Begin typing your search above and press return to search.

విశాఖ వేదికగా బనకచర్ల మీద భట్టి బిగ్ సౌండ్ !

ఏపీ నుంచే అందునా విశాఖ గడ్డ మీద నుంచే తెలంగాణా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్ట్ మీద సీరియస్ కామెంట్స్ చేశారు.

By:  Satya P   |   18 Aug 2025 9:33 AM IST
విశాఖ వేదికగా బనకచర్ల మీద భట్టి బిగ్ సౌండ్ !
X

ఏపీ నుంచే అందునా విశాఖ గడ్డ మీద నుంచే తెలంగాణా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్ట్ మీద సీరియస్ కామెంట్స్ చేశారు. బనకచర్ల ప్రాజెక్ట్ కానీ మరోటి కానీ తేల్చాల్సింది కేంద్రమే అని బంతిని ఎండీయే ప్రభుత్వం మీద వేశారు. దాంతో పాటుగా ఏపీలో గోదావరి మీద ఏ కొత్త ప్రాజెక్ట్ కట్టాలని చూసినా ముందు నీటి హక్కులు ఎవరికి ఎంత అన్నది తేలాల్సిందే అని భారీ కండిషన్ పెట్టారు. అలా తేల్చాల్సిన పెద్దన్న కేంద్రమే అన్నారు.

నీళ్ళ కోసమే తెలంగాణా :

విశాఖ పర్యటనకు వచ్చిన భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ బనకచర్ల మీద సీరియస్ ఆనే రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కానీ ఆ నినాదం వెనక ఉన్న భావోద్వేగాలు కానీ అన్నీ నీటి కోసమే అని సంచలన ప్రకటన చేశారు. అలా నీళ్ల హక్కుల కోసం తెలంగాణా సాధించుకున్న తాము ఎలా ఊరుకుంటామని మాట్లాడారు.

అప్పటిదాకా ఆగాల్సిందే :

తెలంగాణాలో ప్రస్తుతం నీటి ప్రాజెక్టులు కట్టడం పూర్తి కావాలని భట్టి అంటున్నారు. అంతే కాదు కేంద్రం జోక్యం తో నికర జలాలు మిగులు జలాలు వరద జలాలలో ఎవరి వాటా ఎంత అన్నది పక్కాగా లెక్క తేల్చాల్సిందే అని అన్నారు. అపుడు వరద జలాలు ఎంత మిగులుతాయన్న దాని మీద స్పష్టత వస్తుందని చెప్పారు. ఆ మీదట ప్రాజెక్టులు ఏపీ కట్టుకోవచ్చు అని చెప్పారు. ఈలోగా కొత్తగా గోదావరి మీద ఏ ప్రాజెక్ట్ కట్టినా తాము ఊరుకోమని స్పష్టం చేశారు.

బాబు మాటకు భట్టి రిటార్టు :

తాజాగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్ట్ మీద కీలక వ్యాఖ్యలనే చేశారు. బనకచర్ల కనుక నిర్మాణం అయితే తెలంగాణాకు అభ్యంతరం ఎందుకు అని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్ట్ వల్ల నష్టం ఎవరికీ లేదని అన్నారు. సముద్రంలో వృధాగా పోతున్న వాటర్ నే తాము కొంత ఒడిసి పట్టుకుని ప్రాజెక్టుని కడతామని అంటున్నామని చెప్పారు. వరదల వల్ల నష్టం తాము అనుభవిస్తున్నామని కూడా బాబు చెప్పారు. ఆ నష్టం తాము పడాలి కానీ ప్రాజెక్ట్ కట్టుకోకూడదా అని లాజిక్ పాయింట్ ని ఆయన లేవనెత్తారు.

అయితే బాబు చెప్పిన ఈ మాటలకు తెలంగాణా ససేమిరా అంటోంది. తెలంగాణా స్వాతంత్ర్య దినోత్స వేడుకల వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక్క చుక్క నీటిని తాము పోనీయమని స్పష్టం చేశారు. ఇపుడు ఏపీకి వచ్చిన భట్టి కూడా అదే మాట అని తేల్చేశారు. దాంతో బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో వివాదాలు తప్పేలా లేవు అని అంటున్నారు.