జేబుల్లేని దుస్తులు, 360 డిగ్రీల కెమెరా నిఘా.. అయోధ్య విరాళాల లెక్కింపులో విప్లవాత్మక నిర్ణయాలు
రామ మందిర విరాళాలు, హుండీ లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి కొత్తగా 'డ్రెస్ కోడ్' అమలులోకి తీసుకువచ్చారు.
By: Tupaki Political Desk | 14 Aug 2026 4:00 AM ISTఅయోధ్య రామాలయ విరాళాల లెక్కింపులో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించే కానుకల విషయంలో అత్యంత సురక్షిత, పారదర్శక విధానాలు అనుసరించాలని నిర్ణయించింది. అత్యున్నత స్థాయి భద్రతా నిబంధనలను అమల్లోకి తెచ్చింది. విరాళాల లెక్కంపులో అవకతవకలు జరిగినట్లు గతంలో వచ్చిన ఆరోపణలు పునరావృతం కాకుండా అత్యంత పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు.
రామ మందిర విరాళాలు, హుండీ లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి కొత్తగా 'డ్రెస్ కోడ్' అమలులోకి తీసుకువచ్చారు. ఇకపై విరాళాలు లెక్కించే సిబ్బంది అందరూ జేబులు లేని ప్రత్యేక ముదురు నీలం రంగు దుస్తులను ధరించడం తప్పనిసరి చేశారు. ఈ దుస్తుల రూపకల్పన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం, లెక్కింపు సమయంలో సిబ్బంది ఎవరైనా నగదును లేదా విలువైన బంగారు, వెండి వస్తువులను తమ వద్ద దాచుకుని బయటకు తీసుకెళ్లడాన్ని పూర్తిగా నిరోధించడమే అంటున్నారు. వ్యక్తిగత వస్తువులను కౌంటింగ్ హాల్‌లోకి అనుమతించని విధంగా ఈ డ్రెస్ కోడ్ భద్రతను మరింత బలోపేతం చేస్తుందని చెబుతున్నారు.
ఇదే సమయంలో టెక్నాలజీ వినియోగంలోనూ ట్రస్ట్ భారీ మార్పులు చేసింది. ముఖ్యంగా సిసిటివి నిఘాను మరింత విస్తృతం చేస్తూ, రికార్డింగ్‌లను భద్రపరిచే కాలాన్ని గతంలో ఉన్న 45 రోజుల నుంచి ఏకంగా 180 రోజులకు పెంచారు. దీనివల్ల భవిష్యత్తులో ఏదైనా అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు తేలితే, సుదీర్ఘకాలం వెనక్కి వెళ్లి ఆ రికార్డింగ్‌లను పరిశీలించే అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా, సాధారణ కెమెరాలకు బదులుగా పాన్, టిల్ట్, జూమ్ (PTZ) సామర్థ్యం ఉన్న అధునాతన కెమెరాలను 360-డిగ్రీల నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ మొత్తం లెక్కింపు ప్రక్రియను మరింత పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఇద్దరు ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్లను నియమించాలని నిర్ణయించారు.
సాంకేతికతతో పాటు, లెక్కింపు పద్ధతిలో కూడా మార్పులు చేస్తున్నారు. గతంలో టేబుళ్లు, కుర్చీలపై కూర్చుని లెక్కించే పద్ధతిని పక్కన పెట్టారు. ఇకపై సిబ్బంది నేలపై కూర్చుని లెక్కించేలా ఆదేశాలు జారీ చేశారు. దీనివల్ల లెక్కింపు గదిలో సిబ్బంది కదలికలపై నిరంతర పర్యవేక్షణ సులభతరం అయ్యిందని చెబుతున్నారు. లెక్కింపు కేంద్రంలోకి ప్రవేశించేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు ప్రతి సిబ్బందికి రెండంచెల భద్రతా తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఎటువంటి మొబైల్ ఫోన్లు, బ్యాగులు లేదా ఇతర వ్యక్తిగత వస్తువులను లోపలికి అనుమతించకుండా నిషేధాజ్ఞలు విధించారు.
నగదు తరలింపులో కూడా ట్రస్ట్ అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. ఆలయం నుంచి నగదును బ్యాంకుకు తరలించేటప్పుడు, మొత్తం నగదును సీలు వేసి, ఎస్బీఐ వాహనాల్లోనే తరలించేలా ఏర్పాట్లు చేశారు. ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించేందుకు బ్యాంక్ అధికారులు, ట్రస్ట్ సభ్యులు, ప్రైవేట్ భద్రతా సిబ్బందితో కూడిన ఎనిమిది మంది సభ్యుల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఈ పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడానికి మాజీ సైనిక అధికారులను సీనియర్ సూపర్‌వైజర్లుగా నియమించాలని భావిస్తున్నారు. ఈ కఠినమైన నిర్ణయాల ద్వారా భక్తుల విశ్వాసాన్ని మరింతగా నిలబెట్టుకోవడమే కాకుండా, విరాళాల నిర్వహణలో దేశంలోనే ఆదర్శంగా నిలవాలని ట్రస్ట్ భావిస్తోందని చెబుతున్నారు.
