బాలయ్య ఎపిసోడ్ ... ఆర్ నారాయణమూర్తి బిగ్ ట్విస్ట్
ఈ విషయంతో అయినా సినీ ప్రముఖులను జగన్ అవమానించారు అన్న దానికి ఎండ్ కార్డు పడినట్లేనా అన్నది కూడా మరో చర్చ.
By: Satya P | 27 Sept 2025 7:09 PM ISTఏపీలో ఇపుడు ఒక్కటే హాట్ టాపిక్ గా ఉంది. ఎపుడో అయిదేళ్ల క్రితం 2020లో కరోనా పీక్స్ లో ఉన్నపుడు తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు అంతా కలసి అప్పటి సీఎం వైఎస్ జగన్ ని కలసి వచ్చారు. ఆ బృందానికి సినీ పెద్దగా మెగాస్టార్ చిరంజీవి వ్యవహరించారు. అయితే ఆ భేటీకి వెళ్ళిన సినీ ప్రముఖులను జగన్ అవమానించారు అని గత అయిదేళ్లుగా విస్తృతంగా విపరీతంగా ప్రచారం అయితే సాగింది. ఈ ప్రచారం కూడా వైసీపీ 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలు కావడానికి కారణం అయింది. ఇదిలా ఉంటే అసెంబ్లీలో రెండు రోజుల క్రితం బాలయ్య మాట్లాడుతూ చిరంజీవి మీద చేసిన వ్యాఖ్యలతో అసలు విషయం వెలుగు చూసింది. మెగాస్టార్ చిరంజీవి అయితే సినీ ప్రముఖులను జగన్ ఎక్కడా అవమానించలేదు అని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. పరిశ్రమ మేలు కోసమే తామంతా జగన్ ని కలిశామని కొన్ని సమస్యలు ప్రస్తావించి పరిష్కారాలు కనుగొన్నామని కూడా చెప్పారు.
జగన్ అవమానించలేదు :
అయితే ఇదే విషయం మీద ఆనాటి సినీ బృందంలో ఉన్న ఆర్ నారాయణమూర్తి కూడా తాజాగా స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి చెప్పింది అక్షర సత్యమని అన్నారు. చిరంజీవి సినీ పెద్దగా అందిరినీ కలుపుకుని జగన్ వద్దకు వెళ్ళారని గుర్తు చేశారు. ఆనాడు కరోనా పరిస్థితులలో సినీ పరిశ్రమ ఏమవుతుంది అన్న అవేదన అందరిలో ఉందని అందుకే తామంతా ముఖ్యమంత్రి జగన్ ని కలవాల్సి వచ్చిందని చెప్పారు. అయితే బయట జరుగుతున్న ప్రచారం మాదిరిగా జగన్ తమను ఎవరినీ అవమానించలేదని నారాయణమూర్తి స్పష్టం చేశారు. తామంతా వెళ్తే ఆయన ఎంతో గౌరవించారని తమ సమస్యలు పరిష్కరించాలని సినీమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న పేర్ని నానికి బాధ్యతలు అప్పగించారని ఆర్ నారాయణమూర్తి చెప్పడం విశేషం.
మౌనం వీడుతున్న సినీ ప్రముఖులు :
ఇదిలా ఉంటే జగన్ సినీ ప్రముఖులను ప్రత్యేకించి చిరంజీవిని అవమానించారు అన్నది చిన్న విషయం ఏమీ కాదు, అయిదు దశాబ్దాల సినీ చరిత్రతో పాటు కోట్లాది మంది అభిమానులను కలిగి మెగాస్టార్ గా వెలుగుతున్న చిరంజీవిని అవమానించడం అంటే అది ఏ మాత్రం లైట్ గా తీసుకునేది కాదు, సినీ హీరోలకు ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు. వారు తన సొంత కుటుంబంగా ఆరాధిస్తారు. అలాంటిది అందరికీ అవమానించారు అంటే ఆ ప్రభావం రాజకీయంగా ఎంతో దెబ్బ తీస్తుందో అందరికీ తెలిసిందే. అదే వైసీపీ విషయంలో జరిగింది. ఒక రోజూ రెండు రోజులు అని కాదు ఏకంగా అయిదేళ్ల పాటు ఇదే తీరున ప్రచారం అయితే సాగింది. కానీ ఆనాడు పెద్దగా ఎవరూ రియాక్ట్ కాలేదని వైసీపీ నేతలు అంటున్నారు. ఇపుడు మెగాస్టార్ పెదవి విప్పడం తో సినీ ప్రముఖులు అంతా మౌనం వీడుతున్నారని గుర్తు చేస్తున్నారు.
ఎండ్ కార్డు పడినట్లేనా :
ఈ విషయంతో అయినా సినీ ప్రముఖులను జగన్ అవమానించారు అన్న దానికి ఎండ్ కార్డు పడినట్లేనా అన్నది కూడా మరో చర్చ. అయితే రాజకీయాల్లో ఇది వరకూ ప్రజా సమస్యలు మాత్రమే అజెండాగా ఉండేది. ఇపుడు మాత్రం కాదేదీ అనర్హం అన్నట్లుగా అన్నీ తీసుకుని వస్తున్నారు. దాంతో రాజకీయం అతి పెద్ద సవాల్ గా మారింది. వైసీపీ విషయానికి వస్తే అయిదేళ్ళ పాలనలో దూకుడు చేసింది. దాంతో ఏది నిజమో ఏది నిందో అన్నది కూడా ఎవరికీ తెలిసేది కాదు. మొత్తం మీద ఇపుడు వైసీపీకి భారీ ఊరట ఇచ్చేలాగానే పరిణామాలు జరిగాయై అంటున్నారు. ఇకనైనా ఈ విషయానికి ఎండ్ కార్డు పడాలని అంతా కోరుతున్నారు. అదే సమయంలో సినిమాలకు రాజకీయాలను ముడి పెట్టి చూడడం ఆపితే అందరికీ మేలు అని అంటున్నారు. సినిమావారిది ఒకే కులం ఒకే మతం అని వారికి అన్ని ప్రభుత్వాలు ఒక్కటే అని కూడా అంటున్నారు. సున్నితమైన అంశాలలో వారిని లాగినా వారు బయటకు వచ్చి చెప్పుకునేది ఏదీ ఉండదని కూడా అంటున్నారు. మొత్తానికి బాలయ్య ఎపిసోడ్ లో ఆర్ నారాయణమూర్తి తాజా వ్యాఖ్యలు అయితే మరో బిగ్ ట్విస్ట్ గానే అంతా చూస్తున్నారు.
