బాబు విత్ బాలయ్య...అక్కడ మిస్
నందమూరి బాలకృష్ణ అంటేనే సందడి. ఆయన హడావుడి వేరు. ఆయన అంటేనే ఎనర్జీకి మారు పేరుగా చెబుతారు.
By: Satya P | 16 Jan 2026 9:22 AM ISTనందమూరి బాలకృష్ణ అంటేనే సందడి. ఆయన హడావుడి వేరు. ఆయన అంటేనే ఎనర్జీకి మారు పేరుగా చెబుతారు. ప్రతీ ఏటా తన సంక్రాంతి సినిమాను రిలీజ్ చేసి బావ కం వియ్యంకుడు చంద్రబాబు సొంత ఊరు నారా వారి పల్లెకు కుటుంబ సమేతంగా వెళ్ళడం బాలయ్యకు అలవాటు. అయితే ఈసారి ఆయన ఎక్కడా కనిపించలేదు. అదే చర్చగా ఉంది. బాలయ్య సతీమణి వసుంధర హాజరయ్యారు. అలాగే సోదరుడు రామకృష్ణ ఆయన కుటుంబం కూడా నారావారిపల్లెలో కనిపించింది.
లోటు కనిపించిందా :
బాలయ్య కనుక నారావారిపల్లెకు వస్తే ఆయన తన మనవడిని వెంటేసుకుని ఎడ్ల బండి తోలతారు, అలాగే చుట్టుపక్కల అంతా కలియతిరిగి తెగ హుషారు చేస్తారు. అవన్నీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ వచ్చేవి. కానీ ఈసారి మాత్రం ఎందుకో బాలయ్య కనిపించలేదు. ఇదిలా ఉంటే దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమాలలో సైతం బాలయ్య గత ఏడాది అక్టోబర్ లో సందడి చేశారు ఆయన వేదిక మీద విజయవాడ ఉత్సవాల సందర్భంగా ప్రసంగించి మరీ తన సత్తా చాటుకున్నారు.
ఆ తర్వాత నుంచి :
ఇక చూస్తే అఖండ -2 మూవీ గత నెల డిసెంబర్ 12న రిలీజ్ అయింది. బాలయ్య ఆ సినిమా ప్రమోషన్స్ లో బాగా కనిపించారు. వారణాసి కూడా వెళ్ళి వచ్చారు. సినిమా రిలీజ్ అయిన వారం వరకూ కూడా బాలయ్య ఇంటర్వ్యూలు సక్సెస్ మీట్స్ అన్నీ చేశారు. ఆ తరువాత నుంచి ఆయన కనిపించలేదు. అయితే ఆ మధ్యలో ఆయన తన సొంత నియోజకవర్గం హిందూపురానికి కూడా వెళ్ళారు. అయితే కొత్త ఏడాది మాత్రం ఆయన నుంచి ఏ రకమైన ప్రకటనలు లేవని అంటున్నారు. ఇక చెప్పాలీ అంటే దీపావళి వేళ తన ఇంటి ముంగింట బాణాసంచా కాలుస్తూ బాలయ్య చేసిన హడావుడి వీడియో బైట్లు ఫోటోలు కూడా గత ఏడాది బయటకు వచ్చాయి. కానీ సంక్రాంతి సందడికి సంబంధించి మాత్రం ఏ రకమైన అప్ డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ అయితే నిరాశకు గురి అవుతున్నారని అంటున్నారు.
వారంతా కనువిందు :
ఇక మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా మన శంకర వర ప్రసాద్ గారు మూవీ సూపర్ హిట్ కావడంతో ఆ సక్సెస్ మీద ఇంటర్వ్యూలు ఇస్తూ ఆయన ఎంతో హుషారుగా కనిపించారు. ఆ మూవీలో ఒక కామియో రోల్ వేసిన విక్టరీ వెంకటేష్ కూడా చిరంజీవితో కలసి ఇంటర్వ్యూలలో పాలు పంచుకుంటూ సంక్రాంతి సందడి చేశారు. మరో వైపు అక్కినేని నాగార్జున తమ సొంత స్టూడియో అన్నపూర్ణ 50వ వసంతాలు నిండిన నేపధ్యంలో సంక్రాంతిని అక్కడ స్టాఫ్ సిబ్బందితో కుటుంబ సమేతంగా జరుపుకుంటూ కనిపించారు. ఇలా టాలీవుడ్ టాప్ సీనియర్ హీరోలలో అంతా సంక్రాంతి వేళ సందడి చేస్తే బాలయ్య మాత్రం మిస్ అయ్యారని అంటున్నారు దాంతో ఆయన ఫ్యాన్స్ అయితే తొందరలో కొత్త సినిమా షూటింగ్ తో అయినా తమ హీరో సందడి చేయాలని బలంగా కోరుకుంటున్నారు.
