Begin typing your search above and press return to search.

బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి : చిరంజీవి ఫ్యాన్స్ సంచలన ప్రకటన

నందమూరి బాలకృష్ణ అసెంబ్లీ సమావేశాల్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సినీ పరిశ్రమలోనూ పెద్ద చర్చనీయాంశంగా మారాయి.

By:  A.N.Kumar   |   26 Sept 2025 4:47 PM IST
బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి : చిరంజీవి ఫ్యాన్స్ సంచలన ప్రకటన
X

నందమూరి బాలకృష్ణ అసెంబ్లీ సమావేశాల్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సినీ పరిశ్రమలోనూ పెద్ద చర్చనీయాంశంగా మారాయి. మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలను ఆయన అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్యకు వార్నింగ్ ఇస్తూ చిరంజీవి అభిమాన సంఘం సంచలన ప్రకటన విడుదల చేసింది.

అఖిల భారత చిరంజీవి యువత ఒక ప్రకటన విడుదల చేస్తూ.. బాలకృష్ణ వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. "అసెంబ్లీ సాక్షిగా చిరంజీవి గారిని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం మేము సహించలేం. గతంలోనూ ఆయన మెగా కుటుంబంపై అవమానకరంగా మాట్లాడారు. కానీ మా హీరో చిరంజీవి ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటూ స్పందించలేదు. అభిమానులుగా మేము కూడా ఆయన మనసెరిగి మౌనంగా ఉన్నాం. అయితే, ఈసారి మాత్రం ఆయన ప్రతిష్టను దిగజార్చేలా వ్యాఖ్యానించడం మాకు తట్టుకోవడం కష్టంగా ఉంది" అని అభిమాన సంఘం పేర్కొంది.

కష్టాల్లో అండగా నిలిచింది మెగా కుటుంబమే!

మెగా అభిమానులు ఈ సందర్భంగా పాత విషయాలను గుర్తుచేశారు. "బాలకృష్ణ కుటుంబం కష్టాల్లో ఉండి జైలు పాలైనప్పుడు అండగా నిలిచింది మెగా కుటుంబమే. అధికారంలోకి రావడంలో కూడా చిరంజీవి కుటుంబం అహర్నిశలూ కృషి చేసింది. ఆ విజ్ఞతను మరచి, అధికార మదంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం" అని వారు తెలిపారు.

మరోసారి మాట్లాడితే నిరసనలు తప్పవు.. అభిమానుల హెచ్చరిక

"మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మెగా అభిమానుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వెంటనే బహిరంగ క్షమాపణలు తెలపకపోతే ప్రజాక్షేత్రంలో నిరసనలు తప్పవు" అని అభిమానులు బాలకృష్ణను హెచ్చరించారు.

ప్రస్తుతం బాలకృష్ణపై ఈ వ్యాఖ్యల వివాదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజకీయ, సినీ వర్గాలంతా ఆయన స్పందన కోసం వేచి చూస్తున్నారు. మరి బాలయ్య ఈ ఆరోపణలకు, డిమాండ్‌కు ఎలా ప్రతిస్పందిస్తారో చూడాలి.