'గాలి' మళ్లిన ఘర్షణ.. బళ్లారి ఎస్పీ ఆత్మహత్యాయత్నం
కర్ణాటక రాజకీయాల్లో సంచలనం.. గురువారం రాత్రి బళ్లారి నగరంలో స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి వర్గీయుల ఘర్షణ.
By: Tupaki Political Desk | 3 Jan 2026 5:27 PM ISTకర్ణాటక రాజకీయాల్లో సంచలనం.. గురువారం రాత్రి బళ్లారి నగరంలో స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి వర్గీయుల ఘర్షణ. మొన్నటివరకు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య అధికార మార్పిడి వివాదంతో హాట్ హాట్ గా మారిన కర్ణాటకలో ఆ వివాదం ఎటూ తేలదేదు. ఇంతలోనే కర్ణాటక రాజ్య ప్రగతి పక్ష (కేఆర్ పీపీ) వ్యవస్థాపకుడు అయిన గాలి జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గాలు బళ్లారిలో ఘర్షణకు దిగాయి. గురువారం ఉదయం మొదలైన వాల్మీకి ఫ్లెక్సీ కట్టే వివాదం చినికిచినికి గాలి వానగా మారి రాత్రి వేళకు పోలీసు కాల్పుల దాక దారితీసింది. ఈ కాల్పుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనుచరుడు చనిపోవడంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అటువైపు ఉన్నది బీజేపీ మాజీ నేత, ప్రతిపక్ష కేఆర్ పీపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి కావడంతో సిద్ధరామయ్య ప్రభుత్వం.. బళ్లారి ఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాల్పులకు ఆదేశించి...
గాలి, నారా భరత్ రెడ్డి వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో బళ్లారిలో గురువారం రాత్రి పోలీసులను ఆ జిల్లా ఎస్పీ పవన్ నిజ్జూర్ కాల్పులకు ఆదేశించారు. ఈ క్రమంలోనే లాఠీచార్జి కూడా చేశారు. వాస్తవానికి ఘర్షణల సమయానికి గాలి జనార్దనరెడ్డి గంగావతిలో ఉన్నారు. భరత్ రెడ్డి ఆ ప్రదేశంలో లేరు. అయితే, కార్యకర్తల మధ్య వివాదం తీవ్రం అవుతున్న సమయంలో లాఠీచార్జినే కాక ఏకంగా ఫైరింగ్ ఆర్డర్ ఇవ్వడం.. అందులో అధికార కాంగ్రెస్ కార్యకర్త చనిపోవడం, మరొకరు తీవ్రంగా గాయపడడంతో ఎస్పీ బాధ్యుడు అయ్యారు.
సస్పెండ్ చేసిన ప్రభుత్వం
బళ్లారి ఘర్షణల నేపథ్యంలో.. ఎస్పీ పవన్ నిజ్జూర్ ను సిద్ధరామయ్య సర్కారు సస్పెండ్ చేసింది. కానీ, ఈ చర్యను ఆయన తట్టుకోలేకపోయారు. మనస్తాపానికి గురై ఆత్మహత్యా యత్నం చేశారు. కాగా, అఖిల భారత సర్వీసు అధికారులు అయినప్పటికీ కర్ణాటకలో విధి నిర్వహణ అధికారులకు ఎప్పుడూ కత్తిమీద సామే. గతంలో తెలుగు ఐఏఎస్, ఐపీఎస్ మహిళా అధికారులు ఘర్షణకు దిగారు. దీనికిముందు ఓ యువ సివిల్ సర్వెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇప్పుడు ఏకంగా ఓ ఎస్పీనే ఆత్మహత్యాయత్నం చేశారు.
