Begin typing your search above and press return to search.

ఈ ఎంపీ.. బెస్ట్‌: జ‌న‌సేన ఎంపీకి భారీ ప్రోగ్రెస్ ..!

జనసేన పార్టీ నాయకులు కొందరు ఇష్టానుసారం వ్యవహరిస్తుంటే మరికొందరు మాత్రం బాధ్యతాయు తంగా వ్యవహరిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు.

By:  Garuda Media   |   16 Sept 2025 1:50 PM IST
ఈ ఎంపీ.. బెస్ట్‌: జ‌న‌సేన ఎంపీకి భారీ ప్రోగ్రెస్ ..!
X

జనసేన పార్టీ నాయకులు కొందరు ఇష్టానుసారం వ్యవహరిస్తుంటే మరికొందరు మాత్రం బాధ్యతాయు తంగా వ్యవహరిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇలాంటి వారిలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఇప్పుడు వార్తల్లో నిలిచారు. పార్లమెంటుకు ఎక్కువ రోజులు హాజరైన ఎంపీ గానే కాకుండా ప్రజల తరఫున అనేక ప్రశ్నలు సంధించిన పార్లమెంటు సభ్యుడుగా కూడా ఆయన రికార్డు నమోదు చేశారు. దీంతో ఎంపీల పనితీరులో మొత్తం 543 మంది సభ్యులలో బాలశౌరి మూడవ స్థానంలో నిలవడం విశేషం.

దీనికి సంబంధించి తాజాగా లోక్‌స‌భ‌ కీలక నివేదికను విడుదల చేసింది. దీనిలో బాలశౌరి మూడవ స్థానంలో ఉన్నట్టు పేర్కొంది. మొత్తం ఆయన 72 ప్రశ్నలు అడిగారని, 18 అంశాలపై జరిగిన చర్చల్లో పాల్గొన్నారని పార్లమెంటు నివేదిక వెల్లడించింది. అంతేకాదు ఇతర పార్లమెంటు సభ్యులతో పోల్చుకుంటే బాలశౌరి హాజరు శాతం దాదాపు 80 శాతం గా ఉందని కూడా ఈ నివేదిక స్పష్టం చేసింది. దీంతో జనసేన ఎంపీల్లోనే కాకుండా రాష్ట్రంలోని మొత్తం 25 మంది ఎంపీల్లో కూడా బాలశౌరి నిబద్దత కలిగిన నాయకుడిగా ప్రజల పక్షాన నిలిచే నాయకుడిగా కూడా పేరు సంపాదించుకున్నట్టు అయింది.

ప్రజలకు సంబంధించిన అనేక అంశాలపై స్పందించడంతోపాటు వాటి పరిష్కారానికి కూడా ఎంపీ చేసిన ప్రయత్నాలను ఈ నివేదికలో స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే గతంలో వైసిపి ఎంపీగా వ్యవహరించినప్పుడు కూడా బాలశౌరి ప్రజల పక్షాన అలాగే రాష్ట్రం కోసం కేంద్రం స్థాయిలో అనేక ప్రయత్నాలు చేశారు. పెట్టుబడులు తీసుకొచ్చే అంశాలపై దృష్టి కూడా పెట్టారు. పలు సందర్భాల్లో అప్పట్లోను కేంద్ర మంత్రులను కలిసి మచిలీపట్నంలో పోర్టు సహా జాతీయ ప్రాజెక్టులు తీసుకువచ్చే అంశంపై చర్చలు నిర్వహించి పేరు తెచ్చుకున్నారు.

వివాదాస్పద అంశాల జోలికి పోకుండా ఉండే బాల‌శౌరికి.. రాజ‌కీయంగా కూడా.. పేరు తెచ్చుకున్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ ఆయ‌న‌ను స్థాన చ‌ల‌నం చేసింది. దీంతో అలిగిన ఆయ‌న ప‌లుమార్లు చ‌ర్చించారు. అయితే.. వైసీపీ దిగిరాక‌పోవ‌డంతో బాల‌శౌరి.. త‌నే స్వ‌యంగా జ‌న‌సేన తీర్థం పుచ్చుకున్నా రు. ఈ పార్టీ గత ఎన్నిక‌ల్లో రెండు ఎంపీ స్థానాల‌ను ద‌క్కించుకుంది. వీటిలో మ‌చిలీప‌ట్నం నుంచి తిరిగి పోటీ చేసిన బాల‌శౌరి.. ఘ‌న విజ‌యం ద‌క్కించుకుని.. వ‌రుస‌గా గెలుపొందారు. తాజాగా పార్ల‌మెంటులోనూ మంచి నాయ‌కుడిగా పేరు తెచ్చుకోవ‌డం గ‌మ‌నార్హం.