Begin typing your search above and press return to search.

వైసీపీ నుంచి బొత్సనే సస్పెండ్ చేయాలి : బడ్డుకొండ

రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తనకు నెల్లిమర్ల నియోజకవర్గంలో బొత్స తమ్ముడు లక్ష్మణరావు అనేక ఇబ్బందులు పెట్టారని, అయినా బొత్స చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

By:  Tupaki Political Desk   |   3 Oct 2026 6:17 PM IST
వైసీపీ నుంచి బొత్సనే సస్పెండ్ చేయాలి : బడ్డుకొండ
X

వైసీపీ నుంచి సస్పెండ్ చేయడంపై నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు తీవ్రంగా స్పందించారు. చిన్న శ్రీను బావ మరిదిని అన్న ఏకైక కారణంతోనే తనపై సస్పెన్షన్ విధించారని ఆరోపించారు. తనపై చర్యలు వద్దు అంటూ జిల్లా నేతలు వారిస్తున్నా అధినేత జగన్మోహనరెడ్డి సస్పెండ్ చేశారని, చిన్న శ్రీను వెళ్లినట్లు తాను కూడా కండవా కప్పు కుంటానేమోనని భయపడ్డారని అన్నారు. నెల్లిమర్ల ఇంచార్జి పదవి నుంచి తప్పించి అవమానించినా పార్టీలో కొనసాగాలనే ఆలోచనతో మౌనంగా ఉన్నానని, కానీ జగన్మోహనరెడ్డి మాత్రం పార్టీ నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నాక తాను కొనసాగలేనని చెప్పారు. తనతోపాటు అనుచరులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

చిన్న శ్రీను నాకు బావమరిది అన్న కారణంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా చెబుతున్నారని, అదే ప్రాతిపదిక అయితే తనకన్నా ముందు సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చిన్న శ్రీనుకు బావ అవుతారని, ఆ విధంగా అయితే బొత్సను కూడా సస్పెండ్ చేస్తారా? అంటు ప్రశ్నించారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తనకు నెల్లిమర్ల నియోజకవర్గంలో బొత్స తమ్ముడు లక్ష్మణరావు అనేక ఇబ్బందులు పెట్టారని, అయినా బొత్స చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తనకు చిన్న శ్రీనుకు సంబంధం లేకపోయినా పార్టీ వ్యతిరేక కార్యకలాపాల పేరుతో తప్పించారని అన్నారు. అయితే తనను ఇంచార్జిగా తొలగించిన నుంచి ఇప్పటివరకు ఎవరితో మాట్లాడ లేదన్నారు.

జగన్ పై తీవ్ర విమర్శలు

పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తిరుపతి వెంకన్నను బ్రేక్ దర్శనంలో అయినా దర్శించుకోవచ్చు కానీ, జగన్ రెడ్డి దర్శనం మాత్రం ఎవరికీ దొరికేది కాదని అన్నారు. అంతేకాకుండా తన కోడలు టీడీపీ కండువా కప్పుకుందని వైసీపీలో తాను కొనసాగేందుకు వీలు లేదని అంటున్నారని, అలాగైతే జగన్ రెడ్డి సొంత చెల్లెలు షర్మిలా రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారని, దీనికి ఆయన ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తన బావ మరిది చిన్న శ్రీను జిల్లాలో పార్టీకి అన్నివిధాలుగా సేవ చేస్తే, ఆయనను పక్క జిల్లా వెళ్లిపోమని చెప్పారని, అందుకే ఆయన టీడీపీలో చేరారని అన్నారు.

పంచాయతీల్లో పోటీ చేస్తాం

వైసీపీకి రాజీనామా చేసిన తాను ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు స్పష్టం చేశారు. కూటమిలో నేతలు ఎక్కువ అయ్యారని, టీడీపీ, జనసేన, బీజేపీలో చేరమని ఎటువంటి ఆహ్వానాలు లేవని తెలిపారు. ఇప్పటికే నాయకులతో టీడీపీ కిటకిటలాడుతోందని అన్నారు. తనతో ఉన్నవారిని కాపాడుకోవడానికి వచ్చే స్థానిక ఎన్నికల్లో పోటీచేస్తామని స్పష్టం చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికలు జరగకూడదని, గెలవకపోతే టికెట్లు ఇవ్వనని జగన్ చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, పంచాయతీ ఎన్నికల్లో అలాంటి ప్రకటనల వల్ల ఉపయోగం ఉండదని అన్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు అపర రాజకీయ చాణుక్యుడని, అసెంబ్లీలో తప్ప ఆయనను నేరుగా ఎప్పుడూ కలవలేదన్నారు.

టీడీపీ మాతృసంస్థ

ఇక వైసీపీ నుంచి బయటకు వచ్చినట్లు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. 2006లో కాంగ్రెస్ పార్టీ తరఫున జడ్పీ చైర్మన్ అయిన బడ్డుకొండ 2009లో అదే పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2019లో వైసీపీ తరఫున రెండోసారి శాసనసభ్యుడిగా గెలిచారు. అయితే తనకు టీడీపీ మాతృ సంస్థ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. 1995లో రాజకీయాల్లోకి వచ్చిన తాను ముందుగా టీడీపీలో పనిచేశానని, ఆ తర్వాత బొత్సతో బంధుత్వం కారణంగా కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీలో చేరినట్లు వెల్లడించారు.