బళ్లారిలో తీవ్ర ఉద్రిక్తత: గాలి జనార్దన్ మోడల్ హౌస్ కు నిప్పు
తొలుత మోడల్ హౌస్ మీద దాడి చేసి.. అనంతరం ఇంట్లో ఉన్న తలుపులు.. కిటికీలను ధ్వంసం చేసి.. ఆపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు.
By: Garuda Media | 24 Jan 2026 10:24 AM ISTకొత్త సంవత్సరం ఆరంభంలో బళ్లారిలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల గురించి తెలిసిందే. ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థాయికి వస్తున్నాయని భావిస్తున్న వేళలో.. అనూహ్య ఘటన చోటు చేసుకోవటం.. బీజేపీ నేత గాలి జనార్దన్ రెడ్డి మోడల్ హౌస్ ను నిప్పు పెట్టిన వైనం తాజా ఉద్రిక్తతలకు దారి తీసింది. కొత్త సంవత్సర వేళ బ్యానర్ కట్టే విషయంలో కాంగ్రెస్ - బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సందర్భంగా బళ్లారిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనటం.. ఆ సందర్భంగా జరిగిన గొడవల్లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒకరు మరణించారు.
ఈ ఉదంతంలో కాంగ్రెస్ - బీజేపీ కార్యకర్తలు.. సానుభూతిపరులు.. నేతల మధ్య పరస్పర విమర్శలు.. ప్రతి విమర్శలు చోటు చేసుకున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. దీంతో ఇప్పుడే అక్కడ పరిస్థితులు నెమ్మదిగా చక్కబడుతున్నాయి. ఇలాంటి వేళలో.. కంటోన్మెంట్ లోని జి స్క్వేర్ లే అవుట్ లో గాలి జనార్దన్ కి చెందిన మోడల్ హౌస్ కు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు.
తొలుత మోడల్ హౌస్ మీద దాడి చేసి.. అనంతరం ఇంట్లో ఉన్న తలుపులు.. కిటికీలను ధ్వంసం చేసి.. ఆపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే కం జనార్దన్ రెడ్డి సోదరుడు గాలి సోమశేఖర్ రెడ్డి కాలిపోయిన ఇంటిని సందర్శించారు. ఇదంతా రాజకీయశత్రుత్వంలో భాగంగా బళ్లారి సిటీ ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుల పనేనని ఆయన ఆరోపించారు.
బ్యానర్ కట్టే సందర్భంలో చోటు చేసుకున్న అల్లర్ల సందర్భంగా.. జనార్దన్ రెడ్డి ఇంటిని తగలబెడతామని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారని.. జనార్దన్ రెడ్డి ఉంటున్న ఇంటిని తగలబెట్టటం సాధ్యం కాదు కాబట్టి.. బళ్లారి మోడల్ హౌస్ ను తన అనుచరులతో నిప్పు పెట్టించి ఉంటారని ఆరోపించారు. మోడల్ హౌస్ కు నిప్పు పెట్టిన ఒక యువకుడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిప్పు పెట్టిన వారిని గుర్తించి అరెస్టు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఈ ఉదంతంలో బాధ్యలుగా భావిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్యంగా విచారణ జరుపుతున్నట్లుగా చెబుతున్నారు. ఇక.. మోడల్ హౌస్ పెద్ద ఎత్తున కాలిపోయినట్లుగా చెబుతున్నారు.
