వైసీపీకి ఫుల్ క్లారిటీ ఇచ్చిన బాలినేని...లీడర్ అంటే ఆయనే !
ఇది జరిగిన కొద్ది గంటలలోనే బాలినేని జనసేన అధినేత పవన్ తో మీట్ అయ్యారు. తన కుమారుడిని సైతం వెంటబెట్టుకుని ఆయన్ని కలసినట్లుగా తెలుస్తోంది.
By: Satya P | 19 March 2026 2:56 PM ISTఒంగోలు జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కీలకమైన స్థానం ఉంది. ఆయన 1999లో తొలిసారి గెలిచారు. అదే ఊపులో 2004, 2009లలో గెలిచారు. ఇక 2012 ఉప ఎన్నికల్లో గెలిచిన బాలినేని 2019లో మళ్ళీ గెలిచారు. ఇలా అయిదు సార్లు గెలిచి వైఎస్ఆర్ జగన్ ల మంత్రివర్గంలో కీలక శాఖలను చూసిన బాలైనేని 2024 లో వైసీపీ ఓటమి తరువాత జనసేనలో చేరిపోయారు. అయితే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తో బాలినేనికి కాంగ్రెస్ వైసీపీ నుంచి రాజకీయ ప్రత్యర్ధిత్వం ఉంది. ఆయన జనసేనలో ఉన్నా అది కొనసాగుతూ వస్తోంది. దీంతో మిత్ర పక్షంలో ఉన్నా సరే ఇక్కడ ఈ ఇద్దరి మధ్య పోరు అలాగే ఉంది.
నలుగుతూనే కొనసాగుతూ :
ఈ నేపధ్యంలో జనసేనలో బాలినేని నలుగుతూనే కొనసాగుతూ వస్తున్నారు. అయితే అభిమానులు అనుచరులతో మాత్రం ఆయన సమావేశమైనప్పుడు గట్టిగానే కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలినేని తిరిగి వైసీపీలోకి వస్తారు అన్న ప్రచారం గత కొంతకాలంగా సాగుతూ వచ్చింది. అయితే తాజాగా జగన్ ఒంగోలు పార్టీ నేతల సమావేంలో ఒంగోలు వైసీపీ ఇంచార్జిగా చుండూరు రవిని నియమించారు. ఈ విధంగా బాలినేని రీ ఎంట్రీ విషయంలో సప్సెన్స్ కి చెక్ పెట్టేశారు అని అంటున్నారు. అయితే అదే రోజు తన వర్గానికి చెందిన కార్పోరేటర్ల పదవీ విరమణ సందర్భంగా జరిగిన సమావేంలో బాలినేని మాట్లాడుతూ తాను ఎంతో మందిని నమ్మాను అని వారంతా తనతో కొనసాగకుండా తమ దారి తాము చూసుకున్నారని విమర్శలు చేశారు. అయితే తన దగ్గర అందరి లెక్కలు ఉన్నాయని, త్వరలోనే ఎవరేమిటో చూపిస్తాను అని గట్టిగా చెప్పారు.
పవన్ తో మీట్ :
ఇది జరిగిన కొద్ది గంటలలోనే బాలినేని జనసేన అధినేత పవన్ తో మీట్ అయ్యారు. తన కుమారుడిని సైతం వెంటబెట్టుకుని ఆయన్ని కలసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ఫోటోని సోషల్ మీడియాలో పెట్టి బాలినేని తాజాగా చేసిన పోస్ట్ రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. పవన్ ని అకాశానికి ఎత్తేస్తూ బాలినేని వ్యాఖ్యలు చేశారు. ఆయన మా నాయకుడు మాత్రమే కాదు, నమ్మకం, ఆదరణ, ఆశ్రయం అని కూడా రాసుకొచ్చారు. దానిని బట్టి జనసేనలోనే తాను కొనసాగుతాను అని బాలినేని స్పష్టం చేసినట్లుగా తెలిస్తోంది. అంతే కాదు వైసీపీలోకి తన రీ ఎంట్రీ ఉంటుంది అన్న ప్రచారానికి ఆయన ఫుల్ స్టాప్ పెట్టినట్లుగా చెబుతున్నారు.
హామీ దక్కిందా :
ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజన జరుగుతుందని అంటున్నారు. దాంతో పాటు జనసేన కూడా కూటమిలో ఎక్కువ సీట్లను తీసుకుని పోటీ చేస్తుంది అని అంటున్నారు. ఈ క్రమంలో బాలినేని తన కుమారుడికి జనసేన నుంచి టికెట్ ఇప్పించుకోవడానికి ఒక హామీ పొందారు అని అంటున్నారు. అందుకే ఆయన ట్వీట్ అయితే పవర్ ఫుల్ గా ఉంది అని అంటున్నారు. ఒంగోలు అనగానే వాసన్న విషయంలో కొన్ని ప్రశ్నలు వస్తాయని ఆయన మళ్లీ వైసీపీలోకి వస్తారా అని జగన్ ఒంగోలు వైసీపీ మీటింగులో నాయకులను ప్రశ్నించినట్లుగా ప్రచారం సాగింది. అయితే ఎట్టకేలకు వైసీపీ తమ ఇంచార్జిని ప్రకటించింది. అది జరిగిన ఒక రోజు తేడాలో బాలినేని కూడా తన స్టాండ్ ఎంతో చెప్పేశారు. మొత్తానికి చూస్తే బాలినేని వైసీపీలోకి రీ ఎంట్రీ ఇచ్చేది ఉండదని స్పష్టం అయిపోయింది అంటున్నారు. దీంతో ఒంగోలు రాజకీయాలు కొత్త రూపు సంతరించుకోవడం ఖాయమని అంటున్నారు.
