బనకచర్ల పై బాబు లాజిక్ కరెక్టేగా !
ఏపీలో బనకచర్ల ప్రాజెక్ట్ ని నిర్మించడం ద్వారా కరవుతో అల్లాడుతున్న రాయలసీమ జిల్లాలకు సాగు నీరు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెబుతున్నారు
By: Satya P | 16 Aug 2025 9:10 AM ISTఏపీలో బనకచర్ల ప్రాజెక్ట్ ని నిర్మించడం ద్వారా కరవుతో అల్లాడుతున్న రాయలసీమ జిల్లాలకు సాగు నీరు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెబుతున్నారు ఈ ప్రాజెక్ట్ అయితే చాలా ఖరీదైనది. అంతే కాదు భారీతనం తో కూడుకున్నది. కానీ చంద్రబాబు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేసి చూపిస్తామని చెబుతున్నారు. మరి బనకచర్ల మీద బాబుకు ఉన్న నమ్మకం కానీ పట్టుదల కానీ చూస్తే ఆసక్తి కలుగుతుంది.
గోదావరి వరద జలాలతో :
గోదావరికి ప్రతీ ఏటా ఏకంగా మూడు వేల టీఎంసీలకు తక్కువ లేకుండా వరద జలాలు పై నుంచి వస్తూంటాయి. అవన్నీ కూడా నేరుగా సముద్రంలోకి వృధాగా కలసిపోతున్నాయి. వాటిని ఒడిసి పట్టుకుంటే ఏపీలో అన్ని ప్రాంతాలకు నీరు ఇవ్వడమే కాకుండా కరవు రక్కసిని శాశ్వతంగా తరిమికొట్టొచ్చు అన్నది బాబు దృఢ సంకల్పం . దాని కోసం ఆయన నాలుగవ సారి సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే ఈ ప్రాజెక్ట్ ని బయటకు తెచ్చారు. ఏకంగా 81 వేల కోట్ల రూపాయల వ్యయంతో కూడిన భారీ ప్రాజెక్టు ఇది పోలవరం తో సరిసాటి ప్రాజెక్ట్ కూడా.
ఎవరికీ నష్టం లేదంటూ :
బనకచర్ల ప్రాజెక్ట్ మీద అపోహలు వద్దు అని స్వాతంత్ర్య దినోత్సవం వేళ బాబు గట్టిగా మరోసారి చెప్పారు. ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బంది ఉండే ప్రసక్తి లేదని అన్నారు ఈ ప్రాజెక్టుని వృధా జలాల నుంచే చేపడుతున్నామని అన్నారు. వేలది టీఎంసీలలో కేవలం రెండు వందల టీఎంల్సీలు తీసుకుంటే ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని అన్నారు. అందువల్ల ఎవరూ అభ్యంతరం చెప్పాల్సింది అయితే లేనే లేదని బాబు అంటున్నారు.
లాజిక్ పాయింట్ ఇదే కదా :
ఈ సందర్భంగా బాబు మరో మాట అన్నారు ఎగువ నుంచి వరద జలాలు పెద్ద ఎత్తున వస్తూంటే దిగువన ఉన్న ఏపీ వాటి నష్టాలను ప్రతీ ఏటా భరిస్తోంది కదా అని గుర్తు చేశారు. అంతే కాదు వరద బాధిత ప్రాంతాలు బాధితులతో వారికి అయ్యే ఖర్చులతో ఏపీకి అయ్యే నష్టాల సంగతేంటి అని కూడా ఆయన ప్రశ్నించారు. వరదలతో ఏపీ సతమతం కావాలి కానీ వరద జలాలు వాడుకోకూడదా అని సూటిగానే నిలదీశారు.
రాయలసీమ రతనాల సీమగా :
ఒకనాటి రతనాల సీమగా రాయలసీమను చేస్తామని చంద్రబాబు చెప్పారు. గోదావరి జలాల తరలింపుతోనే అది సాధ్యపడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో పొరుగు రాష్ట్రం ఎలాంటి ఇబ్బందులు వస్తాయని ఆలోచన కూడా చేయాల్సిన అవసరం లేదని బాబు అన్నారు. మొత్తం మీద లాజిక్ తోనే బనకచర్ల పధకాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని బాబు చూస్తున్నారు. ఇటీవల విజయవాడ వచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా వేలాది గోదావరి జిలాలు సముద్రం పాలు అవుతున్నాయని సభాముఖంగానే చెప్పారు. వృధాగా పోతున్న నీటిని వాడుకుంటామంటే ఎవరూ అడ్డు చెప్పరనే అంటున్నారు. తెలంగాణా సైతం ఈ విషయంలో సానుకూలంగా ఆలోచిస్తుందని బనకచర్ల ముందుకు వెళ్ళేందుకు సహకరిస్తుందని అంతా ఆశిస్తున్నారు.
