అజారుద్దీన్ కు మంత్రి పదవి వెనుక రేవంత్ పెద్ద ప్లానింగే?
రాజకీయ విశ్లేషణల ప్రకారం, అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక అని తెలుస్తోంది. మైనార్టీ ఓటు బ్యాంకు కోసం ఈ స్కెచ్ వేశారని సమాచారం.
By: A.N.Kumar | 31 Oct 2025 8:22 PM ISTతెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ అజారుద్దీన్ హఠాత్తుగా రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్‌లో ఖాళీగా ఉన్న మూడు స్థానాల్లో ఒకదానిని అజార్‌కి కేటాయించడం, ఆయన శుక్రవారం ఉదయం రాజ్‌భవన్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.కేబినెట్ విస్తరణ కోసం ఎంతో మంది సీనియర్ ఆశావహులు ఎదురుచూస్తున్న తరుణంలో హఠాత్తుగా అజార్‌కు బెర్త్ దక్కడం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? అనే ప్రశ్న తలెత్తుతోంది.
* జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక - అసలు పిచ్!
రాజకీయ విశ్లేషణల ప్రకారం, అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక అని తెలుస్తోంది. మైనార్టీ ఓటు బ్యాంకు కోసం ఈ స్కెచ్ వేశారని సమాచారం. ఈ నియోజకవర్గంలో లక్షకు పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ, మైనార్టీ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడం లేదా కాపాడుకోవడం ప్రధాన వ్యూహంగా పెట్టుకుంది. మైనార్టీల అసంతృప్తి చల్లార్చేందుకు ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ నేతలు జూబ్లీహిల్స్‌లో పర్యటించినప్పుడు, స్థానిక ముస్లిం మత పెద్దలు కేబినెట్‌లో మైనార్టీ ప్రాతినిధ్యం లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. "రెండేళ్లు పూర్తయినా కేబినెట్‌లో మైనార్టీ ప్రతినిధి లేరు" అనే విమర్శలు పార్టీని ఇరుకున పెట్టాయి. ఈ విమర్శలు, అసంతృప్తి నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి చురుకుగా స్పందించి, వెంటనే ఈ అంశాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారని చెబుతున్నారు. మైనార్టీ వర్గంలో ఉన్న అసంతృప్తిని చల్లార్చడానికి అజార్‌కు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన ప్రతిపాదించారు.
* రేవంత్ ప్రతిపాదనకు స్పాట్ అప్రూవల్!
మైనార్టీ వర్గం నుంచి వచ్చిన ఒత్తిడిని, రేవంత్ రెడ్డి ప్రతిపాదనలోని వ్యూహాత్మక ప్రాముఖ్యతను కాంగ్రెస్ హైకమాండ్ త్వరగా గుర్తించింది. కేబినెట్ విస్తరణపై సాధారణంగా ఆలస్యం జరిగే కాంగ్రెస్ అధిష్ఠానం, ఈ విషయంలో పెద్దగా ఆలోచించకుండా రేవంత్ ప్రతిపాదనకు 'స్పాట్ అప్రూవల్' ఇచ్చింది. దీని వెనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కీలక పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, మైనార్టీ కోటాలో అజార్‌ను మంత్రి చేయడంతో మైనార్టీ వర్గానికి గౌరవం ఇవ్వడంతో పాటు, అజారుద్దీన్ ఇమేజ్ ద్వారా యువత, క్రికెట్ అభిమానుల ఓట్లను కూడా ఆకర్షించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఇది పార్టీకి, అజార్‌కూ డబుల్ బెనిఫిట్ అవుతుందని భావిస్తున్నారు.
* అజార్ సిక్స్ కొడతారా?
క్రికెట్ మైదానంలో ఎన్నో శతకాలు, అద్భుతమైన షాట్లు ఆడిన మహ్మద్ అజారుద్దీన్, ఇప్పుడు రాజకీయాల్లో కాంగ్రెస్ విజయానికి సిక్స్ కొడతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అజార్ ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది తేలాలి.
రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ వేసిన ఈ 'మైనార్టీ కార్డు' జూబ్లీహిల్స్ పిచ్‌పై ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి.
