Begin typing your search above and press return to search.

బాలినేని వైసీపీలోకి వచ్చేస్తున్నారా ?

ఇక జనసేనలో బాలినేని ఇమడలేకపోతున్నారు అని అంటున్నారు. ఆయనకు ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనరావుతో ఆయనకు విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి.

By:  Satya P   |   5 March 2026 8:15 AM IST
బాలినేని వైసీపీలోకి వచ్చేస్తున్నారా ?
X

ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ మోస్ట్ లీడర్ అయుదు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రిగా గెలిచిన వారు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆయన కాంగ్రెస్ నుంచి తొలిసారి 1999లో ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత వైఎస్సార్ జమానాలో మంత్రి కూడా అయ్యారు. ఇక వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా చేశారు అయితే 2022 లో వైసీపీ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి పోయింది. నాటి నుంచి ఆయన తీవ్ర అసంతృప్తికి లోను అయ్యారని అంటారు ఇక 2024 లో వైసీపీ భారీ ఓటమి తరువాత ఆయన కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. ఇక ఆయన తన దారి తాను చూసుకున్నారు. అదే జనసేన రూట్ అని చెబుతారు.

ఏణ్ణర్ధంగా అలాగే :

ఇక జనసేనలో బాలినేని ఇమడలేకపోతున్నారు అని అంటున్నారు. ఆయనకు ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనరావుతో ఆయనకు విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలీ అంటే ఈ ఇద్దరూ సుదీర్ఘకాలంగా రాజకీయ ప్రత్యర్ధులు. ఈ ఇద్దరి మధ్య 2012 ఉప ఎన్నికల నుంచి పోటీ ఏర్పడింది. 2012లో బాలినేని గెలిచారు. 2014లో తిరిగి ఇద్దరూ పోటీ చేస్తే దామచర్ల గెలిచారు 2019లో దామచర్లను బాలినేని ఓడిస్తే 2024లో బాలినేనిని దామచర్ల ఓడించారు. ఇలా రాజకీయంగా తీవ్ర స్థాయిలో వైరం కొనసాగుతున్న ఈ ఇద్దరూ కూటమిలో మిత్రులుగా ఇమడలేకపోతున్నారు. ఒక ఒరలో రెండు కత్తులు సరిపడవన్న తీరున అక్కడ వ్యవహారం ఉంది.

ఢీ అంటే ఢీ :

ఇదిలా ఉంటే తాజాగా బాలినేని నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఢీ అంటే ఢీ కొడతాను అని సవాల్ చేసే విధంగా మాట్లాడారు. ఇది నిజంగా కూటమిలో రెండు పార్టీల నాయకుల మధ్య ఉండాల్సిన సామరస్య వైఖరికి భిన్నమైన తీరుగానే అంతా చూస్తున్నారు. పైగా అటూ ఇటూ విమర్శలు చేసుకుంటున్నారు. ఇక జనసేనలో కూడా బాలినేనికి ఆశించిన విధంగా ప్రాధాన్యత అయితే దక్కలేదని అంటున్నారు. దీంతో ఆయన ఇపుడు కూటమిలో ఉంటూనే బిగ్ సౌండ్ చేస్తున్నారు.

బయటకు వస్తారా :

ఇక బాలినేని విషయం తీసుకుంటే ఆయన కూటమిలో ఉంటూ అక్కడ బిగ్ సౌండ్ చేస్తే ఆల్టర్నేషన్ పాలిటిక్స్ ఏమిటి ఎలా ఉంటుంది అన్నది కూడా చర్చగా ఉంది. ఆయన తిరిగి వైసీపీలోకి వస్తారా అన్నది కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఆయన గట్టిగా మాట్లాడుతున్నారు అంటే వేరే విధంగా ఆలోచనలు చేయకుండా ఉంటారా అన్న చర్చకు తెర లేస్తోంది. ఇక వైసీపీలో ఆయన తిరిగి చేరాలనుకుంటే ఆయనకు అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అన్నది కూడా మరో చర్చగా ఉంది.

ధీటైన నేతగా :

బాలినేని చూస్తే ధీటైన నేతగా ఉన్నారు. ఆయన మొదటి నుంచి యాంటీ టీడీపీ పొలిటికల్ క్యాంప్ లోనే ఉన్నారు. దాంతో ఆయనకు వైసీపీయే సరైన ఫ్లాట్ ఫారం అన్న మాట అయితే ఉంది. మరి వైసీపీలో చేర్చుకుంటారా అంటే వైసీపీ సైతం నేతల కోసం చూస్తోంది అన్నది కూడా ఉంది. అందులోనూ బాలినేని జగన్ కి అత్యంత సన్నిహితులుగా ఉండేవారు పైగా బంధుత్వం కూడా ఉంది. దాంతో గతం గతహా అనుకుంటే మాత్రం బాలినేనికి ఫ్యాన్ నీడలో ఉన్నత సుఖం వేరొకటి ఉండదని అంటున్నారు. మొత్తం మీద ఈ రోజు కాకపోయినా రేపటికి అయినా బాలినేని వైసీపీ వైపు వస్తారు అన్న ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.