Begin typing your search above and press return to search.

అరుదైన దృశ్యం: ఒకే ఫ్రేమ్ లో ఉస్తాద్, భగవంత్ కేసరి

అమరావతి చట్టబద్ధత కోసం తీర్మానం చేసేందుకు సమావేశమైన ఏపీ అసెంబ్లీలో అరుదైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి.

By:  Tupaki Political Desk   |   29 March 2026 11:01 AM IST
అరుదైన దృశ్యం: ఒకే ఫ్రేమ్ లో ఉస్తాద్, భగవంత్ కేసరి
X

అమరావతి చట్టబద్ధత కోసం తీర్మానం చేసేందుకు సమావేశమైన ఏపీ అసెంబ్లీలో అరుదైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఈ సమావేశాలకు కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు అంతా దాదాపుగా హాజరయ్యారు. సభలో అప్పుడప్పుడు కనిపించే ఎమ్మెల్యేలు సైతం శనివారం నాటి ప్రత్యేక సమావేశంలో సందడి చేశారు. ఇలాంటి వారిలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు టీడీపీ ముఖ్య నేత, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అంటున్నారు. ఈ ప్రత్యేక సమావేశానికి బాలయ్య హాజరుకావడమే విశేషంగా చెబుతుండగా, ఆయన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తో ప్రత్యేకంగా ముచ్చటించడం మరింత ఆకర్షణీయంగా మారింది.

శాసనసభ ప్రత్యేక సమావేశం అరుదైన కలయికలకు వేదికైందని అంటున్నారు. ముఖ్యంగా వెండితెరపై కోట్లాది మంది అభిమానులను ఉర్రూతలూగించే ఇద్దరు అగ్ర హీరోలు అసెంబ్లీలో పక్కపక్కనే కూర్చోవడం అభిమానులకు కనుల పండువగా మారింది. వెండితెరను ఏలిన గాడె ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ రాజకీయాలను శాసిస్తున్నారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వెండితెరపై పవన్ కన్నా సీనియర్ అయిన బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న విషయం తెలిసిందే.

వైరల్ అవుతున్న విజువల్స్

శనివారం జరిగిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలొ పవన్, బాలకృష్ణ పక్కపక్కనే కూర్చుని ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇద్దరూ చిరునవ్వుతో ముచ్చటించుకుంటున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. సినిమా రంగంలో ఎంతటి పోటీ ఉన్నా, రాజకీయంగా కూటమిలో భాగస్వాములుగా వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం చూసి అభిమానులు మురిసిపోతున్నారు. అదేసమయంలో మంత్రి లోకేశ్ తో బాలకృష్ణ మాట్లాడిన ఫొటోలు, వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ ఇద్దరు మామా అల్లుళ్లు అసెంబ్లీలో ఏం మాట్లాడుకున్నారో? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో ఎమ్మెల్యే బాలకృష్ణ ఆప్యాయంగా మాట్లాడటం రాజకీయంగా ప్రాధాన్యాంశంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే గత ఏడాది అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ చేసిన కొన్ని వ్యాఖ్యలు జనసేన శ్రేణుల్లో కొంత ఆగ్రహానికి కారణమైన సంగతి తెలిసిందే. అయితే, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే సామెతను నిజం చేస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమిగా ఏర్పడిన తర్వాత ముఖ్య నేతలు ఇద్దరు అలాంటి వివాదాలను సాగదీయాలని భావించడం లేదని సంకేతాలు ఇస్తున్నారు. గత బడ్జెట్ సమావేశాల్లోనే బాలయ్య వెనక్కి తగ్గినట్లు సంకేతాలు పంపారని అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాలయానికి వెళ్లిన బాలయ్య ఆయనతో మైత్రిని కోరుకుంటున్నట్లు పరోక్షంగా వెల్లడించారు. ఇక తాజాగా అసెంబ్లీలోనూ పవన్ కల్యాణ్, బాలయ్య పరస్పరం గౌరవంగా మెలగడం విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు. పెద్దన్నలా బాలయ్యను పవన్ గౌరవించే తీరు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

కూటమిలో కీలక శక్తిగా..

ప్రస్తుత ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషిస్తుండగా, బాలకృష్ణ తన నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ పటిష్టతపై దృష్టి సారించారు. ఈ ఇద్దరు మాస్ లీడర్లు ఇలా కలిసి కనిపించడం వల్ల క్షేత్రస్థాయిలో తెలుగుదేశం, జనసేన కార్యకర్తల మధ్య సమన్వయం మరింత పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, వెండితెరపై బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే ఈ ఇద్దరు హీరోలు, ఇప్పుడు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై కలిసి అడుగులు వేయడం రాజకీయంగా ఆసక్తిరేపుతోంది.