'బనకచర్ల'.. నీటి వివాదం కాదు.. పొలిటికల్ ఫైటే!
ఈ క్రమంలో బీఆర్ ఎస్ కొన్నాళ్లుగా మౌనంగా ఉంది. ఈ విషయంపై సమయం వచ్చినప్పుడు స్పందిస్తామని ప్రకటించింది
By: Garuda Media | 11 Aug 2025 8:30 AM ISTరెండు తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదానికి కారణమైన బనకచర్ల(ఏపీలోని కర్నూలులో నిర్మించాలని భావిస్తున్న ప్రాజెక్టు) విషయంలో తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టు వ్యవహారాన్ని ఇప్పటి వరకు ఇరు రాష్ట్రాలు కూడా నీటి వివాదంగా చూశాయి. చూస్తున్నాయి. దీనిని అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం, కాదు, అనుమతించాలని ఏపీ ప్రభుత్వం కూడా.. కేంద్రం వద్ద పోరాటం చేశాయి. చేస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ ఎస్ కొన్నాళ్లుగా మౌనంగా ఉంది. ఈ విషయంపై సమయం వచ్చినప్పుడు స్పందిస్తామని ప్రకటించింది.
మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ఈ బనకచర్లకు జగన్, కేసీఆర్ ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలోనే బీజం పడిందని..అప్పట్లో జగన్‌తో మిలాఖత్ అయిన కేసీఆర్ బనకచర్లకు అనుమతి ఇచ్చేశారని వ్యాఖ్యానిస్తున్న విషయం తెలిసిందే. అయి తే, అటు కేసీఆర్, ఇటు జగన్ కూడా స్పందించలేదు. ఇక, ఈ వ్యవహారం.. ప్రస్తుతం గత వారం రోజులుగా సర్దుమణిగింది. దీని వెనుక కారణాలు ఏమయ్యాయనేది తెలియాల్సి ఉంది. ఇదిలావుంటే, ఈ బనకచర్ల వ్యవహారాన్ని నీటి వివాదంగా కాకుండా.. రాజకీయంగానే వినియోగించుకునేలా బీఆర్ ఎస్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తీసుకున్న రెండు కీలక నిర్ణయాలు.. దీనికి దన్నుగా నిలుస్తున్నాయి.
1) ప్రజల్లో పోరాటం: బనకచర్ల ప్రాజెక్టుపై ప్రజల్లో చర్చించేలా బీఆర్ ఎస్ పార్టీ కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థి సంఘాల నుంచి కార్మిక సంఘాల వరకు కూడా దీనిపై అవగాహన కల్పించి.. ప్రజల మధ్యకు పంపించాలని.. తద్వారా..వారు ప్రజలకు వివరించేలా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ.. ఈ ప్రచారం చేయాలని నిర్ణయించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణకు, ఇక్కడి రైతులకు అన్యాయం చేస్తోందన్న వాదనను బలంగా వినిపించే ప్రయత్నంలో బీఆర్ ఎస్ నాయకత్వం ఉంది. దీనిని గ్రామ గ్రామానా కూడా ప్రచారం చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చి నట్టు తెలుస్తోంది.
2) న్యాయ పోరాటం: బనకచర్లపై ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం రాజకీయంగా మాత్రమే కేంద్రంతో చర్చిస్తోంది. ఏపీని నిలు వరించాలని.. బనకచర్ల కట్టకుండా అడ్డుకోవాలని కోరుతోంది. కేంద్రం ఈ విషయంలో పెద్దగా స్పందించడం లేదు. అయితే, న్యాయ పోరాటం చేసేందుకు అవకాశం ఉండి కూడా రేవంత్ రెడ్డి సర్కారు అలా చేయడం లేదని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలో తామే న్యాయపోరాటం చేయడం ద్వారా ప్రభుత్వంపై పైచేయి సాధించే అవకాశం ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై నేరుగా సుప్రీంకోర్టులోనే కేటీఆర్ పిటిషన్ వేయనున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై న్యాయనిపుణుల నుంచి సలహాలు సూచనలు కూడా తీసుకున్నారు. సో.. మొత్తంగా బనకచర్ల వ్యవహారం.. నీటి నుంచి రాజకీయాల వైపు మళ్లిందనే చర్చ జోరుగా సాగుతోంది.
