Begin typing your search above and press return to search.

బాలయ్య ఎందుకు వెళ్లలేదు? పోలీస్, సినీ పెద్దల సమావేశంపై ఇంట్రస్టింగ్ డిస్కషన్

హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, సినీ పెద్దల సమావేశంపై ఇంట్రస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది.

By:  Tupaki Political Desk   |   30 Sept 2025 9:00 PM IST
బాలయ్య ఎందుకు వెళ్లలేదు? పోలీస్, సినీ పెద్దల సమావేశంపై ఇంట్రస్టింగ్ డిస్కషన్
X

హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, సినీ పెద్దల సమావేశంపై ఇంట్రస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. సినీ ప్రైవసీ దొంగలను పట్టుకున్న సందర్భంగా.. నిందితులు ఎలా పైరసీ చేస్తున్నారు? సినీ రంగం ఎలా మోసపోతుంది? భవిష్యత్తులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయమై సినీ రంగంలోని ప్రముఖులకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ పోలీసులు పవర్ పాయింజ్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. దీనికి సినీ ప్రముఖులు అందరినీ ఆహ్వానించగా, ప్రముఖ సినీ నటుడు బాలక్రిష్ణ హాజరుకాకపోవడం చర్చనీయాంశం అవుతోంది. ఏపీలో గత ఐదు రోజులుగా నడుస్తున్న పొలిటికల్ డ్రామా నేపథ్యంలో బాలయ్య గైర్హాజరీపై పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది.

మూవీ పైరసీ గ్యాంగ్‌ల అరెస్టు సందర్భంగా సినిమా పైరసీ, సైబర్ భద్రతపై హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ టీమ్ ప్రత్యేక ప్రెజంటేషన్ ఇచ్చింది. దీనికి మెగాస్టార్ చిరంజీవితోపాటు ప్రముఖ హీరోలు వెంకటేష్ గారు, నాగార్జున, నాని, నాగ చైతన్య, నిర్మాత దిల్‌రాజుతోపాటు మరికొందరు ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఇండస్ట్రీలో నలుగురు పెద్ద హీరోల్లో ముగ్గురు హాజరైన ఈ సమావేశానికి బాలయ్య వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. కీలకమైన భేటీకి బాలయ్య ఎందుకు వెళ్లలేదని సినీ అభిమానుల్లో చర్చ జరుగుతోంది.

ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇండస్ట్రీకి మూల స్తంభాలుగా చిరంజీవి, బాలక్రిష్ణ, నాగార్జున, వెంకటేశ్ ఉన్నారు. పరిశ్రమకు చెందిన ఏ కీలక అంశమైనా ఈ నలుగురు పాత్ర ఉండాల్సిందేనని చెబుతారు. అయితే తాజా భేటీకి బాలయ్య దూరంగా ఉండటం మాత్రం తీవ్ర చర్చకు దారితీస్తోంది. వాస్తవానికి మిగిలిన సందర్భాల్లో ఇలాంటి భేటీకి బాలయ్య దూరంగా ఉంటే పెద్ద విషయమేమీ కాదు కానీ, తాజా పరిస్థితుల్లో బాలయ్య లేకపోవడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇటీవల ఏపీ అసెంబ్లీలో చోటుచేసుకున్న ఉదంతం తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద దుమారం రేపింది. చిరంజీవిపై బాలయ్య చేసిన వ్యాఖ్యలు లెటర్ వార్ కు తెరతీసింది. అదే సమయంలో బాలయ్యపై పోలీసుస్టేషన్ లో చిరంజీవి అభిమానులు ఫిర్యాదు చేసే వరకు వ్యవహారం వేడెక్కింది. అయితే ఈ విషయంలో మెగాస్టార్ జోక్యం చేసుకుని పోలీసు ఫిర్యాదులు వద్దని వారించడంతో కొంత వేడి తగ్గింది. మరోవైపు బాలయ్య వ్యాఖ్యల దుమారం టీడీపీ, జనసేన మధ్య అగ్గి రాజేసే ప్రయత్నాలకు దారితీసింది. అయితే ఈ వివాదాన్ని ఉభయ పక్షాలు అత్యంత జాగ్రత్తగా డీల్ చేయడంతో టీకప్పులో తుఫాన్ లా చల్లారిపోయిందని అంటున్నారు.

అయితే ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ లో జరిగిన సమావేశానికి బాలయ్య దూరంగా ఉండటంపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ కారణం చేత బాలయ్య వెళ్లలేదో కానీ, అందరితో కలిసి వెళితే ఏపీ అసెంబ్లీలో చెలరేగిన తుఫాన్ కు చక్కని ముగింపు పలికే అవకాశం లభించేది అని అంటున్నారు. బాలయ్య అందుబాటులో లేరా? లేక ఇలాంటి సమయంలో చిరంజీవితో వేదిక పంచుకోవడం కరెక్టు కాదన్న భావనతో ఉండిపోయారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో బాలయ్య హైదరాబాద్ పోలీసు-సినీ ప్రముఖుల సమావేవానికి వెళ్లకపోవడాన్ని హైలెట్ చేస్తూ వైసీపీ సోషల్ మీడియా ట్రోలింగ్ మొదలుపెట్టింది. బాలయ్యను మెగాస్టార్ బహిష్కరించారంటూ సీపీ ఆనంద్ తో జరిగిన సినీ పెద్దల భేటీ ఫొటోను వైరల్ చేస్తోంది.