కేటీఆర్ నెత్తిన 'స్మగ్లింగ్ కారు' బండ వేసిన బండి
ఏమాటకు ఆ మాటే చెప్పాలి. స్పైసీ వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు కేంద్ర సహాయ మంత్రి హోదాలో ఉన్న తెలంగాణ సీనియర్ బీజేపీ నేత బండి సంజయ్.
By: Garuda Media | 23 Sept 2025 10:01 AM ISTఏమాటకు ఆ మాటే చెప్పాలి. స్పైసీ వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు కేంద్ర సహాయ మంత్రి హోదాలో ఉన్న తెలంగాణ సీనియర్ బీజేపీ నేత బండి సంజయ్. పేరుకు కేంద్ర సహాయ మంత్రి అన్న పదవే కానీ.. ఆయన ఫోకస్ మొత్తం తెలంగాణ మీదనే ఉంటుంది. అందునా.. బీఆర్ఎస్ అగ్రనేతలపై అదిరే వ్యాఖ్యలు చేయటంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆయన మార్క్ ఆరోపణలతో ఒక్కసారి అందరిని ఉలిక్కిపడేలా చేశారు. ఇప్పుడు గులాబీ అగ్రనేతల్లో ఒకరైన కేటీఆర్ ను డిఫెన్సులో పడేలా చేసిన బండి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఎలా రియాక్టు అవుతారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ఇంతకూ బండి ఏమన్నారు? ఎలాంటి ఆరోపణలు చేశారు? దీంతో కేటీఆర్ ఆయన కుటుంబ సభ్యులు ఇరుకున పడినట్లేనా? అన్న ప్రశ్నలకు బండి ఆరోపణల్ని చూస్తే.. బీఆర్ఎస్ పార్టీ అక్రమంగా తీసుకొచ్చిన లగ్జరీ కార్లపై నడుస్తుందా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. లగ్జరీ కార్ల స్కాంలో నిందితుడు బసరత్ ఖాన్ అక్రమంగా దిగుమతి చేసుకున్న ల్యాండ్ క్రూజర్లలో ఒకదాన్లో కేటీఆర్ ఎందుకుతిరుగుతున్నారు? ఆ కారు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీ పేరుతో ఎందుకు రిజిస్టర్ అయ్యింది? మార్కెట్ ధర చెల్లించారా? లేదంటే ధర తక్కువగా చూపించి కొనుగోలు చేశారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
విదేశాల నుంచి ల్యాండ్ క్రూజర్ వాహనాల స్మగ్లర్ బసరత్ ఖాన్ ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ జరపగా.. దీనికి సంబంధించి తాను తప్పు చేసిన విషయాన్ని ఆయన అంగీకరించినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు..తాను అక్రమంగా తీసుకొచ్చిన కార్ల నంబర్లను అధికారులకు ఖాన్ అందజేసినట్లు సమాచారం. ఆయన ఇచ్చిన జాబితాలో టీజీ00డి6666 (కావాలనే దీని పూర్తి నెంబరు ఇవ్వలేదన్న విషయాన్ని వెల్లడించటం లేదు) నెంబరు మీద ఉన్న ల్యాండ్ క్రూజర్ వాహనాన్ని కేటీఆర్ ఉపయోగిస్తున్నట్లుగా అధికారుల ఎదుట బసరత్ఖాన్ చెప్పినట్లుగా చెబుతున్నారు.
ఇదిలా ఉండగా.. కేటీఆర్ కాన్వాయ్ లోని వాహనం ఎట్ హోం హాస్పిటాలిటీ సర్వీసెస్ పేరుతో రిజిస్టర్ అయినట్లుగా డీఆర్ఐ అధికారులు గుర్తించారు.దీంతో.. ఈ సంస్థకు కేటీఆర్ కుటుంబానికి ఉన్న సంబంధం ఏమిటన్న ఆరా తీస్తున్న వేళలో.. కేటీఆర్ సతీమణి శైలిమ.. ఎట్ హోం హాస్పిటాలిటీ సర్వీస్ సంస్థలో డైరెక్టర్ గా ఉన్నట్లుగా అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బసరత్ కు కేటీఆర్ కు మధ్య పరిచయం ఎలా ఏర్పడింది? ఎట్ హోం హాస్పిటాలిటీ సర్వీసెస్ అనే సంస్థను ఎలా ఏర్పాటు చేశారు? అందులో ఉన్నోళ్లు ఎవరు? ఈ సంస్థలో కేటీఆర్ సతీమణి శైలిమ డైరెక్టర్ గా ఉన్నారా? లాంటి అంశాలపై క్రాస్ చెక్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఒకవేళ.. బండి ఆరోపణలు నిజమైన పక్షంలో కేటీఆర్ తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటారని మాత్రం చెప్పక తప్పదు. మరేం జరుగుతుందో చూడాలి.
