బీజేపీతో జగన్ పొత్తు......ఫ్లాష్ బ్యాక్ చెప్పిన మాజీ వైసీపీ నేత
ఈ విషయం గతంలో ప్రచారంలో ఉంది కానీ ఇంత అఫీషియల్ గా ఎవరూ బయటకు చెప్పలేదు. 2024 ఎన్నికల్లో బీజేపీ వైసీపీతో పొత్తుకు ముందుకు వచ్చిందని బడ్డుకొండ చెప్పారు.
By: Satya P | 3 Oct 2026 7:00 PM ISTవైసీపీ నుంచి సస్పెండ్ అయిన నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు జగన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి రాజకీయ సంచలనం సృష్టించారు. నిజానికి ఆయన ఒక నియోజకవర్గానికి చెందిన నాయకుడు. పెద్దగా ఇప్పటిదాకా మీడియా ముందు మాట్లాడింది కూడా లేదు. అలాంటి ఆయన తనను పార్టీ నుంచి బయటకు పంపించడంతో ఆగ్రహంతో మొత్తం వైసీపీ మీద జగన్ మీద విమర్శలు చేయడమే కాకుండా పార్టీ గుట్టు మట్టూ మీడియా ముందే విప్పేశారు. జగన్ ని ఒక నియంత అన్నారు, ఆయనకు రాజకీయాలు తెలియవు అన్నారు. కార్పోరేట్ తరహాలో ప్రైవేట్ కంపెనీ కింద పార్టీని నడుపుతున్నారు అని ఘాటు విమర్శలే చేశారు. జగన్ వల్లనే వైసీపీ ఓటమి పాలు అయింది అని అతి పెద్ద బండనే వేశారు.
బీజేపీని వద్దనుకుని :
ఈ విషయం గతంలో ప్రచారంలో ఉంది కానీ ఇంత అఫీషియల్ గా ఎవరూ బయటకు చెప్పలేదు. 2024 ఎన్నికల్లో బీజేపీ వైసీపీతో పొత్తుకు ముందుకు వచ్చిందని బడ్డుకొండ చెప్పారు. అయితే తన భజన బ్యాచ్ మాటలు విని జగన్ సింహం సింగిల్ గా వస్తుందంటూ బీజేపీ ఆఫర్ ని కాలదన్నారు అని సంచలన విషయాలు బయటపెట్టారు అదే సమయంలో బీజేపీతో పొత్తుని టీడీపీ తన అపరచాణక్యంతో కుదుర్చుకుని 2024లో అధికారంలోకి వచ్చిందని చెప్పారు. చంద్రబాబు రాజకీయ తెలివితేటలను కూడా బడ్డుకొండ కొనియాడారు. ఇక బీజేపీతో పొత్తు లేకపోవడం వల్లనే 2024 ఎన్నికల్లో వైసీపీ చావు దెబ్బ తిందని అన్నారు. మొదటి దశలో ఏపీలో ఎన్నికలు జరిగి ఉంటే విజయనగరం జిల్లాలో తనతో పాటు బొత్స సత్యనారాయణ, కోలగట్ల వీరభద్రస్వామి బొత్స అప్పలనరసయ్య వంటి వారు అంతా గెలిచేవారు అని ఆయన చెప్పారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని కూటమి కట్టిన టీడీపీ చివరి దశలో ఏపీలో ఎన్నికలు పెట్టించి సర్దుబాట్లు చేసుకున్నారని ఫలితంగా వైసీపీ దారుణ పరాజయం పాలు అయింది అన్నారు.
రాజకీయం తెలియదు :
జగన్ కి రాజకీయం అంటే తెలియదు అని బడ్డుకొండ సీరియస్ కామెంట్స్ చేశారు. తాను జగన్ ఎంపీ కాక ముందు నుంచే రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. సర్పంచ్ నుంచి తాను జిల్లా పరిషత్ చైర్మన్ గా గెలిచి ఎమ్మెల్యేగా రెండు సార్లు పనిచేశాను అన్నారు. జగన్ బొమ్మ అన్ని చోట్లా చెల్లదని చెప్పారు. గ్రామ స్థాయిలో జరిగే సర్పంచ్ ఎన్నికల్లో బంధుత్వాలు కుటుంబాలు పరిచయాలు స్నేహాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఏకగ్రీవాలు జరిగితే ఇంచార్జి పదవి తీసేస్తాను అని జగన్ చెప్పడం మీద ఫైర్ అయ్యారు. పార్టీ మీ సొంత జాగీరా అని ఆయన నిలదీశారు. ఎవరో చెప్పిన స్క్రిప్ట్ ని తాడేపల్లి ఆఫీస్ లో నాలుగు గోడల మధ్యన కూర్చుని చదవడం కాదని ఆయన మండిపడ్డారు. జగన్ తనను పార్టీ నుంచి తొలగిస్తే తన వెంట వచ్చే వారు అంతా గట్టిగా నిలబడతారు అని అన్నారు. పార్టీ కంటే తన అనుచర గణం బంధు గణం, తనను అభిమానించే వారే ఎక్కువగా ఉంటారు అని చెప్పారు. ఇప్పటికే అనేక మంది సర్పంచులు రాజీనామా చేశారని మరింత మంది రానున్న రోజుల్లో వచ్చి చేరుతారు అని ఆయన స్పష్టం చేశారు.
అందుకే చిన్న శ్రీను టీడీపీలోకి :
చిన్న శ్రీనుకు జగన్ వైఖరి నచ్చకనే టీడీపీలోకి వెళ్ళారు అని బడ్డుకొండ చెప్పారు. విజయనగరం జిల్లాలో ఉండాలని చిన్న శ్రీను భావిస్తే ఆయనకు భీమిలీ ఎచ్చెర్ల నుంచి పోటీ చేయాలని జగన్ సూచించారు అని చెప్పారు. అది నచ్చకనే ఆయన పార్టీని వీడిపోయారు అని అసలు గుట్టు చెప్పారు. పార్టీలో అధినాయకుడి తీరు బాగా లేదని కార్యకర్తలు అంతా అనుకుంటున్నారని ఆయన విమర్శించారు. వైసీపీ రాజకీయ విధానాలు కూడా సరిగ్గా లేవని బడ్డుకొండ హాట్ కామెంట్స్ చేశారు. తనను అభిమానించే వారు ఉన్నారని అందరితో కలసి తాను తొందరలో కీలక నిర్ణయం తీసుకుంటాను అని బడ్డుకొండ చెప్పారు. వైసీపీ ఓటమి తరువాత గడచిన రెండేళ్ళుగా పార్టీ కోసం ఎంతో ఖర్చు చేశాను అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలు అన్నీ పక్కన పెడితే బీజేపీతో వైసీపీ పొత్తు అన్నది అధికారికంగా రివీల్ చేసిన బడ్డుకొండ ఏపీ రాజకీయాల్లో వైరల్ న్యూస్ ని అందించారు అని అంటున్నారు.
