకరు విరుచుకుపడతారు. అయితే ఇదంతా రాజకీయాల్లో భాగమే అని ప్రజా సమస్యల కోసమే అన్నది వారు రుజువు చేశారు. మళ్లీ పాతకాలం నాటి రోజులు గుర్తుకు తెచ్చారు. ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరు అంటే కేంద్ర మంత్రి బీజేపీ నేత బండి సంజయ్, అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ ఇద్దరు ఎదురు ఎదురుగా తారసపడితే ఏమి జరిగింది అన్నదే అంతా ఆసక్తిగా చూసారు. అయితే ఈ ఇద్దరూ అలా చూసిన వారికి మరింత షాక్ ఇచ్చేశారు.

సిరిసిల్లలో ఇంట్రెస్టింగ్ సీన్ :

తెలంగాణలో భారీగా వానలు కురిసి అనేక జిల్లాలు వరద ముప్పులో చిక్కుకున్నాయి ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. దాంతో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్, అదే విధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సిరిసిల్లాలోని గంభీరావుపేట మండలంలో పర్యటిస్తున్నారు. ఇలా ఒక చోట ఇద్దరూ ఎదురు అయ్యారు. అంతే అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అంతా ఆశ్చర్యంగా చూశారు. ఏమి జరుగుతుంది అన్న ఉత్కంఠ అందరిలో ఉంది. అయితే కేటీఆర్ ని చూస్తూనే బండి సంజయ్ ఆయన దగ్గరగా వచ్చి హత్తుకున్నారు. కేటీఆర్ సైతం షేక్ హ్యాండ్ ఇచ్చి ఆప్యాయంగా పలకరిస్తూ ఆయన భుజం మీద చేయివేశారు. బాగున్నారా అంటూ ఒక‌రికొక‌రు ప‌లుక‌రించుకున్నారు. క‌ష్ట‌ప‌డుతున్నారని అంటూ ఈ సంద‌ర్భంగా బండి సంజ‌య్‌ను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

బండికి వివరించిన కేటీఆర్ :

ఇదిలా ఉంటే స్థానికంగా ఉన్న వరద పరిస్థితులను కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కి కేటీఆర్ వివరించారు. అదే విధంగా బండి సంజయ్ కూడా ఆయన చెబుతున్నది జాగ్రత్తగా విన్నారు. ఇదంతా సోషల్ మీడియాలో వీడియోగా రావడంతో రెండు పార్టీల క్యాడర్ సైతం హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రజా సమస్యల సాధన కోసం రాజకీయాలు ఉన్నవి. వాటి మీదనే వేరు వేరు పార్టీలు అయినా విమర్శలు చేసుకుంటూంటాయి. అంతమాత్రం చేత ఎవరు ఎవరికీ శత్రువులు కాదు, గతంలో రాజకీయం అలాగే జరిగేది ఇపుడు అంతా మారింది. అయితే ఈ సమయంలో కూడా ఇద్దరు నాయకులు ఈ విధంగా ఆప్యాయంగా పలకరించుకోవడం క్యాడర్ కి ఇచ్చే మంచి సందేశమే అని అంటున్నారు.

ఏపీలో ఊహించగలమా :

ఇక ఏపీలో కూడా అధికార విపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకుంటూంటాయి. అయితే నాయకులు ఎదురు పడితే ఇలాంటి సన్నివేశాన్ని ఊహించగలమా అని అంటున్నారు. తెలంగాణాలో వివిధ రాజకీయ పక్షాల నాయకులు ఏదో సందర్భంలో కలుస్తూంటారు. అలయ్ బలయ్ పేరుతో చేసే కార్యక్రమాల్లోనూ వారు పాల్గొంటారు. ఇతర వేదికల మీద అంతా కలసి మెలసి ఉంటారు. ఏపీలో మాత్రం గవర్నర్ రాజ్ భవన్ లో ఇచ్చే తేనీటి విందుకు కూడా కలిసే పరిస్థితి లేదని అంటారు ఏపీలో కూడా రాజకీయం మారాల్సి ఉందని ఇలాంటి సందర్భాలను చూసినపుడు అంతా అనే మాటగా ఉంటుంది.