ఇద్దరు మాజీ మంత్రులు...చరిత్ర ఏమి చెబుతోంది ?
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇద్దరు ఉద్ధండులు అయిన మాజీ మంత్రులు ఉన్నారు. వారు ఈనాటి వారు కారు. నాలుగు దశాబ్దాల క్రితమే మంత్రులు అయ్యారు. ఎన్టీఆర్ నుంచి అమితమైన ఆదరణ ప్రేమను పొందారు.
By: Satya P | 4 July 2026 12:00 PM ISTఉమ్మడి విశాఖ జిల్లాలో ఇద్దరు ఉద్ధండులు అయిన మాజీ మంత్రులు ఉన్నారు. వారు ఈనాటి వారు కారు. నాలుగు దశాబ్దాల క్రితమే మంత్రులు అయ్యారు. ఎన్టీఆర్ నుంచి అమితమైన ఆదరణ ప్రేమను పొందారు. ఆ ఇద్దరే ఒకరు ప్రస్తుత స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, మరొకరు దాడి వీరభద్రరావు. అయ్యన్న 1983లో తొలిసారి నర్శీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే దాడి 1985లో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. దాడి అంతకు ముందు హిందీ మాస్టారుగా అనకాపల్లిలో పనిచేసేవారు. ఆయనను గుర్తించి మరీ విద్యావంతులు పార్టీలో ఉండాలని ఎన్టీఆర్ చేసిన ఎంపిక అది.
వరుసగా గెలుస్తూ :
పక్క పక్కనే నర్శీపట్నం అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు. ఇక దాడి అయ్యన్న వరసగా గెలుస్తూ మంత్రులుగా కొనసాగుతూ వచ్చారు. టీడీపీలో అత్యంత గౌరవం కూడా అందుకున్నారు. అయ్యన్న ఒకసారి అనకాపల్లి నుంచి ఎంపీగా కూడా అయ్యారు. దాడి ఎమ్మెల్సీ అయి శాసనమండలిలో అపొజిషన్ లీడర్ గా వైఎస్సార్ సీఎం గా ఉన్న కాలంలో పనిచేశారు.ఎన్టీఆర్ చంద్రబాబు ఈ ఇద్దరినీ సమాదరించి ఉన్నత స్థానాలు అందించారు. ఇలా టీడీపీ నుంచి అనేక అవకాశాలు ఈ ఇద్దరూ అందుకున్నారు.
అయ్యన్నకు అదే ప్లస్ :
అయితే ఈ ఇద్దరిలో అయ్యన్నకు కలసి వచ్చింది ఒక్కటే. పార్టీ పట్ల ఆయన నిబద్ధత. ఆయన ఒకే పార్టీ అని టీడీపీని నమ్ముకున్నారు. ఆయన తొలిసారి 1989లో ఓటమి పాలు అయ్యారు. ఆనాడు కాంగ్రెస్ అయిదేళ్ళు పాలించింది. ప్రతిపక్షంలో ఉంటూ పోరాడారు తప్పించి కాంగ్రెస్ వైపు మొగ్గలేదు, ఇక 2004లో గెలిచి 2009లో అయ్యన్న ఓడారు, ఈ సమయంలోనే ఉమ్మడి ఏపీలో వైఎస్సార్ సీఎం గా ఉన్నారు. ఇక అయ్యన్న అనేక సందర్భాలలో స్వయంగా చెప్పినట్లుగా ఆయన పార్టీ మారాలని ఒత్తిడిలు తీవ్ర స్థాయిలో వచ్చాయి. మళ్ళీ అదే కమిట్మెంట్ తో అయ్యన్నను నిలబడ్డారు. విపక్షంలో ఎంత కష్టపడినా కూడా టీడీపీ తరఫున పోరాడారు,
జెండా కప్పుకుని చనిపోతాను :
ఇక 2019లో మరోసారి ఆయన ఓడారు, ఈసారి వైసీపీ ప్రభుత్వం ఉంది. జగన్ సీఎం గా ఉన్నారు. అయిదేళ్ళ పాటు తీవ్రమైన రాజకీయ పోరాటం అయ్యన్న చేశారు. నిజంగా అయ్యన్న మొత్తం పొలిటికల్ లైఫ్ లో ఇదే టఫ్ టైం అని అంటారు. అయినా సరే ఆయన పార్టీ మారలేదు, జెండా మోయడానిని వీడలేదు, అందుకే ఆయనకూ ఆయన కుటుంబానికీ ఈ రోజున పదవులు ఇచ్చి అధినాయకత్వం గౌరవించింది. ఇదే విషయాన్ని తాజాగా జరిగిన సభలో అయ్యన్న చెప్పుకున్నారు. తాను టీడీపీ జెండా కప్పుకుని చనిపోతాను తప్ప పార్టీ మారను అని గతంలోనే చెప్పాను అన్నారు.
దాడి చేసిన పొరపాటు :
మరి అయ్యన్న సమకాలీనుడు అయిన దాడి వీరభద్రరావు అయితే పొరపాటు చేశారు. అదే 2013లో ఆయనకు రెండోసారి ఎమ్మెల్సీ పదవికి రెన్యూల్ చేయలేదని వైసీపీలో చేరారు. అంతే కాదు, 2019లో మళ్లీ రెండవసారి కూడా వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. 2024 ఎన్నికల ముందు ఆయన వెనక్కి వచ్చి టీడీపీలో చేరినా కూడా ఆయన పార్టీ మారిన నేపథ్యం ఇపుడు టీడీపీలో అవకాశాల దగ్గరకు వచ్చేసరికి ఇబ్బంది అవుతోంది. అంతే కాదు అనకాపల్లిలో దాడి ప్లేస్ ని టీడీపీలో ఇతరులు భర్తీ చేశారు. దాంతో దాడి వారసుడికి టీడీపీలో సరైన అవకాశాలు దక్కడం లేదని అంటున్నారు. ఈ ఇద్దరి మాజీ మంత్రుల రాజకీయ చరిత్రను చూసిన వారు ఎవరైనా తెలుసుకోవాల్సింది ఒక్కటే అంటున్నారు. ఏ పార్టీని అయినా నమ్ముకుని పనిచేస్తే తప్పకుండా అవకాశాలు వస్తాయని. జంపింగ్స్ చేస్తే తక్షణ లాభాలు ఉన్నా దీర్ఘకాలంలో బ్రేకులు పడతాయని కూడా అంటున్నారు.
