బాలయ్యా...అంతేనా ?
ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలక్రిష్ణ. ఇదొక్కటే కాదు స్వర్గీయ నందమూరి తారక రామారావు కుమారుడు, ఆయన సినీ వారసుడు, అంతేనా హిందూపురం ఎమ్మెల్యే.
By: Satya P | 24 Oct 2025 9:09 PM ISTప్రముఖ సినీ నటుడు నందమూరి బాలక్రిష్ణ. ఇదొక్కటే కాదు స్వర్గీయ నందమూరి తారక రామారావు కుమారుడు, ఆయన సినీ వారసుడు, అంతేనా హిందూపురం ఎమ్మెల్యే. ఒక్కసారి కాదు మూడు సార్లు నెగ్గి హ్యాట్రిక్ కొట్టారు. ఇనే కాదు ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వయాన బావమరిది కం వియ్యంకుడు. అలాగే మంత్రి నారా లోకేష్ కి మేనమామ పిల్లనిచ్చిన మామ. ఇలా ఎంతో పవర్ ఫుల్ గా సినీ రాజకీయ రంగాలలో కనిపించిన బాలయ్యను పట్టుకుని వైసీపీ అధినేత జగన్ అంత మాట అనేస్తే కనీసం స్పందించే వారే టీడీపీలో లేరా. ఇదే బాలయ్య అభిమానులలో తీవ్ర ఆవేదనగా ఉందిట.
తాగి వచ్చాడంటూ :
బాలయ్య మీద జగన్ చాలా తీవ్ర విమర్శ చేశారు. తాగి అసెంబ్లీని వచ్చారు అని ఘాటు ఎక్కించే కామెంట్ చేశారు. పైగా ఆయన మెంటల్ హెల్త్ ఎలా ఉందో చూసుకోవాలని అన్నారు, పనీ పాటా లేని మాటలు అని గాలి తీసేశారు. ఆయన్ని అసలు అసెంబ్లీకి ఎలా రానిచ్చారు అని కూడా జగన్ మండిపడ్డారు. ఇదంతా జగన్ బాలయ్య మీద చేసిన వేడి వేడి వ్యాఖ్యలు అలాగే తనను కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో అన్న దానికి ఇచ్చిన గట్టి కౌంటర్. ఇక బాలయ్య జగన్ మీద అన్నది కూడా తీవ్రమైన వ్యాఖ్యనే. సైకోగాడు అంటూ బాలయ్య నోరు జారారు. దానికి జగన్ మార్క్ రిటార్ట్ అన్న మాట.
రాజకీయంగా చూస్తే :
అయితే రాజకీయాల్లో ఎవరు తప్పు చేశారు ఒప్పు చేశారు అన్నది చూడరు, మాటకు మాట ఇచ్చుకుంటూ పోతారు. ఆ విధంగా చూస్తే బాలయ్య మీద జగన్ చేసిన ఈ హాట్ కామెంట్స్ ని టీడీపీ నుంచి రియాక్షన్ ఏదీ అని అంటున్నారు. జగన్ సుదీర్ఘమైన ప్రెస్ మీట్ నిర్వహించి చాలా విషయాలు మాట్లాడారు. వాటి మీద ఖండిస్తూ అలాగే తమ వాదనను సపోర్టు చేసుకుంటూ టీడీపీ నేతలు గట్టిగానే కౌంటర్లు వేశారు. కానీ ఎటొచ్చి జగన్ బాలయ్యను అంత పెద్ద మాటలు అనేసినా ఏ ఒక్కరి నుంచి ఆ ఇష్యూ మీద కనీస మాత్రంగా కూడా ఖండన కానీ కామెంట్ కానీ లేకపోవడం అయితే నందమూరి అభిమానులను తీవ్రంగా బాధిస్తోంది అని అంటున్నారు.
బాలయ్య ఒంటరిగా :
బాలయ్య టీడీపీలో ఒంటరి అయ్యారా అన్నది మరోసారి చర్చకు వస్తోంది అని అంటున్నారు. నిజానికి బాలయ్య విషయం తీసుకుంటే ఆయన తనకు తోచించి మాట్లాడేస్తారు అని అంటారు. ఆ తరువాత దానిని గురించి పట్టించుకోరని అంటారు. ఇక తన మాటలకు వచ్చే ఫలితాలు పర్యవసానాలు ఆయన పెద్దగా పట్టించుకోరని అంటారు. అందుకే ఆయన ఈ వ్యాఖ్యలు అసెంబ్లీలో చేసిన తరువాత ఎంత దుమారం రేగినా ఆయన మళ్ళీ ఏ విధంగానూ రియాక్ట్ కాలేదు, ఇక జగన్ ని పట్టుకుని బాలయ్య అన్న మాటలకు వైసీపీ పెద్ద రాద్ధాంతం చేసింది. ఆ పార్టీ నేతలు చాలా రోజుల పాటు ప్రెస్ మీట్లు పెట్టి మరీ బాలయ్య మీద ఫైర్ అయ్యారు.
సరైన రియాక్షన్ లేదని :
అంతే కాకుండా సోషల్ మీడియాలో ఆ పార్టీ సానుభూతిపరులు కూడా ట్రోల్స్ చేస్తూ వచ్చారు. అక్కడితో ఇష్యూ క్లోజ్ అయింది అనుకుంటే జగన్ మళ్ళీ బాలయ్య మీద గట్టిగానే కౌంటరేశారు అని అంటున్నారు. అయితే జగన్ తానుగా ఈ విషయం ప్రస్తావించలేదు, ఒక విలేకరి అడిగిన దానికి ఆయన రెస్పాండ్ అయ్యారు. అయితే జగన్ బాలయ్య మీద చేసిన వ్యాఖ్యల మీద బాలయ్య ఫ్యాన్స్ మండిపడుతోంది. కానీ టీడీపీ నాయకత్వం నుంచి సరైన రియాక్షన్ లేదని అంటోంది. మొత్తం మీద చూస్తే బాలయ్యకు పార్టీలో మద్దతు లేదా అని వారు నిర్వేదానికి లోను అవుతున్నారుట. అదే సమయంలో బాలయ్య మ్యాటర్ విషయంలో జోక్యం చేసుకోవడానికి కూడా ఎవరూ సాహసించే పరిస్థితి కూడా లేదని మరో మాటగా చెబుతున్నారు.
