సేఫ్ జోన్ లో అయ్యన్న ....మిగిలిన వారంతా ?
టీడీపీలో సీనియర్ మోస్ట్ లీడర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సేఫ్ జోన్ లో ఉన్నారు. అందుకే ఆయన నిబ్బరంగా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని చెబుతున్నారు.
By: Satya P | 24 Sept 2026 8:54 AM ISTటీడీపీలో సీనియర్ మోస్ట్ లీడర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సేఫ్ జోన్ లో ఉన్నారు. అందుకే ఆయన నిబ్బరంగా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని చెబుతున్నారు. స్వచ్చంద పదవీ విరమణ మీద ధీమా ప్రదర్శిస్తున్నారు. అయ్యన్న ఉత్తరాంధ్రాలో సీనియర్ నేత. 1982లో ఎన్టీఆర్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయన ఏడు సార్లు ఎమ్మెల్యేగా అనేక సార్లు మంత్రిగా కీలక మంత్రిత్వ శాఖలు చూసి ప్రస్తుతం రాజ్యాంగ పదవి అయిన స్పీకర్ స్థానంలో ఉన్నారు. 2029 లో పోటీ చేసేది లేదు, ఇది తన కచ్చితమైన నిర్ణయం అని ఆయన లేటెస్ట్ గా మరోసారి బిగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఉత్తరాంధ్రాలోనే కాదు ఏపీలోని టీడీపీ నేతలలో అయ్యన్న అంత కన్ఫర్మ్ గా తన రిటైర్మెంట్ గురించి చెప్పే నేత మరొకరు కనిపించడం లేదు, ఇలా ఎందుకు అంటే అయ్యన్న సేఫ్ జోన్ లో ఉన్నారని అంటున్నారు.
వారసులు రెడీగా :
ఇక అయ్యన్న వారసులు రెడీగా ఉన్నారు. పెద్ద కుమారుడు చింతకాయల విజయ్ ఈ మధ్యనే రాజ్యసభకు వెళ్లారు, ఆయన ఆరేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారు. ఒక విధంగా జాతీయ రాజకీయాల్లో ఆయన అనుభవం సంపాదిస్తారు. అలాగే ఈ ఉన్నత పదవితో పార్టీలోనూ రాష్ట్రంలోనూ జిల్లాలోనూ ఆయన కీలకంగా మారుతారు. ఇక రెండవ కుమారుడు రాజేష్ ని నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా 2029 ఎన్నికల్లో పోటీ చేయించాలని అయ్యన్న చూస్తున్నారు. ఈ మేరకు ఆయనకు హామీ లభించింది అని అంటున్నారు. అందుకే అయ్యన్న నిబ్బరంగా ఉన్నారని చెబుతున్నారు.
సమకాలికులు అయినా :
అదే సమయంలో అయ్యన్నకు సమకాలికులుగా అనేక మంది నేతలు కనిపిస్తారు. బహుశా వారి రాజకీయ జీవితం కూడా 2029 లో ముగియవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే టీడీపీ యువ బృందంతోనే వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగుతుందని చెబుతున్నారు. అయితే తాము పదవీ విరమణ చేసినా తమ వారసులకు టికెట్లు ఇస్తే ఓకే అన్నట్లుగా చాలా మంది సీనియర్లలో ఉంది. కానీ అందరు సీనియర్ల వారసులకు ఈ సూత్రం వర్తించదు అని అంటున్నారు. దాంతోనే వారిలో కంగారు కనిపిస్తోంది. తమ వారసులు సెటిల్ అయ్యేంతవరకూ తాము మరింతకాలం పొలిటికల్ ఇన్నింగ్స్ ని కొనసాగించాల్సి వస్తుందని కూడా వారు భావిస్తున్నారు అని అంటున్నారు.
సమర్థతకు పెద్ద పీట :
అయితే వారసులు అన్న క్వాలిఫికేషన్ ఒక్కటే చాలదని అంటున్నారు. ఆ నాయకుడికి నిజంగా సత్తా ఉంటే పార్టీ వదులుకోదని చెబుతున్నారు. లేని పక్షంలో కేరాఫ్ అని తీసుకుని వచ్చినా ఫలితం ఉండదని అంటున్నారు. దాంతోనే వారసుల విషయంలో అనేక మంది సీనియర్లు కలవరపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు మరో రెండున్నరేళ్లలో ఉన్నాయి. ఈలోగా తమ పరిస్థితి ఏమిటి తమ వారసుల సంగతి ఏమిటి అన్నది పలువురు టీడీపీ సీనియర్ నేతలు సీరియస్ గానే ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఇక ఉత్తరాంధ్ర కు చెందిన ఒక సీనియర్ మోస్ట్ టీడీపీ నాయకుడు అయితే తన కుమారుడికి టికెట్ ఇస్తే తాను హ్యాపీగా రాజకీయ విరమణ చేస్తాను అంటున్నారు. అలాగే మరో సీనియర్ నేత అయితే తన కుమారుడికి ఎమ్మెల్యేగా సీటు ఇస్తే తాను కూడా రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుంటాను అని అంటున్నారు. ఇదే తీరున అనేక మంది నేతలు చెబుతున్నారు. అయితే వారు చెప్పినట్లుగా టికెట్లు ఇవ్వడానికి సామాజిక రాజకీయ పరిస్థితులు పొత్తులు అన్నీ అనుకూలించాలని అంటున్నారు. అందుకే అయ్యన్నకు ఉన్న నిబ్బరం ఎవరికీ లేకుండా పోతోందిట.
