Begin typing your search above and press return to search.

బలోచ్ ఆర్మీ చెరలో పాకిస్తాన్ సైనికుల కన్నీళ్లు..

ఈ వీడియో వెలువడిన తర్వాత కూడా పాకిస్తాన్ సైన్యం లేదా ప్రభుత్వం నుంచి ఎలాంటి తాజా ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ ఘటనపై మరింత సందిగ్ధత నెలకొంది.

By:  A.N.Kumar   |   20 Feb 2026 11:56 PM IST
బలోచ్ ఆర్మీ చెరలో పాకిస్తాన్ సైనికుల కన్నీళ్లు..
X

పాకిస్తాన్‌లో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. బలోచ్ వేర్పాటువాద సంస్థ బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్) విడుదల చేసిన తాజా వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమ వద్ద బందీలుగా ఉన్నట్లు పేర్కొన్న పాకిస్తాన్ సైనికుల దృశ్యాలను విడుదల చేస్తూ పాకిస్తాన్ సైన్యపు ప్రకటనలను బీఎల్ఏ సవాల్ చేసింది. ఇటీవల విడుదలైన ఈ వీడియోలో మోకాళ్లపై కూర్చున్న పలువురు పాకిస్తాన్ సైనికులు కనిపిస్తున్నారు. వారి వెనుక ఆయుధాలతో ఉన్న బలోచ్ ఆర్మీ కనిపిస్తున్నారు. బీఎల్ఏ ప్రకారం వీరు పాకిస్తాన్ ఆర్మీకి చెందిన సైనికులు. అయితే పాకిస్తాన్ సైన్యం మాత్రం తమ సిబ్బంది ఎవరూ అదృశ్యమవలేదని, ఎవరూ మిలిటెంట్ల చేతుల్లో లేరని ఇప్పటికే ప్రకటించింది.

సైనికుల గుర్తింపు కార్డులు చూపిస్తూ వీడియో

వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులు తమను పాకిస్తాన్ ఆర్మీలో అధికారికంగా నియమించారని తమ వద్ద ఉన్న ఐడీ కార్డులు, నేషనల్ ఐడెంటిటీ కార్డులు చూపిస్తూ పేర్కొన్నారు. “మేము పాకిస్తాన్ కోసం పోరాడుతున్నాం… కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ మమ్మల్ని ఒప్పుకోవడం లేదు” అంటూ ఒక సైనికుడు భావోద్వేగంతో మాట్లాడినట్లు తెలుస్తోంది. “మేము వారి సిబ్బంది కాదని ఎలా చెబుతారు?” అని ప్రశ్నించాడు.

7 మంది కాదు… 8 మంది బందీలు?

ముందుగా బీఎల్ఏ ఏడుగురు సైనికులను పట్టుకున్నట్లు సమాచారం వెలువడింది. అయితే తాజా వీడియోలో ఎనిమిది మంది కనిపించడం గమనార్హం. దీంతో అసలు పరిస్థితి ఏంటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గడువు దగ్గరపడుతోంది… ఉత్కంఠ

బీఎల్ఏ తమ డిమాండ్లను నెరవేర్చకపోతే బందీలను హతమార్చుతామని హెచ్చరించింది. ఖైదీల మార్పిడి కోసం ఫిబ్రవరి 22 వరకు గడువు ఇచ్చినట్లు ప్రకటించింది. గడువు ముగియడానికి కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో పరిస్థితి మరింత ఉత్కంఠభరితంగా మారింది.

చర్చలు ప్రారంభించాలంటూ బందీల విజ్ఞప్తి

వీడియోలో ఉన్న సైనికులు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, సైన్యాధికారులను వేడుకున్నారు. బలోచ్ ఖైదీలతో మార్పిడి జరిపి తమను విడుదల చేయాలని కోరారు. తమ ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

స్పందన లేని పాకిస్తాన్ ప్రభుత్వం

ఈ వీడియో వెలువడిన తర్వాత కూడా పాకిస్తాన్ సైన్యం లేదా ప్రభుత్వం నుంచి ఎలాంటి తాజా ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ ఘటనపై మరింత సందిగ్ధత నెలకొంది.

బలోచిస్తాన్ సమస్య మళ్లీ తెరపైకి

బలోచిస్తాన్ స్వతంత్రత కోసం పోరాడుతున్న బలోచ్ లిబరేషన్ ఆర్మీ, పాక్ ప్రభుత్వం తమ సహజ వనరులను దోపిడీ చేస్తోందని ఆరోపిస్తోంది. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం బీఎల్ఏను ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ వారి ఆరోపణలను ఖండిస్తోంది.

ఈ ఘటనతో బలోచిస్తాన్‌లో భద్రతా పరిస్థితులు, పాకిస్తాన్ సైన్యం వైఖరి మరోసారి ప్రశ్నార్థకంగా మారాయి. రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా మారుతుందన్నది ఆసక్తిగా మారింది.