Begin typing your search above and press return to search.

ఆ టీడీపీ సీనియ‌ర్ దూకుడు పెంచాల్సిందేనా..?

స్థానిక రాజకీయ విశ్లేషణలు, సర్వేల ప్రకారం ఆయన పనితీరు మ‌రింత మెరుగు ప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు.

By:  Garuda Media   |   14 Sept 2026 3:00 PM IST
ఆ టీడీపీ సీనియ‌ర్ దూకుడు పెంచాల్సిందేనా..?
X

ఉమ్మ‌డి శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయ‌కుడు బగ్గు రమణమూర్తి సో.. సోగా వ్య‌వ‌హ‌రిస్తున్నారా? ఆయ‌న దూకుడు పెంచాల్సిన అవ‌స‌రం ఉందా? అంటే.. ఔన‌నే అంటున్నాయి టీడీపీ శ్రేణులు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా గెలిచిన ఆయన పనితీరుపై నియోజకవర్గంలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. స్థానిక రాజకీయ విశ్లేషణలు, సర్వేల ప్రకారం ఆయన పనితీరు మ‌రింత మెరుగు ప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు.

సానుకూల అంశాలను ప‌రిశీలిస్తే.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు చేప‌డుతున్నారు. నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో పారిశుధ్య మెరుగుదలకు కృషి చేస్తున్నారు. ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ వంటి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో చురుగ్గా పాల్గొంటున్నారు. నియోజకవర్గ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఆయనకు అసెంబ్లీ బీసీ సంక్షేమ కమిటీ సభ్యుడిగా కీలక బాధ్యతలు అప్పగించారు.

ఈ ప‌ద‌విని నియోజకవర్గంలోని వెనుకబడిన వర్గాల అభివృద్ధికి వినియోగించాల్సిన అవ‌స‌రం ఉంది. అయితే.. ఆదిశ‌గా ఇప్ప‌టికీ బ‌గ్గు ప్ర‌య‌త్నాలు ప్రారంభించ‌లేదు. అభివృద్ధి పనుల వేగం పుంజుకున్నా.. మౌలిక సదుపాయాల కల్పన, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ వంటి ప్రధాన సమస్యల పరిష్కారంలో ఆశించిన స్థాయిలో వేగం లేదనే విమర్శలు వస్తున్నాయి. నియోజకవర్గంలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దూకుడు పెరుగుతోంది.

ముఖ్యంగా మాజీ మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న వార‌సుడుని రంగంలోకి దింపే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. దీంతో తరచూ రాజకీయ వాగ్వాదాలు, సవాళ్లు నడుస్తున్నాయి. మొత్తంగా చూస్తే... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్న‌రేళ్ల‌ కాలంలో భ‌గ్గు ర‌మ‌ణ‌మూర్తి ప‌నిచేస్తున్నా.. అనుకున్న స్థాయిలో దూకుడు ప్ర‌ద‌ర్శించ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన స్థానిక హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చడం లేద‌ని స్థానికంగా చ‌ర్చ సాగుతోంది. ఇది రాబోయే ఎన్నిక‌ల్లో ఆయన గ్రాఫ్ ను ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ముఖ్యంగా జెన్‌జీకి చేరువ అయ్యేందుకు ప్ర‌య‌త్నించాల్సి ఉంది.