Begin typing your search above and press return to search.

వైఎస్సార్ కే నో చెప్పాను...అయ్యన్న ఇంట్రెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్ !

టీడీపీలో అత్యంత సీనియర్ నాయకులు అతి కొద్ది మంది ఉంటే అందులో ప్రస్తుత శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఒకరు.

By:  Satya P   |   18 Jan 2026 8:58 PM IST
వైఎస్సార్ కే నో చెప్పాను...అయ్యన్న ఇంట్రెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్ !
X

టీడీపీలో అత్యంత సీనియర్ నాయకులు అతి కొద్ది మంది ఉంటే అందులో ప్రస్తుత శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఒకరు. ఆయన స్వయంగా ఎన్టీఆర్ నుంచి టికెట్ ని పొందిన వారు, 1983లో అన్న గారితో పాటే రాజకీయ రంగ ప్రవేశం చేసిన వారు. పాతికేళ్ళ వయసులోనే ఎమ్మెల్యే అయిపోయారు. ఆ తరువాత రెండేళ్ళకే మంత్రి కూడా అయిపోయారు. తన కెరీర్ లో అనేక మంత్రిత్వ శాఖలను చేపట్టిన అయ్యన్న విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి మొత్తం ఏడుసార్లు గెలిచి రికార్డు బ్రేక్ చేశారు.

కాంగ్రెస్ పిలుపు వస్తే :

తన నియోజకవర్గంలో అన్న గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ తో తన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తాను టీడీపీలోనే పుట్టాను, అందులోనే ఉన్నతమైన రాజకీయ జీవితాన్ని పొందాను అన్నారు. చివరికి తాను టీడీపీ జెండా కప్పుకునే పోతాను అని ఎమోషనల్ అయ్యారు. తన జీవితం మొత్తం టీడీపీదే అని చెప్పారు. తాను పార్టీ మారేది అన్నది ఎపుడూ లేదని ఎప్పటికీ ఉండదని స్పష్టం చేశారు. తనను ఒకసారి వైఎస్సార్ కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు అని అయ్యన్న ఫ్లాష్ బ్యాక్ స్టోరీని చెప్పారు. అయితే తాను కాంగ్రెస్ లో చేరేది లేదని వైఎస్సార్ కి కూడా స్పష్టంగా చెప్పాను అని అన్నారు. తాను టీడీపీ మనిషిని అని అదే తన ఏకైక పార్టీ అని అయ్యన్న చెప్పారు.

నీకు డెబ్బై... నాకు ఎనభై :

ఇదిలా ఉంటీ ఈ సభలో పాల్గొన్న రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ అయ్యన్నపాత్రుడికి డెబ్బై ఏళ్ళు అయితే తనకు ఎనభై ఏళ్ళు అని అన్నారు తామిద్దరం 95 ఏళ్ళు పైగా జీవిస్తామని చెప్పారు. తాము చివరి దాకా టీడీపీ కోసమే పనిచేస్తామని చెప్పారు. టీడీపీకి అయ్యన్నపాత్రుడు తన అవసరం ఇంకా ఎంతో ఉందని అన్నారు. అయ్యన్న రాజకీయాల్లో కొనసాగాలని కోరారు. తమ ఇద్దరూ అంటే అన్న గారికి ఎంతో ప్రేమ అన్నారు, దగ్గరుండి మిరపకాయ బజ్జీలు తినిపించారు అని గోరంట్ల గుర్తు చేసుకున్నారు.

నిజాయితీయే బలం :

ఇక టీడీపీలో తాము దశాబ్దాలుగా కొనసాగుతున్నామంటే నిజాయితీయే తమ బలం అన్నారు. అయ్యన్న తానూ ముక్కు సూటిగా ఉంటామని అందుకే తాము చెప్పే మాటలకు పార్టీలో ఎంతో విలువ ఉంటుందని అన్నారు. అయ్యన్న స్పీకర్ గా ఉన్నందువల్ల తనకు సభలో మాట్లాడేందుకు అధిక సమయం ఇవ్వాలని ఈ సందర్భంగా గోరంట్ల కోరడం మరో విశేషం. ఇక తెలుగుదేశం పార్టీ ఖ్యాతిని ఎన్టీఆర్ ఎంతో ఎత్తుకు తీసుకుని వెళ్ళారని ఆయన ఖండాంతరాలకు తెలుగు వాడి ఘనతను తీసుకెళ్ళారని చెప్పారు. టీడీపీతోనే అభివృద్ధి ఉందని టీడీపీతోనే ఏపీ అన్ని విధాలుగా ముందుకు సాగుతోందని గోరంట్ల అన్నారు. మొత్తానికి చూస్తే కనుక టీడీపీ పెట్టాక అన్న గారి చేతుల మీదుగా తొలి టికెట్లు పొందిన ఇద్దరు సీనియర్ నేతలు అయ్యన్న గోరంట్ల ఈ రోజుకీ టీడీపీలో కొనసాగుతూ పార్టీ నాలుగున్నర దశాబ్దాల చరిత్రలో భాగం అయ్యారని తమ్ముళ్ళు అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.