Begin typing your search above and press return to search.

బాంబినో వ్యవస్థాపకుడి ఆస్తి వివాదం: కుమార్తెలపై కేసు.. అసలేం జరిగింది?

మ్యాడం కిషన్‌రావు 1982లో బాంబినో అగ్రో ఇండస్ట్రీస్‌ను స్థాపించారు. అంతకు ముందే , 1973లో రేవతి టొబాకో కంపెనీని ప్రారంభించారు.

By:  A.N.Kumar   |   21 Oct 2025 12:25 PM IST
బాంబినో వ్యవస్థాపకుడి ఆస్తి వివాదం: కుమార్తెలపై కేసు.. అసలేం జరిగింది?
X

హైదరాబాద్‌ నగరానికి చెందిన ప్రముఖ ఆహార తయారీ సంస్థ ‘బాంబినో’ వ్యవస్థాపకుడు మ్యాడం కిషన్‌రావు కుటుంబంలో ఆస్తి, షేర్ల బదిలీ వివాదం తెరపైకి వచ్చింది. కిషన్‌రావు పేరిట ఉన్న షేర్లను ఆయన నలుగురు కుమార్తెలు అక్రమంగా తమ పేర్లపైకి బదిలీ చేసుకున్నారంటూ ఆయన మనవడు కార్తికేయ హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్‌) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కిషన్‌రావు కుమార్తెలైన అనూరాధ, శ్రీదేవి, ఆనందదేవి, తుల్జాభవానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

*కంపెనీల స్థాపన చరిత్ర

మ్యాడం కిషన్‌రావు 1982లో బాంబినో అగ్రో ఇండస్ట్రీస్‌ను స్థాపించారు. అంతకు ముందే , 1973లో రేవతి టొబాకో కంపెనీని ప్రారంభించారు. ఈ రెండు కంపెనీల్లో కిషన్‌రావుకు ప్రధాన వాటా ఉంది. రేవతి టొబాకో కంపెనీలో ఆయనకు 98.23 శాతం వాటా ఉండగా, మిగిలిన 1.77 శాతం వాటా ఆయన భార్య సుగంధబాయి పేరిట ఉంది. రేవతి టొబాకో కంపెనీకి రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తిలో 184 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు రూ.120 కోట్లుగా అంచనా వేయబడింది.

* వివాదం ఎలా మొదలైంది?

2021లో మ్యాడం కిషన్‌రావు మరణించిన తర్వాత, ఆయన ఆస్తులు.. కంపెనీ షేర్ల పంపకంపై కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తాయి.. కార్తికేయ ఫిర్యాదు ప్రకారం... కిషన్‌రావు రాసిన వీలునామాలో ఉన్న నిబంధనలకు వ్యతిరేకంగా ఆయన కుమార్తెలు కలిసి షేర్లను తమ పేర్లకు బదిలీ చేసుకున్నారని ఆరోపించారు. ప్రతి కుమార్తె 24.55 శాతం చొప్పున షేర్లను తమ పేర్లపైకి బదిలీ చేసుకోవడం ద్వారా వీలునామా ఉల్లంఘన జరిగిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా నందివనపర్తిలోని రూ.120 కోట్ల విలువ గల భూమి పంపకాల విషయంలో కూడా ఈ నలుగురు కుమార్తెలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని కార్తికేయ ఆరోపించారు.

* పోలీసుల దర్యాప్తు

ఫిర్యాదు ఆధారంగా సీసీఎస్ పోలీసులు వీలునామా ఉల్లంఘన, ఆస్తుల అక్రమ బదిలీ, షేర్ల దుర్వినియోగం వంటి కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసుతో బాంబినో కుటుంబ ఆస్తుల వివాదం మరోమారు చర్చనీయాంశంగా మారింది.

* బాంబినో సంస్థ గురించి

బాంబినో అగ్రో ఇండస్ట్రీస్ భారతదేశంలో ప్రముఖ ఆహార తయారీ సంస్థగా నిలిచింది. సేమియా, మాకరోనీ, పాస్తా ఉత్పత్తులు, స్నాక్స్, మసాలాలు వంటి అనేక ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులను తయారు చేస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థ ఉత్పత్తులు భారతదేశంతో పాటు 35 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. 1982లో స్థాపించబడిన ఈ కంపెనీ, హైదరాబాద్ నుండి ప్రపంచ మార్కెట్ వరకు తన సత్తా చాటుకుంటూ ఎదిగింది.

మొత్తానికి బాంబినో వ్యవస్థాపకుడి కుటుంబంలో ఉద్భవించిన ఈ ఆస్తి వివాదం, పరిశ్రమ వర్గాలే కాకుండా వ్యాపార రంగంలోనూ పెద్ద చర్చగా మారింది. షేర్ల బదిలీ చట్టబద్ధతపై సీసీఎస్ పోలీసుల దర్యాప్తు తుది నిర్ణయాన్ని ఇవ్వనుంది.