బాలయ్య - ఒక వివాదం.. నాలుగు విమర్శలు.. !
నందమూరి బాలకృష్ణ. నటసింహం.. ఎమ్మెల్యే.. సీఎం చంద్రబాబుకు వియ్యంకుడు. అయితే.. ఆయన ఎప్పుడు నోరు విప్పినా వివాదాలకు కేంద్రంగా మారుతారు.
By: Garuda Media | 29 Sept 2025 11:00 PM ISTనందమూరి బాలకృష్ణ. నటసింహం.. ఎమ్మెల్యే.. సీఎం చంద్రబాబుకు వియ్యంకుడు. అయితే.. ఆయన ఎప్పుడు నోరు విప్పినా వివాదాలకు కేంద్రంగా మారుతారు. ఆ వివాదాలు.. ఇప్పుడు రాజకీయంగా కూటమిని కుదిపేస్తున్నా యి. పైకి అంతా బాగుందని అనుకున్నా.. అంతర్గతంగా మాత్రం కూటమిని ఇబ్బంది పెడుతున్నాయి. నిజానికి బాలయ్య చేసిన వ్యాఖ్యలు.. ఆయన అసెంబ్లీలో మాట్లాడింది కూడా.. కేవలం రెండు మూడు నిమిషాలే. అయితే.. ఆ వ్యాఖ్యలపైనే ఇప్పుడు రోజుల తరబడి వివాదాలు ముసురుకున్నాయి.
కూటమి ఎఫెక్ట్ విషయం పక్కన పెడితే.. బాలయ్యపై సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు మరింత ఎక్కువగా ఉన్నాయి. గతం మొత్తాన్ని మరోసారి గుర్తు చేస్తూ.. నెటిజన్లు పెడుతున్న వీడియోలు బాలయ్య ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నాయి. గతంలో 2004-05 మధ్య నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై బాలయ్య తన ఇంట్లో జరిపిన కాల్పుల ఘటనను ఇప్పుడు కీలక నాయకుల నుంచి సినీరంగానికి చెందిన వారు కూడా గుర్తు చేస్తున్నారు. అంతేకాదు.. ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి కనుక లేకపోతే.. ఏంజరిగి ఉండేదని కూడా నిలదీస్తున్నారు.
ఇక, చిరంజీవి విషయానికి వస్తే.. ఆయన సౌమ్యుడు, వివాద రహితుడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే.. అలాంటి నటుడిపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదన్న వాదన వినిపిస్తోంది.పైగా అసెంబ్లీలో లేని చిరంజీవి గురించి.. బాలయ్య వ్యాఖ్యలు చేయడాన్ని ఎవరూ సహించలేక పోతున్నారు. దీనిపై అంతర్గంగా జనసేన నాయకుల నుంచి మెగా అభిమానుల వరకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో కీలక విషయం.. బాలయ్య మత్తులో సభకు వచ్చారన్న వాదన. దీనిపైనా వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.
మొత్తంగా బాలయ్య పరిస్థితి ఇలా ఉంటే.. ఇప్పుడు కూటమి విషయంలోనూ చర్చ జరుగుతోంది. మెగా స్టార్‌ను బాలయ్య అవమానించారని.. దీనిపై పవన్ కల్యాణ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని.. ఆ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం చెప్పాలన్నది వారి డిమాండ్. వాస్తవానికి సభలో ఈ ఘటన జరిగినా.. మెజారిటీ జనసేన అభిమానులు మెగా కుటుంబం అంటే ప్రేమ చూపిస్తారు. ముఖ్యంగా చిరంజీవిని ఆరాధిస్తారు. వారు హర్ట్ అయ్యేలా బాలయ్య చేసిన వ్యాఖ్యలు.. ఉన్నాయన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. వాస్తవానికి బాలయ్య చేసిన వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించినా.. దీనివల్ల ప్రజల్లో జరుగుతున్న చర్చకు మాత్రం ఫుల్ స్టాప్ పడకపోవడం గమనార్హం.
