Begin typing your search above and press return to search.

టీం 11పై అయ్యన్న ఆగ్రహం.. లక్నో వెళ్లినా వదలని స్పీకర్

స్పీకర్ అయ్యన్నపాత్రుడు తన టార్గెట్ నుంచి ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. విపక్ష వైసీపీ సభ్యులే లక్ష్యంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు రాజకీయంగా తీవ్రదుమారం రేపుతున్నాయి.

By:  Tupaki Political Desk   |   21 Jan 2026 4:31 PM IST
టీం 11పై అయ్యన్న ఆగ్రహం.. లక్నో వెళ్లినా వదలని స్పీకర్
X

స్పీకర్ అయ్యన్నపాత్రుడు తన టార్గెట్ నుంచి ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. విపక్ష వైసీపీ సభ్యులే లక్ష్యంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు రాజకీయంగా తీవ్రదుమారం రేపుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా జీతాలు తీసుకుంటున్నారని విమర్శలు చేస్తున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు చివరికి జాతీయ స్థాయిలోనూ వైసీపీ ఎమ్మెల్యేలను వదలడం లేదు. ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న చట్ట సభల సభాపతుల 86వ అఖిల భారత మహాసభకు హాజరైన స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆ సభలో మాట్లాడుతూ ‘నో వర్క్ - నో పే’ అంటూ సంచలన ప్రతిపాదన చేశారు.





చట్టసభలకు హాజరుకాని ప్రజాప్రతినిధులకు ‘నో వర్క్ - నో పే’ అన్న నిబంధన తీసుకురావాలని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సూచించారు. ఎమ్మెల్యేలకు జీతాలు ఇవ్వకపోయినా పనితీరు మార్చుకోకపోతే, ప్రజలు వారిని వెనక్కి పిలిపించేలా "రైట్ టు రీకాల్" హక్కును కల్పించాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరారు. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లఖనవూలో జరుగుతున్న సభాపతుల అఖిల భారత మహాసభలో "ప్రజల పట్ల శాసన వ్యవస్థ జవాబుదారీతనం" అనే అంశంపై ఆయన ప్రసంగించారు. రాష్ట్ర శాసనసభలో నెలకొన్న పరిస్థితులను ఉదహరిస్తూ స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు.





2024 జూన్‌లో ఎన్నికైనప్పటి నుంచి కొంతమంది సభ్యులు ఇప్పటివరకు ఒక్క రోజు కూడా సభకు హాజరు కాలేదని, కనీసం చర్చల్లో కూడా పాల్గొనలేదని స్పీకర్ల సభలో అయ్యన్నపాత్రుడు ప్రస్తావించారు. సభకు రాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు, భత్యాలు మాత్రం తీసుకుంటున్నారని, ఇది చాలా బాధాకరమైన విషయమని వ్యాఖ్యానించారు. ఇలాంటి అనైతిక ప్రవర్తన వల్ల ప్రజల దృష్టిలో ఎమ్మెల్యేలు చులకన అవుతారని గ్రహించాలని హితవుపలికారు.

సభకు హాజరుకాని వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రస్తుతం స్పష్టమైన నిబంధనలు లేనందున, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా దీనికి మార్గం చూపాలని అయ్యన్నపాత్రుడు గారు కోరారు. ఈ సందర్భంగా రెండు ప్రధాన సూచనలు చేశారు. ఉద్యోగులు విధులకు రాకపోతే జీతాలు కోత విధించినట్లే, సభకు రాని ప్రజాప్రతినిధులకు కూడా "నో వర్క్ - నో పే" నిబంధన అమలు చేయాలి. ప్రజాప్రతినిధులు తమ బాధ్యతను విస్మరిస్తే, రాజ్యాంగాన్ని లేదా ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించి అయినా సరే.. వారిని వెనక్కి పిలిపించే "రైట్ టు రీకాల్" హక్కును ఓటర్లకు కల్పించాలని వ్యాఖ్యానించారు.

దురదృష్టవశాత్తు చట్టసభల పనిదినాలు ఏడాదికి ఏడాది తగ్గిపోతున్నాయని, ఇది వ్యవస్థ అనారోగ్యానికి సూచిక అంటూ స్పీకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా కనీసం 60 రోజులైనా చట్టసభలు పనిచేయాలని, అప్పుడే ప్రశ్నోత్తరాలు, ఇతర చర్చల ద్వారా ప్రభుత్వాన్ని నిలదీసి, ప్రజలకు జవాబుదారీగా ఉండగలమని ఆయన స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధుల పట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని, ఆత్మవిమర్శ చేసుకుని వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని ఆయన సభ్యులకు హితవు పలికారు.