జెన్ జెడ్ పీఎం బలెన్ షా.. తొలి సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటున్నారు?
ఈ విపత్కర పరిస్థితుల్లో బలెన్ షా నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించేందుకు ప్రయత్నిస్తోంది.
By: A.N.Kumar | 27 Aug 2026 11:27 AM ISTనేపాల్ రాజకీయ చరిత్రలోనే ఓ సంచలనం బలెన్ షా. సాంప్రదాయ రాజకీయాలను పక్కన పెట్టి జెన్ జెడ్ మద్దతుతో అద్భుత విజయం సాధించిన 36 ఏళ్ల బలెన్ షా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అతి తక్కువ కాలంలోనే దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. నేపాల్ వ్యాప్తంగా సంభవించిన ఆకస్మిక వరదలు, భారీ వర్షాలు దేశాన్ని వణికిస్తుండటంతో, కొత్త ప్రధాని నాయకత్వ సామర్థ్యానికి ఇది తొలి సవాలుగా మారింది.వర్షాల ధాటికి నదులు ఉప్పొంగి నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ విపత్తులో 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ క్రమంలో బలెన్ షా ప్రభుత్వం రంగంలోకి దిగి బాధితులకు తక్షణ ఉపశమనం అందించేందుకు కృషి చేస్తోంది.
ఈ విపత్కర పరిస్థితుల్లో బలెన్ షా నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించేందుకు ప్రయత్నిస్తోంది. భావోద్వేగపూరితమైన పిలుపునిస్తూ క్లిష్ట సమయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా నిలవాలని ఆయన కోరారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటిస్తూ అధికారులకు సహాయక చర్యల్లో ఏమాత్రం అలసత్వం వహించవద్దని కఠిన ఉత్తర్వులు జారీ చేశారు. సైన్యం, పోలీసు యంత్రాంగం, ప్రత్యేక విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, తాగునీరు, ఆహారం, అత్యవసర వైద్య సదుపాయాలను అందించేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయి.
ఈ ప్రకృతి విపత్తు ప్రభావం సరిహద్దు దేశమైన భారతదేశంపై కూడా పడుతోంది. నేపాల్ నుంచి దిగువకు ప్రవహించే నదులు ఉప్పొంగడంతో బిహార్‌లోని పలు ప్రాంతాల్లో వరద ముప్పు పెరిగింది. దీంతో భారత అధికారులు సైతం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సరిహద్దు ప్రాంతాలలో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టారు.
సాంప్రదాయ నాయకత్వాన్ని పక్కన పెట్టి ఒక యువ నేతపై నమ్మకంతో అధికారాన్ని అప్పగించిన ప్రజలకు, ఈ సంక్షోభాన్ని నిర్వహించే తీరు అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న తక్షణ చర్యలపై సానుకూల వాతావరణం కనిపిస్తున్నప్పటికీ బాధితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించడం.. మౌలిక వసతులను పునరుద్ధరించడం వంటి అంశాలలో బలెన్ షా ప్రభుత్వం ఎంతవరకు విజయం సాధిస్తుందనే దానిపైనే ఆయన నాయకత్వ సామర్థ్యానికి నిజమైన మార్కులు పడనున్నాయి.
