Begin typing your search above and press return to search.

అయోధ్య జెండా పై పాక్ అక్కసు… భారత్ ఇచ్చిపడేసింది..

అయితే ఈ కార్యక్రమంపై పాకిస్తాన్ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేయడంతో మరోసారి భారత్–పాక్ మధ్య వాగ్వాదం చెలరేగింది.

By:  A.N.Kumar   |   27 Nov 2025 12:26 PM IST
అయోధ్య జెండా పై పాక్ అక్కసు… భారత్ ఇచ్చిపడేసింది..
X

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య శ్రీరామ మందిరంపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రత్యేక జెండా ఆవిష్కరణ చేయడం దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక చర్చకు దారితీసింది. అయితే ఈ కార్యక్రమంపై పాకిస్తాన్ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేయడంతో మరోసారి భారత్–పాక్ మధ్య వాగ్వాదం చెలరేగింది. భారత్ ఈ ఆరోపణలను ఘాటుగా తోసిపుచ్చింది.

పాకిస్తాన్ ఆరోపణలు: 'ఇస్లామోఫోబియా'

పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో అయోధ్యలోని చర్యలను తీవ్రంగా ఖండించింది. ముఖ్యంగా 1992 డిసెంబర్ 6న జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేతను పాక్ తన ప్రకటనలో ప్రస్తావించింది. అంతర్జాతీయ దృష్టి మరల్చడానికి ప్రయత్నించింది. అయోధ్యలో జెండా ఎగురవేయడం ద్వారా భారత్ అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నిస్తోందని పాక్ ఆరోపించింది. ఈ చర్య ఇస్లామోఫోబియాకు, 'వారసత్వ అపవిత్రత'కు నిదర్శనమని పాక్ వ్యాఖ్యానించింది. ముస్లిం మైనార్టీలపై ఒత్తిడి పెంచేందుకు భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కూడా విమర్శించింది.

భారత్ ఘాటు సమాధానం: 'నైతిక హక్కు లేదు'

పాకిస్తాన్ చేసిన నిరాధార ఆరోపణలను భారత్ గట్టిగా ఖండించింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ ధీర్ జైశ్వాల్ స్పందిస్తూ పాక్‌కు చెత్త రికార్డు ఉందని ఎత్తి చూపారు. మత వివక్ష, మైనారిటీలపై అణచివేత, వ్యవస్థాగత దౌర్జన్యం విషయంలో చెత్త రికార్డు ఉన్న పాకిస్తాన్‌కు భారత్‌పై విమర్శలు చేసే నైతిక హక్కే లేదని స్పష్టం చేశారు. జైశ్వాల్ వ్యాఖ్యానిస్తూ "తమ అంతర్గత సమస్యలు, తీవ్రవాదం, మానవ హక్కుల ఉల్లంఘనలతో నిండిన దేశం భారత్‌కు ఉపదేశాలు చేయడం వాస్తవానికి కపట ధోరణి" అని అన్నారు. ఇతరులను తప్పుబట్టే ముందు పాకిస్తాన్ తన దేశంలో నెలకొన్న అణచివేతలు, మైనారిటీల పరిస్థితిపై దృష్టి పెట్టాలని సూచించారు.

రాజకీయ ప్రాధాన్యం వర్సెస్ సాంస్కృతిక ప్రాధాన్యం

శ్రీరామ జన్మభూమిలో నిర్మితమైన మహా మందిరంపై జెండా ఆవిష్కరణ కేవలం ఆధ్యాత్మిక–సాంస్కృతిక ప్రాధాన్యం గల కార్యక్రమమని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే పాకిస్తాన్ దీనిని రాజకీయ కోణంలోకి లాగి విమర్శలు చేయడాన్ని రాజకీయ విశ్లేషకులు తప్పుబడుతున్నారు.

అయోధ్యలో జెండా ఎగురవేయడం భారతదేశంలో సాంస్కృతిక ఉత్సవం కాగా, దీనిపై పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలు ఇండో–పాక్ దౌత్య సంబంధాల్లో మరోసారి వైరాన్ని రేపాయి. అయితే, భారత్ మాత్రం పాకిస్తాన్ విమర్శలను తిప్పికొడుతూ తన అంతర్గత వ్యవహారాల్లో జోక్యాన్ని సహించబోమని స్పష్టం చేసింది.

అయోధ్య శ్రీరామ మందిరంపై చారిత్రక 'ధ్వజారోహణం'

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన శ్రీరామ జన్మభూమి ఆలయం మరో అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలయ శిఖరంపై కాషాయ రంగు ధర్మ ధ్వజాన్ని (జెండాను) లాంఛనంగా ఆవిష్కరించారు. 'ధ్వజారోహణం' అని పిలిచే ఈ పవిత్ర కార్యక్రమం ఆలయ నిర్మాణ ప్రక్రియ పూర్తిని సూచించింది. జనవరి 22న బాలరాముడి ప్రాణప్రతిష్ట తర్వాత, అంతటి ప్రతిష్టాత్మకమైన వేడుకగా దీన్ని భావించారు. ఇది ఆలయ నిర్మాణం పూర్తైనట్లు ప్రకటించింది. అత్యంత శుభప్రదమైన అభిజిత్ ముహూర్తంలో ఈ కార్యక్రమం జరిగింది. రామాయణంలో రాముడు, సీతమ్మల కల్యాణ దినంగా భావించే వివాహ పంచమి రోజున ఈ వేడుక నిర్వహించడం విశేషం.

ప్రధాని మోదీతో పాటు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ "శతాబ్దాల నాటి గాయం నేడు మానిపోయింది. ఈ ధర్మధ్వజం కేవలం చిహ్నం కాదు, ఇది భారతీయ నాగరికత పునరుజ్జీవనానికి నిదర్శనం" అని మోదీ ఈ సందర్భంగా ప్రసంగించారు.

ఈ ధ్వజారోహణం కేవలం ఒక మతపరమైన వేడుక మాత్రమే కాకుండా, దేశ చరిత్రలో శ్రద్ధ, సంస్కృతి, జాతీయ ఐక్యతకు సంబంధించిన ఒక ముఖ్య ఘట్టంగా నిలిచింది.