Begin typing your search above and press return to search.

టీడీపీ కంచుకోటలో అన్నదమ్ముల రాజకీయం స్టార్ట్ ?

అనకాపల్లి జిల్లాలోని నర్శీపట్నం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన అసెంబ్లీ నియోజకవర్గం అన్నది తెలిసిందే.

By:  Satya P   |   22 July 2026 10:00 AM IST
టీడీపీ కంచుకోటలో అన్నదమ్ముల రాజకీయం స్టార్ట్  ?
X

అనకాపల్లి జిల్లాలోని నర్శీపట్నం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన అసెంబ్లీ నియోజకవర్గం అన్నది తెలిసిందే. రాజకీయంగా సంచలనంతో పాటు ఎపుడూ వాడి వేడిగా సాగే పరిణామాలతో వార్తలలో నర్శీపట్నం నిలుస్తుంది. ఈ నియోజకవర్గానికి టీడీపీ పుట్టాక పదిసార్లు అసెంబ్లీ ఎన్నికలు ఒక ఉప ఎన్నిక జరిగితే ఉప ఎన్నికతో కలిపి ఎనిమిది సార్లు టీడీపీ గెలుచుకుంది. రెండు సార్లు కాంగ్రెస్ గెలిస్తే ఒకసారి వైసీపీ బోణీ కొట్టింది. అయ్యన్నపాత్రుడి ఇలాకాగా నర్శీపట్నం పేరు గడించింది. 10 సార్లు ఎమ్మెల్యే టికెట్ పార్టీ ఆయనకే ఇచ్చింది. ఒకసారి అనకాపల్లి నుంచి ఎంపీగా కూడా ఆయన గెలిచారు. ఇపుడు అయ్యన్న వారసుల వైపుగా ఈ నియోజకవర్గం టీడీపీ రాజకీయం క్రమంగా మారుతోంది అని అంటున్నారు.

ఎంపీగా ప్రస్థానంతో :

అయ్యన్న పెద్ద కుమారుడు విజయ్ రాజ్యసభ సభ్యుడు అయ్యారు. ఆయన ఎంపిక అనూహ్యంగా జరిగింది. నిజానికి రాజ్యసభ సభ్యులు అంటే వయసు మీరిన వారికే చాన్స్ అంటారు. కానీ నాలుగు పదులు నిండిన విజయ్ వంటి యువకుడిని టీడీపీ రాజ్యసభకు పంపించింది. విజయ్ కూడా పార్లమెంట్ లోనే తన గళం విప్పాలని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. అనకాపల్లి ఎంపీ సీటు కోసం ఆయన గతంలో ప్రయత్నాలు కూడా చేసి విఫలం అయ్యారు. ఇపుడు టీడీపీయే ఆయనను ఏకంగా పెద్దల సభకు పంపించడంతో ఆయన ఎంతో ఖుషీ అవుతున్నారు. ఇక లోకేష్ టీం లో ముఖ్యుడుగా పార్టీలోనూ కీలక పదవులు చూస్తున్న విజయ్ రాజకీయం అయ్యన్న వారసుడిగా జోరుగా సాగనుంది అంటున్నారు.

తమ్ముడి గురించి అలా :

ఇక తాజాగా ఒక వెబ్ పోర్టల్ కి విజయ్ ఇంటర్వ్యూ ఇస్తూ తన తమ్ముడు నర్శీపట్నం మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ అయిన రాజేష్ గురించి ప్రస్తావించారు. తమ్ముడు పార్టీ కోసం ఎంతో కష్టపడిన వారిగా చెప్పారు. వైసీపీ హయాంలో మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో రాజేష్ చొరవ తీసుకుని తన వ్యాపారాలు సైతం వదులుకుని ప్రజా జీవితంలోకి వచ్చారని కితాబు ఇచ్చారు. ఆ విధంగా రాజేష్ పార్టీ పట్ల తన నిబద్ధతను చాటుకుంటూ పనిచేస్తున్నారు అని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో పోటీ :

ఇక నర్శీపట్నం నుంచి 2029 ఎన్నికల్లో పోటీ గురించి కూడా విజయ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను రాజ్యసభ మెంబర్ గా ఉన్నాను అని ఆరేళ్ళ పాటు తన పదవి ఉందని అందువల్ల నర్సీపట్నం ఎమ్మెల్యే సీటుకు పోటీ పడేది లేదని చెప్పారు. తాను పార్లమెంట్ మెంబర్ గానే ఉంటూ పార్టీ కోసం పనిచేస్తాను అని స్పష్టత ఇచ్చారు. అదే సమయంలో తన తమ్ముడు రాజేష్ పార్టీకి పనిచేసే గట్టి నాయకుడు అని కూడా ఆయన చెప్పడం విశేషం. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపిస్తామని పనిచేస్తామని విజయ్ చెప్పినా కూడా తమ్ముడికి వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందన్న విశ్వాసం అయితే ఆయనలో ఉందని అంటున్నారు.

సీనియారిటీకి ప్రయారిటీ :

టీడీపీ పుట్టినప్పటి నుంచి పార్టీలో పనిచేస్తున్న అయ్యన్నపాత్రుడి కుటుంబానికి ఎపుడూ ఒక్కటే టికెట్ దక్కుతోంది. అదే శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు కుటుంబానికి రెండు టికెట్లు ఇస్తున్నారు. 2019 ఎన్నికల్లో అయితే మూడు టికెట్లు ఇచ్చారు అని పార్టీలో చర్చ సాగింది. దాంతో అయ్యన్న కూడా రెండు టికెట్లు తమ కుటుంబానికి దక్కాలని చాలా కాలంగా కోరుతున్నారని అంటున్నారు. అది ఇన్నాళ్ళకు నెరవేరింది అని గుర్తు చేస్తున్నారు. అయ్యన్న విజయ్ ఇద్దరూ పదవుల్లో ఉన్నారు. రేపటి రోజున అయ్యన్న రాజకీయ విరమణ చేస్తే ఆయన చిన్న కుమారుడు నర్శీపట్నం నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా టీడీపీ నుంచి వస్తారు అని అంటున్నారు. అయ్యన్న కుటుంబం బరిలోకి లేకుంటే టీడీపీకి కూడా పట్టు దొరకడం కష్టమని అంటున్న నేపథ్యంలో రాజేష్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అని ప్రచారం సాగుతోంది. దీంతో నర్శీపట్నంలో అన్నదమ్ముల రాజకీయం స్టార్ట్ అయిపోయినట్లే అని అంటున్నారు.