ర్యాప్ సింగర్ టు పీఎం.. నేపాల్ కొత్త పీఎం బాలెన్ షా చరిత్ర ఇదీ..
నేపాల్ కు బాలెన్ షా ప్రధాన మంత్రి అవుతారా ?. ఇటీవల జరిగిన ఎన్నికల తీరును పరిశీలించినప్పుడు అవుననే సమాధానం వినిపిస్తోంది.
By: A.N.Kumar | 6 March 2026 4:02 PM ISTనేపాల్ కు బాలెన్ షా ప్రధాన మంత్రి అవుతారా ?. ఇటీవల జరిగిన ఎన్నికల తీరును పరిశీలించినప్పుడు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆయన పార్టీకి భారీ ఎత్తున ఓట్లు పడ్డట్టు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆయన పార్టీ గెలిస్తే బాలెన్ షా ప్రధాని అవుతారు. ఒక సాధారణ ర్యాప్ సింగర్ .. ప్రముఖ రాజకీయ నేతగా మారడానికి కారణమేంటి ?. ఆయనపై జెన్ జీ యువతకు ఎందుకంత అభిమానం ?. ఆయన చేసిన పనులేంటి అన్నవే ఇప్పుడు హాట్ టాపిక్ .
పాత, కొత్త తరం రాజకీయాలు
నేపాల్ రాజకీయాలు పూర్తీగా మారిపోయాయి. నేపాలి కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ లు ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురాలేకపోయాయి. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, నిరుద్యోగం జెన్ జీ యువతను ఆగ్రహానికి గురిచేశాయి. దీంతో వీధుల్లోకి పోరాటం వచ్చింది. కేపీ శర్మ ఓలీ తన రాజీనామా ప్రకటించారు. దేశవ్యాప్తంగా హింస చెలరేగింది. ఇదంతా ముగిశాక నేపాల్ లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాలు పూర్తీ స్థాయిలో రాకపోయినప్పటికీ.. తదుపరి ప్రధాని బాలెన్ షా అన్న ప్రచారం సాగుతోంది. బాలెన్ షా పూర్తీ పేరు బాలేంద్ర షా. మొదట ర్యాప్ సింగర్, ఇంజినీర్.. ఆ తర్వాత ఖాట్మాండు మేయర్. ఇప్పుడు నేపాల్ జాతీయ రాజకీయాల్లో కీలక నేత. బాలెన్ షా రాజకీయ నేతగా రూపాంతరం చెందడానికి కొత్త తరం రాజకీయాలే కారణం. పాతతరం రాజకీయాలతో విసిగిపోయిన జెన్ జీ యువత బాలెన్ షాకు మద్దతు ఇస్తోంది. అందుకే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ జెన్ జీ నుంచి గణనీయమైన మద్దతు సాధించినట్టు తెలుస్తోంది.
బాలెన్ షా ప్రత్యేకత
బాలెన్ షా తన ప్రస్థానం ర్యాప్ సింగర్ గా, స్ట్రక్చరల్ ఇంజినీర్ గా ప్రారంభించారు. ర్యాప్ సింగర్ గా ఆయన పాటలు అవినీతి, రాజకీయ వైఫల్యాలు, యువత సమస్యలపైన ఉంటాయి. ఇవే యువతలో ఆయన పట్ల క్రేజ్ పెంచాయి. సోషల్ మీడియా ద్వారా ప్రజలతో నేరుగా మాట్లాడటంతో జెన్ జీ యువతతో బాలెన్ షాకు కనెక్టివిటీ పెరిగింది. ఆ తర్వాత ఖట్మాండు మేయర్ గా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు జెన్ జీ యూత్ ను మరింత ఆకర్షించాయి. తమ సమస్యలకు పరిష్కారం చూపే నాయకుడిగా జెన్ జీ యువత బాలెన్ షాను నమ్మడం మొదలు పెట్టింది. ముఖ్యంగా అక్రమ నిర్మాణాలు కూల్చడం, ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో చొరవ, నగర నిర్వహణ, అవినీతి అధికారులపై కఠిన చర్యలు.. బాలెన్ షా అంటే మాటలు చెప్పే నాయకుడు కాదు, చేతల ద్వారా చూపే నాయకుడన్న అభిప్రాయం కలిగించాయి. అప్పటి వరకు ఉన్న కాంగ్రెస్, కమ్యూనిస్టులకు ప్రత్యామ్నాయంగా కనిపించాడు. అదే జెన్ జీ యూత్ లో బాలెన్ షా ఆకర్షణను పెంచింది.
పెద్ద పార్టీ కాదు
బాలెన్ షా రాష్ట్రీయ స్వతంత్ర పార్టీని స్థాపించారు. ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పటి వరకు బాలెన్ షా పార్టీ పెద్ద పార్టీ కాదు. కానీ ఇప్పుడు నేపాలి కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ తో కలిపి మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో గట్టి ఓటు బ్యాంకు సాధించిందన్న వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఇటీవల జరిగిన ఎన్నికల్లో దాదాపు 10 లక్షల కొత్త జెన్ జీ యువత ఓట్లు కలవడం బాలెన్ షాకు కలిసొచ్చినట్టు తెలుస్తోంది. బాలెన్ షా ఎదుగుదల వెనుక కాంగ్రెస్, కమ్యూనిస్టుల వైఫల్యమే కారణం అన్న విశ్లేషణ ఉంది. ఎందుకంటే ఈ రెండు పార్టీలు ప్రజల సమస్యలను తీర్చలేకపోయాయి. పైగా వారి హాయంలో జరిగిన అవినీతి, ఆశ్రిత పక్షపాతం దేశ ప్రజల్ని, ముఖ్యంగా జెన్ జీ యువతను తీవ్ర ప్రభావితం చేశాయి. అందుకే బాలెన్ షా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా కనిపించారు.
