జనసేనలో బాలినేని...ఊహించని సన్నివేశాలు !
ఒంగోలు రాజకీయాల్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిది ఒక ప్రత్యేక అధ్యాయంగా చెప్పుకోవాలి. ఆయనది దాదాపుగా మూడున్నర దశాబ్దాలకు పైగా తలపండిన రాజకీయం.
By: Satya P | 27 Aug 2025 1:00 AM ISTఒంగోలు రాజకీయాల్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిది ఒక ప్రత్యేక అధ్యాయంగా చెప్పుకోవాలి. ఆయనది దాదాపుగా మూడున్నర దశాబ్దాలకు పైగా తలపండిన రాజకీయం. 1989లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ లో ఆయన అనేక సార్లు గెలిచి సీనియర్ మోస్ట్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు వైఎస్సార్ సైతం ఆయనను ఎంతగానో ప్రోత్సహించారు. . వైఎస్సార్ సీఎం గా ఉండగానే బాలినేనికి కేబినెట్ లో బెర్త్ దక్కింది. ఇక కాంగ్రెస్ నుంచి జగన్ కోసం బాలినేని బయటకు వచ్చారు. అలా వైసీపీలో ఆయన కీలకం అయ్యారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతోనే ఆయనకు మంత్రి పదవి దక్కింది. మూడేళ్ల పాటు ఆ పదవిలో ఆయన కొనసాగారు. అయితే విస్తరణలో తనను కంటిన్యూ చేయలేదని బాలినేని అలిగారు. అది కాస్తా తీవ్ర అసంతృప్తిగా మారింది. ఇక 2024లో బాలినేని తాను స్వయంగా ఓటమి పాలు కావడం ఏపీలో వైసీపీ కూడా ఓడిపోవడంతో వైసీపీని వీడి జనసేనలో చేరిపోయారు.
అంతా బాగుందా :
అయితే జనసేన టీడీపీలకు వ్యతిరేకంగా ఒంగోలు జిల్లాలో రాజకీయాలు చేస్తూ వచ్చిన బాలినేని సడెన్ గా జనసేనలో చేరడంతో కూటమి నేతలు ఎవరూ జీర్ణించుకోలేకపోయారు అని అంటున్నారు. అంతే కాదు ఆయనను ఇంకా వైసీపీ నాయకుడిగానే చూస్తున్నారు అని అంటున్నారు. ఆయనకు గతంలో ఎదురు నిలిచి పోరాడిన వారు అంతా కూడా ఇపుడు ఆయన తమ పార్టీలో ఉన్నా ఇంకా ప్రత్యర్ధిగానే చూస్తున్నారు అని అంటున్నారు. ఒక విధంగా చూస్తే బాలినేనికి జనసేనలో ఏమంతా బాగా లేదని చెబుతున్నారు.
తాజాగా అవమానమేనా :
వీటికి ఒక నిలువెత్తు ఉదాహరణగా తాజాగా జరిగిన ఉదంతం ఉందని అంటున్నారు. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అధరిటీ ఒడా చైర్మన్ గా ఉమ్మడి ఒంగోలు జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ నియమితులయ్యారు. ఆయన తాజాగా పదవీ ప్రమాణం చేస్తే ఒంగోలు జనసేనకు చెందిన కీలక నాయకులు అంతా హాజరయ్యారు కానీ బాలినేనికి కనీసం కబురు కూడా లేదని అంటున్నారు. అంతే కాదు ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ వెలసిన ఫ్లెక్సీలలో ఎక్కడా బాలినేని చిన్న పాటి ఫోటో కూడా లేకపోవడంతో ఆయన అభిమానులు అంతా కలవరపడుతున్నారు. ఇదేమిటి తన నాయకుడికి ఇలా జరిగింది అని వారు వాపోతున్నారు.
అదే వ్యతిరేకత అలాగే :
ఇక ఒడా చైర్మన్ గా నియమితులైన షేక్ రియాజ్ బాలినేని వైసీపీలో ఉన్నప్పటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అని అంటున్నారు. ఇపుడు కూడా అదే వ్యతిరేకత కొనసాగుతోందని చెబుతున్నారు. అంతే కాదు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ కూడా బాలినేనితో అదే పాత రాజకీయ వైరాన్ని కొనసాగిస్తున్నారు అని అంటున్నారు. అలా చూస్తే కనుక దామచర్లకు రియాజ్ మంచి మిత్రుడు. ఇలా ఈ ఇద్దరూ కూడా బాలినేనిని పట్టించుకోకూడదు అని గట్టి నిర్ణయం ఉమ్మడిగానే తీసుకున్నారా అన్న చర్చ సాగుతోంది దాంతో బాలినేనికి ఏ వర్తమానమూ కూటమి కార్యక్రమాల తరఫున అందడం లేదని అంటున్నారు.
పూలు అమ్మిన చోటనే :
రాజకీయం అంటేనే అలా అని అంతా అంటూంటారు. పూలు అమ్మిన చోటనే కట్టెలు అమ్మీ పరిస్థితి ఉంటుంది. అంతే కాదు ఓడలు సైతం బళ్ళు అవుతాయి ఇపుడు బాలినేని పరిస్థితి చిత్రంగా అలాగే ఉందని అంటున్నారు. బాలినేని కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కానీ వైసీపీలో కానీ జిల్లానే శాసించారు. ఆయన చేతుల మీదుగా ఎందరికో టికెట్లు ఇప్పించారు. ఆయన నామినేటెడ్ పదవులు ఎందరికో ఇప్పించారు. అయితే ఒక నామినేటెడ్ పదవిని అందుకున్న ప్రస్తుత తమ సొంత పార్టీ నాయకుడే బాలినేనిని విస్మరించారు అంటే రాజకీయాల్లో ఇంతకంటే ఇబ్బంది ఇరకాటం వేరే ఏమైనా ఉందా అని అంటున్నారు. అలా బాలినేని సైడ్ అయిపోతున్నారా లేక చేస్తున్నారా అన్నది కూడా ఎవరికీ అంతుబట్టడం లేదని అంటున్నారు.
వైసీపీని వీడినందుకా :
అయితే బాలినేనిని విపరీతంగా అభిమానించే వైసీపీ నాయకులు ఆయన పార్టీ మారడంతో ఆనాడే దూరం అయ్యారు. ఇపుడు వారే బాలినేనికి జనసేనలో జరుగుతున్న అవమానాలు చూసి వైసీపీ ఆదరించి అక్కున చేర్చుకుంటే పార్టీ కష్టకాలంలో వెన్నుపోటు పొడిచారని అందుకే ఈ అవమానాలు మోయాల్సి వస్తోంది అని అంటున్నారు. బాలినేనికి ఇపుడు ఉన్న పార్టీలో ఆదరణ దక్కడం లేదని వైసీపీ వైపు కూడా రాలేరని మొత్తానికి ఆయన రాజకీయ జీవితం ఎంతో ఉజ్వలంగా మొదలై ఇలా మారిందేంటి అన్న చర్చ కూడా సాగుతోందిట.
