కొంతకాలం గురిగింజను గుర్తు చేసుకోండి కేటీఆర్
ఎవరు అధికారంలో ఉన్నా.. తమ పదవీ కాలంలో కొన్ని తప్పులు ఆటోమేటిక్ గా జరుగుతాయి.
By: Garuda Media | 16 Jan 2026 10:00 AM ISTఎవరు అధికారంలో ఉన్నా.. తమ పదవీ కాలంలో కొన్ని తప్పులు ఆటోమేటిక్ గా జరుగుతాయి. అలాంటి వాటి విషయంలో ప్రజలు క్షమించేందుకు కొంత సమయం పడుతుంది. అందునా.. నాన్ స్టాప్ గా పదేళ్లు అధికారాన్ని సొంతం చేసుకొని.. తెలంగాణ చాంఫియన్లుగా తమను తాము ప్రమోట్ చేసుకున్న గులాబీ బ్యాచ్ విషయంలో తెలంగాణ ప్రజలు ఇప్పటికి పాత విషయాల్ని మర్చిపోయే పరిస్థితుల్లో లేరు.
ఇలాంటప్పుడు తగిన సమయం కోసం వెయిట్ చేయటానికి మించింది లేదు. అలా అని మరీ కేసీఆర్ మాదిరిగా దూరంగా ఉండకుండా.. అదే సమయంలో కేటీఆర్ మాదిరి నిత్యం అదే పనిగా ప్రభుత్వాన్ని వంక పెట్టటం.. విమర్శించటం లాంటివి చేయకుండా తగిన టైం కోసం వెయిట్ చేయటం బాగుంటుంది. కానీ.. కేటీఆర్ మాత్రం డైలీ బేసిస్ లో రేవంత్ సర్కారుపై విరుచుకుపడటమే లక్ష్యంగా వ్రతం చేయటం తెలిసిందే.
ఆయన నోటి నుంచి ప్రతి మాటకు.. సామాన్యుడి మదిలో సైతం కౌంటర్ ఇట్టే వచ్చేలా చేయటం వల్ల తన మాటలకు ఎలాంటి విలువ లేకుండా ఉండటమే కాదు.. మానుతున్న గాయాన్ని కెలికినట్లుగా చేసే పరిస్థితి ఉంటుందన్న విషయం కేటీఆర్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. కానీ.. ఇవేమీ చేయని కేటీఆర్.. రేవంత్ సర్కారుపై ఘాటు విమర్శలు చేస్తూ.. అడ్డంగా బుక్ అయ్యే పరిస్థితి.
పార్టీ ఫిరాయింపులపై తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్నే తీసుకుంటే.. తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామన్న విషయాన్ని ఎలా మర్చిపోతారు? తాము ఎలాంటి తప్పు చేయకుండా ఉండి.. రేవంత్ సర్కారును విమర్శిస్తే అందులో అంతో ఇంతో అర్థముంటుంది. ప్రజలు సైతం కనెక్టు అవుతారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షమే ఉండకూడదన్నట్లుగా.. అందరిని గులాబీ కారులో ఎక్కించేయటం.. తెలంగాణ కోసం పోరాడినోళ్లను దూరంగా పెట్టేసి.. కొత్తగా పార్టీలోకి వచ్చినోళ్లకు పదవుల పందేరం చేయటం.. పార్టీ ఫిరాయింపు అంశాన్ని అప్పట్లో ప్రస్తావిస్తే.. బంగారు తెలంగాణ కోసం వచ్చినోళ్లను అన్నేసి మాటలు అంటారా? అంటూ ఎదురు ప్రశ్నించిన రోజుల్ని తెలంగాణ సమాజం ఇంకా మర్చిపోలేదన్న విషయాన్ని కేటీఆర్ ఎందుకు గుర్తించరు?
పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డిపై వేటు వేయాలంటూ డిమాండ్ కు భిన్నంగా.. సదరు ఎమ్మెల్యేలు ఇద్దరు పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవని స్పీకర్ తాజాగా ప్రకటించిన నేపథ్యంలో కేటీఆర్ తన ఆగ్రహాన్ని సోషల్ మీడియాలో పోస్టు ద్వారా వ్యక్తం చేయటం తెలిసిందే. రాజ్యాంగ విలువలకు నిలువునా పాతరేశారంటూ ధ్వజమెత్తిన కేటీఆర్.. ఆధారాలు లేవని చెప్పటం పవిత్రమైన శాసనసభను అవమానించటమే అంటూ మండిపడటం చూసినప్పుడు.. మనం అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనుల మాటేమిటి కేటీఆర్? అంటూ ప్రశ్నించటం కనిపిస్తుంది.
జరుగుతున్న పరిణామాల విషయంలో కాస్తంత మౌనాన్ని ప్రదర్శించటం.. ప్రజలు తమకు తాము ఆలోచించే స్పేస్ ఇవ్వటం.. అదే సమయంలో గతంలో తాము చేసిన తప్పులకు లెంపలేసుకొని.. భవిష్యత్తులో అలాంటి తప్పులు జరగవన్న హామీ ఇవ్వటం లాంటివి చేస్తే అంతో ఇంతో బాగుంటుంది. అలాంటిదేమీ లేకుండా కేవలం పడిగట్టు పదాల్ని ప్రయోగిస్తూ.. విమర్శల వర్షం కురిపిస్తే.. తెలంగాణ ప్రజలు కనెక్టు కారన్న విషయాన్ని కేటీఆర్ కు చెప్పేదెవరు? అన్నది ప్రశ్న.
