Begin typing your search above and press return to search.

నో వర్క్ నో పే.... ఎమ్మెల్యేలకు ఎందుకు వర్తింప చేయకూడదు ?

ఇదిలా ఉంటే అసెంబ్లీ జరిగేదే ఏడాదికి కేవలం 45 రోజులు మాత్రమే అని ఆయన అన్నారు.

By:  Satya P   |   14 Sept 2025 7:00 PM IST
నో వర్క్ నో పే.... ఎమ్మెల్యేలకు ఎందుకు వర్తింప చేయకూడదు ?
X

స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి చట్ట సభలలో జరుగుతున్న తీరు తెన్నులు మీద గట్టిగా మాట్లాడారు. తిరుపతిలో జరిగిన జాతీయ మహిళా సాధికారత సదస్సులో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేలు సభకు రావడం విధానం అన్నారు. సభకు రావాలనే ప్రజలు ఓటు వేసి పంపించారు. ప్రజా తీర్పు అది అని అన్నారు ప్రజా తీర్పుని గౌరవించకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. సభకు రాకుండా ఉంటే ఎలా కుదురుతుందని కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు.

సభ జరిగేదే తక్కువ :

ఇదిలా ఉంటే అసెంబ్లీ జరిగేదే ఏడాదికి కేవలం 45 రోజులు మాత్రమే అని ఆయన అన్నారు. ఆ సమయంలో కూడా సభకు అటెండ్ కాకపోతే ఇంక ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. ప్రజలు తమ సమస్యల గురించి అత్యున్నత సభలో ప్రస్తావించాలని తమను ఎన్నుకుంటారు అన్న విషయాన్ని కొందరు ఎమ్మెల్యేలు విస్మరించడం బాధాకరం అని అయ్యన్నపాత్రుడు అన్నారు. ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యల మీద చర్చించాల్సిన బాధ్యత ఉందని ఆయన న్నారు.

జీతాలు మాత్రం తీసుకుంటున్నారు :

సభకు హాజరు కాని ఎమ్మెల్యేలు జీతాలు మాత్రం తీసుకుంటున్నారు అని అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు రాకుండా జీతాలు ఎలా తీసుకుంటారు అని ఆయన నిలదీశారు. అసెంబ్లీకు డుమ్మా కొట్టి మరీ నెల నెలా జీతాలు తీసుకోవడం సబబేనా అని ఆయన అంటున్నారు. ఈ విషయం అంతా ఆలోచించాలని ఆయన కోరారు.

నో వర్క్ నో పే ఉండాలి :

ఒక చిన్న పాటి ఉద్యోగి విధులకు హాజరు కాకపోతే తనకు జీతాలు ఇవ్వడం లేదని నో వర్క్ నో పేని అమలు చేస్తున్నారు అని అయ్యన్న గుర్తు చేశారు. అదే అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలు జీతాలు ఎలా తీసుకుంటారు అని ఆయన లాజిక్ పాయింట్ ని లేవదీశారు. ఉద్యోగులు విధులకు రాకపోతే జీతాలలో కోత పెడుతున్నారని మరి ఎమ్మెల్యేల విషయంలో ఏ రకమైన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

లోక్ సభ స్పీకర్ డైరెక్షన్లో :

ఈ విషయంలో దేశంలో అత్యున్నత చట్ట సభగా ఉన్న పార్లమెంట్ తగిన డైరెక్షన్ ఇవ్వాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు. ఏ కారణం లేకుండా గైర్ హాజరు అయ్యే ఎమ్మెల్యే విషయంలో ఏమి చేయాలి అన్న దాని మీద గైడ్ లైన్స్ ని లోక్ సభ స్పీకర్ ఇవ్వాల్సి ఉందని ఆయన అన్నారు. ఆ మీదట దానికి తగినట్లుగా తాము నడచుకుంటామని అయ్యన్న అన్నారు

వైసీపీ మీదనేనా :

ఏపీ అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు వరసబెట్టి డుమ్మా కొడుతున్నారు. సభ జరిగే ముందు ఎన్ని సార్లు పిలిచినా రావడం లేదు. దాంతో అయ్యన్న ఈ విధంగా వ్యాఖ్యానించారు అని అంటున్నారు. సభకు రాని ప్రజా ప్రతినిధుల మీద ఏ రకంగా చర్యలు తీసుకోవచ్చో లోక్ సభ ఒక రూలింగ్ కానీ డైరెక్షన్ కానీ ఇస్తే దానిని దేశవ్యాప్తంగా ఒక సంప్రదాయంగా అమలు చేయవచ్చు అని అంటున్నారు. మొత్తంగా చూస్తే కనుక వైసీపీ ఎమ్మెల్యేల గైర్ హాజరుని జనంలోనే పెట్టాలని వీలైనన్ని చోట్ల ఆ అంశాన్ని హైలెట్ చేస్తూ జనంలో చర్చకు పెట్టాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది అని అంటున్నారు. చూడాలి దీని మీద వైసీపీ ఏ విధమైన రియాక్షన్ ఇస్తుందో. తాము సభకు హాజరు కావడం లేదు కాబట్టి జీతాలు తీసుకోమని వైసీపీ ఎమ్మెల్యేలు చెబితే కూడా బాగానే ఉంటుంది అంటున్నారు. మరి అలా వైసీపీ ఎమ్మెల్యేలు చేయగలరా అన్నదే ప్రశ్న.