షాకింగ్... రూ.1,500 పంచుకునే క్రమంలో హత్య!
ప్రతీ చిన్న, పెద్ద సమస్యకు ప్రాణం తీయడమే పరిష్కారం అన్నట్లుగా ఇటీవల కాలంలో పలువురి ఆలోచనా విధానం మారిపోతుంది.
By: Raja Ch | 26 Nov 2025 9:35 AM ISTప్రతీ చిన్న, పెద్ద సమస్యకు ప్రాణం తీయడమే పరిష్కారం అన్నట్లుగా ఇటీవల కాలంలో పలువురి ఆలోచనా విధానం మారిపోతుంది. ప్రధానంగా భార్యభర్తలు, స్నేహితులు వంటి వారి మధ్య ఈ తరహా ఘటనలు వెలుగు చూస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో తాజాగా రూ.1,500 పంచుకునే క్రమంలో తన స్నేహితుడిని చంపిన ఓ వ్యక్తి వ్యవహారం తాజాగా తెరపైకి వచ్చింది. ఈ కేసును పోలీసులు ఛేదించారు.
అవును.... కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి నగరాభివృద్ధి ప్రాధికార (బుడా) కాంప్లెక్స్ లో ఈ నెల 17న సుమారు 25 ఎళ్ల వయస్సు గల యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. దీని విషయంపై ఏపీఎంసీ మార్కెట్ యార్డ్ పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో తాజాగా ఆ కేసును ఛేధించారు. హత్య జరిగిన ప్రదేశంలో ఇద్దరు యువకులు నడుచుకుంటూ వెళ్లినట్లు గుర్తించి కేసు శోధించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ నేపథ్యంలో... హత్యకు గురైన యువకుడు బళ్లారి నగరం ఆంధ్రాళ్ కు చెందిన శివ (25) కాగా.. హత చేసిన యువకుడు చిత్రదుర్గం జిల్లా మొలకాల్మూరుకు చెందిన సతీష్ (21)గా గుర్తించినట్లు పోలీసులు వివరించారు. ఈ క్రమంలో సతీశ్ ను అరెస్ట్ చేసి, విచారణ అనంతరం న్యాయమూర్తి ముందు హాజరు పరిచి, సెంట్రల్ జైలుకు తరలించినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు.
అసలేం జరిగింది?:
స్నేహితులైన శిన, సతీష్ లు ఈ నెల 17న కొన్ని అల్యూమినియం కడ్డీలను అమ్మడంతో వారికి రూ.1,500 నగదు వచ్చింది. ఈ క్రమంలో.. ఆ డబ్బులో రూ.300 మాత్రమే సతీష్ కు ఇచ్చాడు శివ. మిగిలిన రూ.1,200 తనవద్దే ఉంచుకున్నాడు. అయితే.. ఆ రోజు రాత్రి 6 నుంచి 10:30 గంటల వరకూ ఇద్దరూ కల్సి బుడా వాణిజ్య కాంప్లెక్స్ లోని రెండో అంతస్తులో మద్యం తాగారు.
ఈ సమయంలో.. ఆ రూ.1,500ల్లో తనకు రావాల్సిన మిగిలిన రూ.400 వాటా తనకు ఇవ్వాలని శివతో ఘర్షణ పడ్డాడు సతీష్. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. వ్యవహారం చేతలవరకూ వెళ్లింది! ఈ సమయలో తన చేతిలో ఉన్న బీరు సీసాతో శివ తలపై బలంగా కొట్టాడు సతీష్. దీంతో.. శివ అక్కడికక్కడే కూలిపోయాడు.
ఈ నేపథ్యంలో.. తాము కూర్చున్న రెండో అంతస్తు నుంచి శివ మృతదేహాన్ని కిందకు పడేశాడు సతీష్. దీంతో.. కాళ్లూ, చేతులు విరిగిపోయి తలకు బలమైన గాయాలయ్యాయి. అనంతరం.. మృతదేహాన్ని అన్నపూర్ణ క్యాంటీన్ సమీపంలోని చెత్తబుట్టలో పడేసి అక్కడ నుంచి సతీష్ వెళ్లిపోయాడు. ఉదయం స్థానిక ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా సతీష్ ను అరెస్ట్ చేసి, విచారించారు. ఫలితంగా... మొత్తం విషయం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే హత్యకు గురైన యువకుడిని శివగా, హంతకున్ని సతీష్ గా పోలీసులు గుర్తించారు.
