Begin typing your search above and press return to search.

తెలంగాణా కవి పాత్రలో బాలయ్య...అరుదైన ప్రయోగం

ఇక ఈ మూవీ చేయాలని ఎన్టీఆర్ కి తట్టిన ఆలోచన వెనక ఎంతో ఉదాత్తమైన భావాలు ఉన్నాయి. ఆ రోజులలో అంటే 1970 దశకంలో తెలంగాణా తొలి దశ ఉద్యమం సాగింది.

By:  Satya P   |   9 Jan 2026 6:00 AM IST
తెలంగాణా కవి పాత్రలో బాలయ్య...అరుదైన ప్రయోగం
X

నందమూరి బాలకృష్ణ 14 ఏళ్ల వయసులోనే కెమెరా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 1974లో ఆయన తొలిసారిగా తాతమ్మ కల మూవీతో వెండి తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత వరసగా రాం రహీం, అన్నదమ్ముల అనుబంధం సినిమాలు చేశారు. ఇక అదే జోరులో ఆయన చేసిన నాలుగవ చిత్రం వేములవాడ భీమకవి. ఈ మూవీలో తన తండ్రి ఎన్టీఆర్ తో కలసి బాలయ్య చేయడం విశేషం. అప్పటికే రెండు సినిమాలు ఎన్టీఆర్ తో బాలయ్య చేసి ఉన్నారు. ఇక ఈ సినిమాకు కధను స్క్రీన్ ప్లేని ఎన్టీఆర్ సమకూర్చడం మరో విశేషం. ఈ మూవీకి డీ యోగానంద్ దర్శకత్వం వహించగా రామకృష్ణ సినీ స్టూడియోస్ వారి ఆస్థాన సంగీత దర్శకుడు పెండ్యాల మ్యూజిక్ అందించారు.





సరిగ్గా యాభై ఏళ్ళు :

ఇక వేములవాడ భీమకవి చిత్రం 1976 జనవరి 8వ తేదీన రిలీజ్ అయింది. అంటే సరిగ్గా యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంది అన్న మాట. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా విశేషాలు ఉన్నాయి. ఈ మూవీలో ఎన్టీఆర్ రాజుగా నటించారు. బాలయ్య భీమకవిగా టైటిల్ రోల్ ప్లే చేశారు. అంటే బాలయ్యే హీరో అన్న మాట. ఇక ఈ మూవీలో పాటలు పద్యాలు అన్నీ బాలయ్యకే ఉన్నాయి. ఆయనకు మాధవపెద్ది రమేష్ నేపధ్య గాయకుడిగా గొంతు అరువిచ్చారు. ఈ మూవీ చేసేనాటికి బాలయ్య వయసు కేవలం పదిహేనేళ్ళే. పైగా ఆయన చేసిన తొలి చారిత్రాత్మక చిత్రం ఇదే కావడం విశేషం.

ఉమ్మడి ఏపీ పరిణామాలు :

ఇక ఈ మూవీ చేయాలని ఎన్టీఆర్ కి తట్టిన ఆలోచన వెనక ఎంతో ఉదాత్తమైన భావాలు ఉన్నాయి. ఆ రోజులలో అంటే 1970 దశకంలో తెలంగాణా తొలి దశ ఉద్యమం సాగింది. అంతే కాదు మరో వైపు జై ఆంధ్రా ఉద్యమం కూడా సాగింది. ఇలా కొన్నేళ్ళ పాటు సాగిన తరువాత కేంద్రం జోక్యం తో అది చల్లారింది. అయితే ఎన్టీఆర్ ఆలోచనలు తెలుగు వారు అంతా ఎక్కడ ఉన్నా ఒక్కటి అని చెప్పాలనే. అందుకే ఆయన తెలంగాణా కవిగా ప్రసిద్ధుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జన్మించిన 15వ శతాబ్దం నాటి భీమకవి కధను ఎంచుకున్నారు. తానే స్వయంగా దగ్గరుండి రచన చేశారు. అంతే కాదు స్క్రీన్ ప్లే కూడా తయారు చేశారు. తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా నిర్మించారు. తన కుమారుడు బాలయ్య చేత భీమకవి పాత్రను పోషింపచేశారు.

సంక్రాంతి కానుకగా :

ఇదిలా ఉంటే 1976 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేశారు. అయితే ఈ మూవీ ఒక మాదిరి ఆదరణను మాత్రమే పొందింది. అయితే తక్కువ ఖర్చుతో నిర్మించడం వల్ల నష్టాలు అయితే రాలేదు. ఇక విజయవాడ హైదరాబాద్ వంటి చోట్ల షిఫ్టులతో యాభై రోజుల దాకా కొన్ని థియేటర్లలో రన్ అయింది. అలా సేఫ్ ప్రాజెక్ట్ గా నిలిచింది. అంతే కాదు ఈ మూవీలో నటించిన బాలయ్యకు మంచి పేరు కూడా తెచ్చింది. ఆయన చెప్పిన డైలాగులు ఆ రోజులల్లో థియేటర్లలో చప్పట్లు కురిపించేలా చేశాయి. అప్పాలన్నీ కప్పలు అయ్యాయి, అన్నమంతా సున్నం అయింది అంటూ ఆసువుగా భీమకవి పలికే పద్యాలు డైలాగులు అన్నీ జనాలకు బాగా పట్టాయని చెబుతారు.

అనేక విశేషాలు :

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కి హీరోయిన్ లేదు, బాలయ్య పాత్రకు కూడా లేదు, అంతే కాదు సామాజిక సామరస్యం అంటరాని తనం నిర్మూలన అన్నది కూడా ఈ సినిమాలో భీమకవి పాత్ర ద్వారా చెప్పించారు. అందరికీ ఆలయ ప్రవేశం ఉండాలన్నది కూడా ఈ సినిమాలో చూపించారు. ఒక విధంగా మంచి సందేశంతో కూడిన సినిమాగానే నిలిచింది. అయితే సంక్రాంతి అంటే మాస్ కథాంశాలతో కూడిన చిత్రాలకే ఎక్కువ ఆదరణ ఉంటుంది. దాంతో ఈ మూవీ రాంగ్ టైం లో రిలీజ్ కూడా కొంత ఇబ్బంది కలిగించింది అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఏది ఏమైనా పదిహేనేళ్ళ వయసులోనే ఒక మహాకవి పాత్ర పోషణ చేసి తన నోటి వెంట గ్రాంధికం తో కూడిన డైలాగులను అలవోకగా పలకడం ద్వారా బాలయ్య మంచి ప్రతిభను చూపించారు అని ప్రశంసలు అయితే సర్వత్రా వచ్చాయి.