తెలుగు రాష్ట్రాల జలజగడాలు ఇంకెన్నాళ్ళు..?
తెలుగు రాష్ట్రాల జలజగడాలకు సంబంధించి ...తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారుతున్నాయి.
By: Tupaki Political Desk | 10 Jan 2026 1:00 PM ISTతెలుగు రాష్ట్రాల జలజగడాలకు సంబంధించి ...తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారుతున్నాయి. మొన్న బనకచర్ల, నేడు రాయలసీమ ఎత్తిపోతలు...ఏపీపై ఏపీ అధికార, ప్రతిపక్షాలు అగ్గిమీద గుగ్గిలం అవున్న నేపథ్యంలో పరిష్కారానికి కేంద్రం కమిటీ నోటిఫై చేసిన సందర్భంలో... ఈ సమస్య ఇరు తెలుగురాష్ట్రాల సీఎంలే పరిష్కరించుకోవచ్చని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నడం సంచలనంగా మారుతోంది. ఈ విషయంగా ఏపీ ఒక అడుగు వేస్తే...తెలంగాణ పది అడుగులు వేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. నీళ్ళు కావాలా? పంచాయతీ కావాలా? అంటే తనకు కచ్చితంగా నీళ్ళే కావాలని అంటానని తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు తాజాగా హల్ చల్ చేస్తున్నాయి.
నిండు తెలుగు జాతి రెండు రాష్ట్రాలుగా విడిపోయి దశాబ్ద కాలం దాటినా....జలజగడాలు ఇప్పటికీ ఓ కొలిక్కి రావడం లేదు. గోదావరి, కృష్ణా జలాల వినియోగం పై ఇరు రాష్ట్రాల సమస్య పీటముడి విడిపోవడం లేదు. ఇరు రాష్ట్రాధినేతలు ఈ సమస్యను రాజకీయంగా లబ్ధి కోసం వాడుకుంటుండం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో సాగర్ డ్యామ్ వద్ద ఇరు రాష్ట్రాల నేతలు, పోలీసులు మోహరించి రచ్చరచ్చ చేసిన విషయం తెలిసిందే. అయితే అదంతా బీఆర్ఎస్ , వైఎస్సార్ సీసీ చేసిన ఎన్నికల స్టంట్ అంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారం ఆ పార్టీకి కలిసి వచ్చింది. బీఆర్ఎస్ గత ఎన్నికల్లో పరాజయం పాలవడానికి గల కారణాల్లో జలవివాదం కూడా ఒకటని చెప్పక తప్పదు. తదనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు సన్నిహిత సంబంధాలుండటంతో ఏ విధమైన సమస్యలు తలెత్తవనే అందరూ భావించారు. అందులోనూ తెలంగాణ సీఎం రేవంతర్ రెడ్డికి ఏపీ సీఎం గురువు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఖండిస్తున్నా...అది రాజకీయ రంగు పులుముకుని నలుగుతునే ఉంది.
ఈ నేపథ్యంలో ఆ మధ్యన ఆంధ్రప్రదేశ్ సీఎం రాయలసీమ ప్రయోజనాల కోసం బనకచర్ల డ్యామ్ నిర్మాణానికి గుట్టుచప్పుడు కాకుండా అన్నీ సిద్దం చేసుకున్నారని, కేంద్రం కూడా వత్తాసు పలుకుతోందన్న వార్త భగ్గుమంది. తెలంగాణ ప్రయోజనాలను సీఎం పణంగా పెట్టి తన గురువు ఏపీ సీఎం చేస్తున్న ఈ పనికి పరోక్షంగా మద్దతు పలుకు తున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ విరుచుకుపడింది. మాటల యుద్ధం చాలా జోరుగా సాగింది. వృథాగా పోతున్న గోదావరి జలాలను సద్వినియోగం చేసుకుంటే తప్పేంటని ఏపీ సీఎం పరోక్షంగా అన్నారు. ఏటా ఎన్నో టీఎంసీల గోదావరి నీళ్ళు సముద్రం పాలవుతున్నాయని, దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాలపై ఉందని వారి వాదన. పైగా ఎగువన తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు దిగువన ఎవరు ఏం కట్టినా ఆగమాగమం కావాల్సిన అవసరం ఏముందని ఏపీ కూటమి నేతలు, విశ్లేషకులు మీడియాలో జోరుగా చర్చలు చేశారు. పైగా బనకచర్లకు వాడుకునేది వృథా జాలాలే తప్ప నికర జలాలు కాదని కూడా వాదించారు. అయితే తెలంగాణ నేతల వాదన మరో రకంగా ఉంది. ఇపుడు వృథా జలాలని ప్రాజెక్టు కట్టేస్తే ...వాడుకుంటున్న ఆ నీటిపై ఏపీకి హక్కు వచ్చేస్తుంది. అప్పుడు తెలంగాణ ఆ మేరకు నీళ్లు కోల్పోవాల్సి వస్తుందని అంటున్నారు. మొత్తానికి బనకచర్ల వివాదం కాంగ్రెస్ మెడకు చుట్టేందుకు బీఆర్ఎస్ విశ్వప్రయత్నం చేసి...కొంతమేరకు విజయం సాధించింది.
బనకచర్ల కాస్త మరుగున పడిందో లేదో ఇపుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వివాదం తెరపైకి వచ్చింది. ఇది మరో సారి రచ్చరచ్చగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ఒత్తిడి తీసుకు రావడం వల్లే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపివేశారంటూ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కలకలం రేకెత్తించాయి. ఈ సారి ఈ వివాదం ఏపీ రాజకీయాల్లో చిచ్చు రేపింది. అధికార టీడీపీ నేతలు...ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నేతల మధ్య మాటలు హద్దులు దాటి బూతులు దాకా వెళ్ళింది. సీమ పౌరుషం టచ్ కావడంతో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి....తాడిపత్రి మునిసిపల్ ఛైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. కృష్ణా నది నీళ్ల వాటాకోసం తెలుగు రాష్ట్రాలు తగువులాడుకుంటున్న మాట వాస్తవం. ఈ ఇద్దరి కొట్లాటల మధ్య నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. ఒక్కోసారి వెయ్యి టీఎంసీల వరకు ఎవరికీ కాకుండా సముద్రంలోకి వెళ్లిపోతున్నాయి. కృష్ణా జలాల్లో తెలుగు రాష్ట్రాలకు దక్కిన వాటా 811 టీఎంసీలు. తాత్కాలికంగా తెలంగాణకు 299 టీఎంసీలు ఇచ్చినా.. వాడుకుంటున్నది మాత్రం 116, 117 టీఎంసీలే. ఏపీకి 512 టీఎంసీల కేటాయింపులున్నాయ్. గట్టిగా వాడినా 100 టీఎంసీలకు మించి వాడుకోలేకపోతోంది. ఇక గోదావని నీటి వినియోగం ఇంతకన్నా అధ్వాన్నమనే చెప్పాలి.
ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య దశాబ్దకాలంగా కొనసాగుతున్న నదీజలాల వివాదాలకు ముగింపు పలికేందుకు కేంద్ర జలశక్తి శాఖ ఒక ఉన్నతస్థాయి కమిటీ నోటిఫై చేసింది. ఈ కమిటీలో ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖకు చెందిన అత్యున్నత అధికారులు సభ్యులుగా ఉంటారు. కమిటీలో రెండు రాష్ట్రాల కీలక ప్రతినిధులకు చోటు కల్పించారు. కృష్ణా, గోదావరి నీటి యాజమాన్యాల బోర్డు ఛైర్మన్లు, నేషనల్ వాటర్ డెవలప్ మెంట్ ఏజెన్సీ సీడబ్ల్యూ సీ చీఫ్ ఇంజనీర్లు కమిటీలో భాగస్వాములుగా ఉంటారు. కనీసం ఈ కమిటీలో అయినా జలజగడాలు ఓ కొలిక్కి వస్తాయా అని పలువురు అంటున్నారు. తెలంగాణ ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని తెలంగాణ నేతలు అంటుంటే...ఎగువన ఉన్నది తెలంగాణ...దిగువన గోదావరి జలాల వినియోగానికి బనకచర్ల లాంటి ప్రాజెక్టులు కడితే తప్పేంటని ఏపీ కూటమి నేతలు వాదిస్తున్నారు. ఇకనైనా ఈ వివాదం సమసి పోతుందా? మరో పదేళ్ళదాకా కొనసాగుతుందా? అనేది ఇరు రాష్ట్ర నేతలే తేల్చి చెప్పాలి.
