అయ్యన్న సంచలన నిర్ణయం...టీడీపీలో చర్చ !
అలా అయ్యన్న సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఎమ్మెల్యేగా ఉండగానే పెళ్ళి కూడా చేసుకున్నారు.
By: Satya P | 5 Sept 2026 7:03 PM ISTరాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సీనియర్ మోస్ట్ టీడీపీ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు తన పుట్టిన రోజు సందర్భంగా ఒక సంచలన నిర్ణయం ప్రకటించారు. తన రాజకీయ రిటైర్మెంట్ ప్రకటన చేసి మరీ ఆయన తన అభిమానులకు అనుచరులకు షాక్ ఇచ్చారు. అంతే కాదు టీడీపీలో కూడా అతి పెద్ద చర్చకు తెర తీశారు. సెప్టెంబర్ 4న అయ్యన్న పుట్టిన రోజు. ఆయన ఈ పుట్టిన రోజుతో డెబ్బై పడిలో పడ్డారు. పుట్టిన రోజు సందర్భంగా అయ్యన్న సొంత నియోజకవర్గం నర్శీపట్నంలో ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఉద్దేశించి అయ్యన్న మాట్లాడుతూ సడెన్ గా తన రాజకీయ పదవీ విరమణను ప్రకటించారు. తనకు ప్రస్తుతం డెబ్భై ఏళ్ళు వచ్చేశాయని ఆయన అంటూ తాను ఇక విశ్రాంతి తీసుకోక తప్పదని అన్నారు.
పోటీ చేయను అంటూ :
తనకు ఎమ్మెల్యేగా మిగిలింది మూడేళ్ళ పదవీ కాలం మాత్రమే అని అన్నారు. ఈ సమయంలోనే తాను ఏమి చేసినా ప్రజలకు చేయగలను అని చెప్పారు. తన పదవీ కాలం ముగిసిన తరువాత చేయగలిగేది ఏదీ లేదని కూడా చెప్పారు. ఇక 2029 నాటికి తనకు 73 ఏళ్ళు వస్తాయని అయ్యన్న చెప్పారు అందువల్ల తాను అప్పటికి చురుకుగా క్రియాశీలకంగా వ్యవహరించలేనని అయ్యన్న చెప్పారు. తనకు కూడా రెస్ట్ కావాలి కదా అని ఆయన అన్నారు. అందుకే తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా అయ్యన్న ప్రకటించారు. అయ్యన్న చేసిన ఈ ప్రకటన రాష్ట్ర రాజకీయాలతో పాటు టీడీపీలో కూడా హాట్ డిస్కషన్ గా మారుతోంది.
ఎన్టీఆర్ చాయిస్ గా :
అయ్యన్నపాత్రుడు టీడీపీ స్థాపించిన వెంటనే 1982లో ఆ పార్టీలో చేరారు. ఎన్టీఆర్ పిలుపు మేరకు ఆనాటి యువత అంతా పార్టీ వైపుగా మొగ్గు చూపింది. అందులో అయ్యన్న ఒకరు. అప్పటికి ఆయన వయసు పాతికేళ్ళు కూడా లేవు, దాంతో ఎమ్మెల్యేగా పోటీకి ఆయన ఏజ్ సరిపోతుందా లేదా అన్న డౌట్ కూడా వచ్చింది. అయితే 1983 జనవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయానికి అయ్యన్నకు పాతికేళ్ళు నిండుతాయని లెక్క వేసి మరీ పార్టీ టికెట్ ని ఎన్టీఆర్ ఇచ్చారు. బడుగు వర్గాలకు చెందిన అయ్యన్నపాత్రుడు అంటే ఎన్టీఆర్ ఎంతగానో ఇష్టపడ్డారు. ఆయనే పోటీ చేయాలని కోరుకున్నారు. అలా అయ్యన్న పోటీకి ఏజ్ ఫ్యాక్టర్ అప్పట్లో ఒక చర్చగా ఉంటే అంత చిన్న వయసులో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం ఎన్టీఆర్ గొప్పదనంగా చూస్తారు. ఇక అంతే కాదు ఎన్టీఆర్ తన మంత్రివర్గంలో పిన్న వయసులోనే అయ్యన్నకు చోటిచ్చారు. అలా అయ్యన్న సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఎమ్మెల్యేగా ఉండగానే పెళ్ళి కూడా చేసుకున్నారు.
ఏడు సార్లు ఎమ్మెల్యేగా :
ఇక నర్శీపట్నం రాజకీయాల్లో అయ్యన్న తిరుగులేని మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన జనంతో మమేకం అయిన తీరుతో వారంతా ఆయన పట్ల అదే విధంగా అభిమానం చూపించేవారు. అయ్యన్న ఎన్టీఆర్ మంత్రి వర్గంలో కీలకమైన అటవీ శాఖ తదితర మంత్రిత్వ శాఖలను చూసారు. ఇక చంద్రబాబుకు కూడా అయ్యన్న ఎంతో ఇష్టుడిగా ఉంటూ వచ్చారు. అందుకే బాబు ఆయనకు ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను కట్టబెట్టారు. ఒక దశలో అయ్యన్నను అనకాపల్లి నుంచి ఎంపీగా కూడా పోటీ చేయించారు. అలా 1998 ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్ కి కూడా వెళ్లారు. మొత్తం 10 సార్లు తన రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా అయ్యన్న పోటీ చేస్తే మూడు సార్లు ఓటమి తప్పించి ఏడు సార్లు గెలిచారు. అందులో 1989, 2009, 2019లలో ఆయన ఓడిపోయారు. మరో వైపు చూస్తే 2024 ఎన్నికల్లో కూడా పోటీ చేయను అని అయ్యన్న చెప్పారని అంటారు.
రెండవ కుమారుడి కోసమే :
కానీ చంద్రబాబు ఆయనే పోటీ చేయాలని పట్టుబట్టడంతో రంగంలోకి దిగారు, బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచారు. ఇక అయ్యన్నకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు విజయ్ ఈ మధ్యనే రాజ్యసభ మెంబర్ గా నెగ్గారు, చిన్న కుమారుడు రాజేష్ కౌన్సిలర్ గా గెలిచి అయిదేళ్ల పాటు మున్సిపాలిటీలో ప్రజా సమస్యల మీద పనిచేస్తూ వచ్చారు. 2029 ఎన్నికల్లో తన రెండవ కుమారుడిని ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని అయ్యన్న చూస్తున్నారు. అందుకే ఆయన రాజకీయ విరమణ ప్రకటించారు అని అంటున్నారు. అయితే అయ్యన్న వంటి సీనియర్ నేత రాజకీయాల నుంచి తప్పుకుంటానంటే అధినేత చంద్రబాబు ఎంతవరకూ అంగీకరిస్తారో చూడాల్సి ఉంది అని అంటున్నారు.
