'తూర్పు'న మెరుస్తున్న యువ తార.. ఇంకా కష్టపడాల్సిందే.. !
ఇదే.. సదరు యువనేత రాజకీయాలకు సంకటం తెస్తోంది. ఆయనే మాజీ మంత్రి దివంగత దేవినేని నెహ్రూ కుమారుడు.. అవినాష్.
By: Garuda Media | 1 Nov 2025 1:00 AM ISTవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో విజయం దక్కించుకోవాలన్నది ఆ యువ నాయకుడి ఆశ. అంతేనా.. తన తండ్రి ఎలా అయితే.. రాజకీయాలను శాసించారో.. తాను కూడా అదే రేంజ్‌కు ఎదగాలన్నది ఆయన లక్ష్యం. ఈ క్రమంలో సదరు యువ నేత చేస్తున్న కృషి, ప్రయత్నానికి మార్కులు బాగానే ఉన్నా.. ఓట్లు రాలడం మాత్రం కొంత ఇబ్బందిగానే ఉంది. ఇదే.. సదరు యువనేత రాజకీయాలకు సంకటం తెస్తోంది. ఆయనే మాజీ మంత్రి దివంగత దేవినేని నెహ్రూ కుమారుడు.. అవినాష్.
2009 నుంచి రాజకీయాల్లో ఉన్న అవినాష్.. 2014 ఎన్నికల్లో తన తండ్రి ప్రోత్సాహంతో విజయవాడ ఎంపీ గా పోటీ చేశారు. అయితే.. విభజన ఎఫెక్ట్‌తో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత.. టీడీపీ బాట పట్టారు. చంద్రబాబు ఆశీస్సులతో ఆయన 2019 ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకునే ప్రయత్నం చేశారు. కానీ.. అప్పుడు కూడా కాలం కలిసి రాలేదు. ఆ తర్వాత.. వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ బాటపట్టారు. ప్రస్తుతం అక్కడే కొనసాగుతున్నారు.
2024 ఎన్నికల్లో తనకు ఎంతో ఇష్టమైన, కలిసివస్తుందని భావించిన తూర్పు నియోజకవర్గం నుంచి అవి నాష్ ప్రయత్నం చేశారు. కానీ, కూటమిదూకుడు నేపథ్యంలోఅవినాష్‌కు మరోసారి పరాభవమే ఎదురైంది. అయినా.. పట్టువదలని విక్రమార్కుడి మాదిరిగా.. అవినాష్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికీ.. ఆయన వారానికి నాలుగు రోజులు పర్యటిస్తున్నారు. ప్రజలను కలుస్తున్నారు. తాజాగా తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలతో కృష్ణలంకలోని లోతట్టు ప్రాంతాలు కొంత మేరకు జల మయమయ్యాయి. వారికి సాయం చేశారు.
ఏదేమైనా.. వచ్చే 2029 ఎన్నికలు లక్ష్యంగా అవినాష్ కృషి చేస్తున్నారు. కానీ.. ప్రస్తుతం ఎంత కృషి చేస్తు న్నా.. ఆశించిన విధంగా అవినాష్ విజయం దక్కించుకునేందుకు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు పరిశీలకులు. ప్రధానంగా తన తండ్రి స్నేహితులను తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేయడంతోపాటు.. అందరికీ చేరువ కావాల్సిన అవసరం కూడా ఉందని అంటున్నారు. అంతేకాదు .. ప్రతి ఒక్కరికీ చేరువ కావాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
