మంత్రిగా అజారుద్దీన్.. క్రిటిక్స్‌పై ఫస్ట్ రియాక్షన్ ఇదే!
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కోడ్ కు విరుద్ధమని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి అజారుద్దీన్ తిప్పికొట్టారు.
By: Garuda Media | 31 Oct 2025 6:47 PM ISTతెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న భారత మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్.. ఆ పదవిని చేపట్టిన అనంతరం.. నేరుగా కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ అధిష్టానానికి, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం.. మంత్రిగా ఆయన తొలిసారి స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. తనపై వస్తున్న విమర్శలకు అంతే షార్పుగా సమాధానం చెప్పారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. మంత్రి పదవి ఎలా ఇస్తారని, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కోడ్ కు విరుద్ధమని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి అజారుద్దీన్ తిప్పికొట్టారు. మహారాష్ట్ర సహా అనేక రాష్ట్రాల్లో రాజ్యాంగాన్ని సైతం గౌరవించని ఆ పార్టీకి కాంగ్రెస్ ను విమర్శించే హక్కులేదన్నారు. అంతేకాదు.. తనపై కేసులు ఉన్నాయన్న కిషన్ రెడ్డి ఒక్కటైనా నిరూపిస్తారా? అని ప్రశ్నించారు.
తనపై కేసులు ఉంటే నిరూపించాలన్నారు. తనపై ఒక్క కేసు కూడా లేదన్న అజారుద్దీన్.. తన గురించి కిషన్ రెడ్డికి ఏం తెలుసునని ప్రశ్నించారు. ఇక, బీఆర్ ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలను తాను పట్టించుకోన ని తేల్చి చెప్పారు. "నాపై వచ్చినవన్నీ ఆరోపణలే. వాటిపై అవగాహన లేకుండా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. వాటిని నేను పట్టించుకోను." అని అజారుద్దీన్ వ్యాఖ్యానించారు. మైనారిటీలకు కాంగ్రెస్ ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తూనే ఉందన్నారు.
అయితే.. గత ఎన్నికల్లో ఒక్కరూ విజయం దక్కించుకోలేక పోయారని.. అందుకే మంత్రి వర్గంలో చోటు కల్పించడంలో ఆలస్యమైందన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలకు తనకు మంత్రి పదవి ఇవ్వడానికి సంబంధం ఉందని తాను భావించడం లేదన్నారు. ప్రభుత్వం పనితీరుకు ప్రజల నుంచి మంచి మార్కులు పడుతున్నాయని.. ఇవే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయన్నారు. పార్టీ అధిష్టానం చెబితే.. ప్రచారం చేస్తానని తెలిపారు.
