తండ్రి సమాధి పక్కనే ఖమేనీ అంత్యక్రియలు.. విశేషం ఏంటంటే!
మరోవైపు ఖమేనీ అంత్యక్రియలపైనా దాడులు చేసే అవకాశం ఉందని ఇరాన్ ఇంటెలిజెన్స్ అధికారులు అంచనావేస్తున్నారు.
By: Garuda Media | 4 March 2026 8:48 PM ISTఅమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో మృతి చెందిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆయన అంత్యక్రియలను మషాద్ నగర్‌లొ నిర్వహించనున్నట్టు తెలిపింది. ఇరాన్‌లో రాజధాని టెహ్రాన్ తర్వాత.. రెండో అతి పెద్ద నగరం మషాదే కావడం గమనార్హం. ఇక్కడి ప్రఖ్యాత ఇమామ్ రజా మసీదు ప్రాంగణంలో ఖమేనీ అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఇక్కడ ఖమేనీ తండ్రి.. సమాధి ఉంది. దానికి పక్కగానే ఖమేనీ మృత దేహాన్ని ఖననం చేయనున్నట్టు పేర్కొంది.
అధికారిక లాంఛనాలతో నిర్వహించే ఈ కార్యక్రమంలో దేశ ప్రజలు సంతాపం తెలపాలని ఇరాన్ సర్కారు ప్రకటనలో పేర్కొంది. ఇరాన్ సుప్రీం లీడర్ మృతినేపథ్యంలో దేశంలో 40 రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తున్న విషయం తెలిసిందే.అయితే.. ఖమేనీ అంత్యక్రియల నేపథ్యంలో గురువారం నుంచి మూడు రోజుల పాటు.. ప్రత్యేక దినాలుగా పాటిస్తారని తెలిపింది. ఈ మూడు రోజుల పాటు ఆయన మృత దేహానికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. రంజాన్ మాసం కూడాకావడంతో ఈ కార్యక్రమాని కి మరింత ప్రాధాన్యం పెరిగింది. ఖమేనీకి సంతాపం తెలపాలని.. ప్రభుత్వం ప్రజలను ఆదేశించింది.
దాడుల భయం!
మరోవైపు ఖమేనీ అంత్యక్రియలపైనా దాడులు చేసే అవకాశం ఉందని ఇరాన్ ఇంటెలిజెన్స్ అధికారులు అంచనావేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఖమేనీ కుమారుడు సహా బంధువులు పాల్గొనే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో వారిని లక్ష్యంగా చేసు కుని ఇరాన్, అమెరికాలు చెలరేగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో పటిష్టమైన భద్రత మధ్య ఖమేనీ అంత్యక్రియ లు నిర్వహించనున్నారు. ఎలాంటి దాడులనైనాఎదుర్కొనేందుకు ఇరాన్ సైన్యం సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం తమ సామర్థ్యం ఏమీ తగ్గలేదని చెప్పడం గమనార్హం.
కొత్త సుప్రీం మజ్తబా
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణాంతరం.. తాత్కాలిక సుప్రీం లీడర్‌గా ఎన్నికైన అరాఫీ కూడా ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారని వార్తలు వస్తున్నాయి. అయితే.. దీనిని ఇరాన్ ధ్రువీకరించలేదు. మరోవైపు సుప్రీం లీడర్‌ను ఎన్నుకునేందుకు ఏర్పాటైన రాజ్యాంగ కమిటీ.. ఖమేనీ రెండో కుమారుడు మజ్తబా ఖమేనీని దేశ సుప్రీం లీడర్‌గా ఎంపిక చేసినట్టు తెలిసింది. దీనిపైనా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దేశ భద్రతా బలగాలతో నేరుగా సంబంధం ఉన్న మజ్తబా.. అయితేనే ఇరాన్‌ను ప్రస్తుత పరిస్థితిలో కాపాడగలరని భావిస్తున్నారు.
