పదేళ్లలో అంత భారీగా పెరిగిన ఇద్దరు తెలుగు ఎంపీలు.. దేశంలోనే టాప్!
పదేళ్ల వ్యవధిలో ఆస్తుల పెరుగుదల యమా స్పీడ్ గా ఆస్తులు పెరిగిన ఎంపీల ఉదంతాన్ని ఏడీఆర్ సంస్థ తన అధ్యయనాన్ని వెల్లడించింది.
By: Garuda Media | 8 Jan 2026 7:00 PM ISTపదేళ్ల వ్యవధిలో ఆస్తుల పెరుగుదల యమా స్పీడ్ గా ఆస్తులు పెరిగిన ఎంపీల ఉదంతాన్ని ఏడీఆర్ సంస్థ తన అధ్యయనాన్ని వెల్లడించింది. కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన 102 మంది ఆస్తుల వివరాల్ని మదించిన నేపథ్యంలో టాప్ 3గా నిలిచిన ఎంపీల్లో ఇద్దరు ఎంపీలు తెలుగు వారు కావటం.. వారిద్దరూ ఏపీకి చెందిన వారు కావటం విశేషం. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే..ఇద్దరూ ఒకే రాజకీయ పార్టీకి చెందిన వారు కావటం.
ఇంతకూ ఆ ఇద్దరు తెలుగు ఎంపీలు మరెవరో కాదు వైసీపీకి చెందిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అయితే మరొకరు కడప ఎంపీగా వ్యవహరిస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డి. వీరిద్దరి ఆస్తులు పదేళ్ల వ్యవధిలో 550 శాతం.. 474 శాతం పెరిగినట్లుగా గుర్తించారు. వీరిద్దరి కంటే మిన్నగా మరో ఎంపీ ఉన్నారు. ఆయన ఆస్తులు అయితే పదేళ్లలో ఏకంగా 804 శాతం పెరిగాయి. ఇంతకూ ఆ ఎంపీ ఎవరంటే జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన విజయ్ కుమార్ హన్సదక్ గా చెప్పాలి. 2014లో ఆయన ఆస్తులు రూ.68.63 లక్షలు కాగా..2024 నాటికి ఆయన ఆస్తులు రూ.6కోట్లకు చేరినట్లుగా ఏడీఆర్ సంస్థ తేల్చింది. జార్ఖండ్ లోని రాజ్ మహల్ లోక్ సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
2014 నుంచి 2024 వరకు ముచ్చటగా మూడుసార్లు విజయం సాధించిన 102 మంది ఎంపీల అఫిడవిట్లను ఈ సంస్థ విశ్లేషించింది. అత్యంత భారీగా ఆస్తులు పెరిగిన ఎంపీల పార్టీగా వైసీపీ రెండో స్థానంలో నిలిచింది. 2014లో మిథున్ రెడ్డి ఆస్తులు రూ.22 కోట్లు ఉంటే.. 2019 నాటికి రూ.66 కోట్లు.. 2024 నాటికి రూ.146 కోట్లకు చేరుకోవటం గమనార్హం. యమా స్పీడ్ గా ఆస్తులు పెరిగిన సిట్టింగ్ ఎంపీల్లో మిథున్ రెడ్డి దేశంలోనే మూడో స్థానంలో నిలిచినట్లుగా పేర్కొన్నారు
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విషయానికి వస్తే.. 2014లో అధికారికంగా ప్రకటించిన ఆయన ఆస్తుల విలువ రూ.7 కోట్లు ఉంటే.. 2019నాటికి రూ.18 కోట్లు చేరుకుంది. 2024 నాటికి రూ.40 కోట్లుగా పేర్కొన్నారు. ఆస్తులు భారీగా పెరిగిన ఎంపీల్లో ఆయన 15వ స్థానంలో నిలిచారు. తెలంగాణకు చెందిన మజ్లిస్ అధినేత.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆస్తులు పదేళ్లలో 488 శాతం పెరిగాయి. పెరుగుదల విషయంలో ఆయన 24వ స్థానంలో నిలిచారు. ఏపీకి చెందిన ఏకైక టీడీపీ ఎంపీ, ప్రస్తుత కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న రామ్మోహన్ నాయుడి ఆస్తులు 177శాతం పెరిగాయి. పెరుగుదల పరంగా చూస్తే ఆయన దేశంలో 28వ స్థానంలో ఉన్నారు.
ఇప్పటి వరకు పదేళ్లలో భారీగా ఆస్తులు పెరిగిన ఎంపీల గురించి చదివాం. ఇప్పుడు భారీగా ఆస్తులు తగ్గిన ఎంపీ విషయానికి వస్తే.. కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఆస్తి విలువలో 47 శాతం తగ్గుదల కనిపించింది. గుజరాత్ లోని నవ్ సారీ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయాన్ని సాధించటమే కాదు.. 2024 ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన ఎంపీగా నిలిచిన సీఆర్ పాటిల్ ఆస్తి తగ్గింది, 2014 ఎన్నికల వేళ ఆయన ఆస్తి రూ.74.47 కోట్లు ఉంటే.. 2019 నాటికి రూ.44.60 కోట్లకు తగ్గితే.. 2024 ఎన్నికల నాటికి ఆయన ఆస్తి రూ.39.49 కోట్లకు పరిమితం కావటం గమనార్హం. దేశ వ్యాప్తంగా ఎంపీల ఆస్తుల పెరుగుదల సరాసరిన 110శాతం ఉన్నట్లుగా గుర్తించారు. ఆస్తుల విలువ భారీగా పెరిగిన టాప్ 10 ఎంపీల్లో ఐదుగురు బీజేపీకి చెందిన వారు కాగా.. ఆ తర్వాతి స్థానంలో వైసీపీ (2 ఎంపీలు) నిలిచారు.
గడిచిన మూడు ఎన్నికల్లో వరుసగా గెలుస్తున్న బీజేపీకి చెందిన 65 మంది ఎంపీల ఆస్తి సగటున 110 శాతం చొప్పున చూ.16.90 కోట్లు పెరిగితే.. కాంగ్రెస్ కు చెందిన 8 మంది ఎంపీల ఆస్తులు 135 శాతం చొప్పున పెరిగాయి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ ఆస్తుల్లో రూ.10.98 కోట్ల పెరుగుదల నమోదైంది. 2014లో ఆయన ఆస్తి రూ.9.4 కోట్లు కాగా.. 2019 నాటికి రూ.15.88 కోట్లు.. 2024 నాటికి రూ.20.39 కోట్లకు పెరిగాయి. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయానికి వస్తే 2014లో ఆయన ఆస్తులు రూ.1.65 కోట్లు అయితే.. 2019 నాటికి రూ.2.51 కోట్లు, 2024 నాటికి రూ.3.02 కోట్లకు పెరిగినట్లుగా గుర్తించారు. దేశంలో ఆస్తులు భారీగా పెరిగిన ఎంపీల జాబితాలో ఆయన 94 స్థానంలో నిలిచారు.
