Begin typing your search above and press return to search.

బాలకృష్ణ వ్యాఖ్యలు సిగ్గు సిగ్గు.. బొత్స తీవ్ర ఆగ్రహం

అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి.

By:  A.N.Kumar   |   26 Sept 2025 8:36 PM IST
బాలకృష్ణ వ్యాఖ్యలు సిగ్గు సిగ్గు.. బొత్స తీవ్ర ఆగ్రహం
X

అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, సినీ పరిశ్రమ అగ్రనాయకుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి పట్ల బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) సీనియర్‌ నేత, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణ మాటలు వినడానికే సిగ్గుగా ఉన్నాయని బొత్స ఎద్దేవా చేశారు.

మాజీ సీఎం, అగ్ర హీరో పట్ల అవమానకర వ్యాఖ్యలు

బాలకృష్ణ వ్యాఖ్యలు సభా రికార్డుల్లో ఉన్నాయని బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా గుర్తు చేశారు. "ఒక మాజీ ముఖ్యమంత్రిని, చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా నిలిచిన వ్యక్తిని ఈ విధంగా అవమానించడం ఎంతమాత్రం సమంజసం కాదు. బాలకృష్ణ వ్యాఖ్యలు దురదృష్టకరం" అని ఆయన మండిపడ్డారు.

టీడీపీ నేతల్లో పెరుగుతున్న అహంకారాన్ని బొత్స ఈ సందర్భంగా ప్రశ్నించారు. "సభలో లోకేష్ మమ్మల్ని ఎవరేం పీకుతారు అన్నారు. అదే తీరులోనే ఇప్పుడు బాలకృష్ణ ప్రవర్తిస్తున్నారు. ఇంత అహంభావం ఎందుకు?" అని బొత్స సూటిగా ప్రశ్నించారు.

*చిరంజీవి అవమానంపై జనసేన మౌనం

చిరంజీవిని అవమానిస్తూ బాలకృష్ణ మాట్లాడినప్పటికీ, జనసేన పార్టీ ఇప్పటివరకు స్పందించకపోవడంపై కూడా బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. "అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం" అని పేర్కొన్నారు. తమ వాదన కేవలం సభా సంప్రదాయాల గురించి మాత్రమేనని స్పష్టం చేశారు. అయితే బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పీకర్‌ ఇప్పటివరకు మౌనం వహించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. "సభలో ఇలాంటి అవమానకర సంఘటనలు జరగడం చాలా బాధాకరం" అని ఆవేదన వ్యక్తం చేశారు.

*మండలి చైర్మన్‌పై వివక్ష ఆరోపణలు

బాలకృష్ణ వ్యాఖ్యల వివాదంతో పాటు, మండలి చైర్మన్‌కు సంబంధించిన మరో అంశాన్ని కూడా బొత్స లేవనెత్తారు. మండలి చైర్మన్‌ స్థానంలో ఒక దళితుడు కూర్చున్నాడనే కారణంగానే ప్రభుత్వ పెద్దలు ఆయన్ని అవమానించాలని చూస్తున్నారని బొత్స ఆరోపించారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికీ హక్కులు ఉన్నాయని, వాటిని గౌరవించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన స్పష్టం చేశారు.

"మాజీ ముఖ్యమంత్రి అన్నా గౌరవం లేదు, సినీ పరిశ్రమకు చెందిన మాజీ కేంద్ర మంత్రి అన్నా గౌరవం లేదు. బాలకృష్ణ పెద్ద పుడింగి అనుకుంటున్నారు. స్పీకర్‌ కూడా పెద్ద మాటలు మాట్లాడుతారు... కానీ ఇలాంటి సందర్భంలో ఎందుకు మౌనం వహించారు?" అని బొత్స ప్రశ్నించారు.

బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో తీవ్ర వివాదానికి దారి తీస్తూ, అధికార, ప్రతిపక్షాల మధ్య కొత్త చర్చకు ఆస్కారం కల్పించాయి.