Begin typing your search above and press return to search.

అఖండ ఆగ్రహం వెనక ?

బాలయ్య అని ఆయనను అభిమానులతో పాటు అంతా పిలుచుకుంటారు. బాలయ్య అందరితో కలసిపోతారు.

By:  Satya P   |   26 Sept 2025 8:58 AM IST
అఖండ ఆగ్రహం వెనక ?
X

బాలయ్య అని ఆయనను అభిమానులతో పాటు అంతా పిలుచుకుంటారు. బాలయ్య అందరితో కలసిపోతారు. ఆయనకు ఎలాంటి భేషజాలు అయితే లేవు. తన తండ్రి స్థాపించిన పార్టీలో మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా మంత్రి పదవి కూడా ఆయన కోరుకోలేదు. సాధారణ ఎమ్మెల్యేగానే ఆయన ఉంటున్నారు. ఒక్కసారి గెలిచిన వారు కూడా కీలక పదవుల్లో ఉంటున్న నేపథ్యంలో బాలయ్యకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు అన్న బాధ అయితే కార్యకర్తలలో ఉంది అని అంటారు.

ఇద్దరి మీద ఒకేసారి :

ఈ క్రమంలో బాలయ్య జగన్ ని మెగాస్టార్ చిరంజీవిని కలిపి ఒకేసారి విమర్శించడం చర్చగా మారింది. పైగా జగన్ ని పట్టుకుని సైకో గాడు అన్న మాట వాడడం తో తీవ్ర దుమారం రేగింది. అంతే కాదు చిరంజీవి గట్టిగా మాట్లాడింది లేదు అన్నట్లుగా ఆయన కామెంట్స్ చేశారు. దీంతో బాలయ్య గురి ఎవరి మీద అన్నదే అంతా చర్చిస్తున్నారు. బాలయ్య సినీ హీరోగా ఉన్నారు. అలాగే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సినీ రంగంలో సీనియర్ గా ఉన్నారు. రాజకీయాల్లో చూస్తే కనుక ఎన్ని సార్లు గెలిచినా ఎమ్మెల్యేగానే అన్న మాట కూడా ఉందని చెబుతారు.

తొమ్మిదవ పేరుగా :

ఇక ఏపీలో ఫిల్మ్ డెవలప్మెంట్ కి సంబంధించి తయారు చేసిన సినీ ప్రముఖుల జాబితాలో బాలయ్య పేరు తొమ్మిదిగా ఉందిట. ఆ ఆహ్వానం తన దగ్గరకు వచ్చిందని తనకు తొమ్మిదవ నంబర్ లో పెట్టింది ఎవరు అని బాలయ్య శాసనసభ వేదికగానే ఆవేశం వెళ్ళగక్కారు. తనకు సీనియర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి గుర్తించాల్సిన తీరులో ఆ జాబితాలో తన పేరు లేదన్నది ఆయన ఆవేశం వెనక ఆవేదన అసంతృప్తిగా అంటున్నారు. అంటే బాలయ్య కంటే ముందు ఉన్న ఎనిమిది మంది ఎవరు అన్నది కూడా చర్చగా ఉంది.

టాలీవుడ్ సీనియర్ లీగ్ లో టాప్ :

మరి ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ సీనియర్ లీగ్ హీరోలలో బాలయ్య టాప్ గానే ఉన్నారు. ఆయన చిరంజీవి ఇద్దరూ రెండు కళ్ళు అని అంతా అంటారు. ఇద్దరికీ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారంతో సత్కరించింది. ఇద్దరూ ఇతర గౌరవాలు అందుకున్నారు. ఇద్దరూ సెలిబ్రిటీల ర్యాంక్ నుంచి లెజెండరీ పర్సనాలిటీలుగా గుర్తింపు పొందారు. అయితే ఏపీలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వంలో మాత్రం తనకు ఆ స్థాయిలో గౌరవం దక్కడం లేదు అన్న ఆవేదన ఏదో బాలయ్యలో గూడు కట్టుకుంది అని అంటున్నారు. పైగా తాను ఏ మంత్రి పదవీ కోరుకోకపోయినా తనకు తగిన ప్రాముఖ్యతను ఇవ్వడంలో ఎక్కడో ఏదో లోపం ఉందని భావించే బాలయ్య అలా బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాటల మీద రియాక్ట్ అయ్యారని అన్నారు. ఈ దశలో ఆయన కొన్ని మాటలు తూలి ఉండొచ్చు కానీ అసలు విషయం అది కాదని ఆయనలో గూడు కట్టుకున్న బాధ వేరేగా ఉందని అంటున్నారు. ఏది ఏమైనా బాలయ్య మాటలు ఇపుడు ఏపీలోనూ కూటమిలోనూ కాక పుట్టించాయి.