ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు కాదు ముందస్తు అరెస్టు
శాంతిభద్రతల సమస్యను చూపిస్తూ..ఆయన్ను అదుపులోకి తీసుకోవటమే కాదు.. ఆయన్ను పులివెందుల నుంచి తరలిస్తున్నారు.
By: Garuda Media | 12 Aug 2025 11:07 AM ISTవైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని పులివెందుల పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. శాంతిభద్రతల సమస్యను చూపిస్తూ..ఆయన్ను అదుపులోకి తీసుకోవటమే కాదు.. ఆయన్ను పులివెందుల నుంచి తరలిస్తున్నారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల.. ఒంటిమిట్టలో ఈ రోజు జరుగుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ రెండు ఉప ఎన్నికల్ని అధికార కూటమితో పాటు.. వైసీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కడప జిల్లాలోని ఈ రెండు జెడ్పీలు వైసీపీకి కంచుకోట లాంటివి. ఈ నేపథ్యంలో ఈ రెండింటిని తమ సొంతం చేసుకుంటే వైసీపీకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలన్నది అధికార టీడీపీ ఆలోచన.
ఈ నేపథ్యంలో రెండు పార్టీలు పోటాపోటీగా బరిలోకి దిగాయి. గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలకు చెందిన ముఖ్యుల్ని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పోలీసుల తీరును ప్రశ్నిస్తూ తన ఇంటి ఎదుట ఎంపీ అవినాష్ రెడ్డి నిరసన తెలుపుతున్నారు. దీంతో భారీగా వైసీపీ శ్రేణులు అవినాష్ ఇంటి వద్ద చేరాయి. దీంతో.. పోలీసులు ఎంట్రీ ఇచ్చి వైసీపీ శ్రేణుల్ని అవినాష్ రెడ్డి ఇంటి నుంచి బయటకు పంపుతున్నాయి. వైసీపీ ఏజెంట్లపై టీడీపీ దాడులు చేస్తుందని.. అలాంటి దాడుల్ని అపాల్సిన పోలీసులు తనను అడ్డుకోవటం ఏమిటి? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవటంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముందస్తు జాగ్రత్తగా ఎంపీ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన్ను ఇంటి నుంచి పోలీసు వాహనంలో బయటకు తీసుకెళ్లారు. పోలీసుల తీరుపై అవినాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి దారుణ పరిస్థితిని తానెప్పుడు చూడలేదన్న ఆయన.. దాడుు ఆపాల్సిన పోలీసులే తనను అడ్డుకోవటం ఏమిటి? అని ప్రశ్నించారు.
మరోవైపు వేంపల్లిలో వైసీపీ నేత సతీష్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. ఒంటిమిటటలో 24,600 ఓట్లు ఉన్నాయి. మొత్తం పదకొండు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ రెండు ఉప ఎన్నికల ఈ రోజు సాయంత్రం వరకు బ్యాలెట్ పద్దతిలో జరగనున్న విషయం తెలిసిందే. హోరాహోరీ అన్నట్లు సాగుతున్న ఉప ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఉప ఎన్నికల జరుగుతున్న రెండు చోట్ల మొత్తం 1500 మంది పోలీసులు బందోబస్తుగా ఏర్పాటు చేశారు. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా.. పోటీ మొత్తం టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి.. వైసీపీ నేత హేమంత్ రెడ్డి మధ్యే ప్రధానంగా పోటీ నడుస్తోంది. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 10,600 మంది తమ ఓటుహక్కును వినియోగించనున్నారు.
