ఈ మూర్ఖుడిని వదిలించుకోవాలి.. ట్రంప్‌పై టాప్ -5 హాలీవుడ్ స్టార్స్ బుల్లెట్ల వర్షం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి హాలీవుడ్ ప్రముఖులంతా వ్యతిరేకంగా ఉన్నారు. వీలున్న ప్రతి వేదికపైనా అతడి పాలనను, విధి విధానాలను, విదేశాంగ విధానాలను తూర్పారబడుతున్నారు.
By: Sivaji Kontham | 6 Oct 2026 6:11 PM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి హాలీవుడ్ ప్రముఖులంతా వ్యతిరేకంగా ఉన్నారు. వీలున్న ప్రతి వేదికపైనా అతడి పాలనను, విధి విధానాలను, విదేశాంగ విధానాలను తూర్పారబడుతున్నారు. ఇప్పటికే పలువురు స్టార్లు అతడిని తూలనాడుతూ బహిరంగ వేదికలపైనే శాపనార్థాలు పెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
హాలీవుడ్ ప్రముఖ నటుడు, `అవెంజర్స్` ఫేమ్ మార్క్ రఫాలో తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. న్యూయార్క్ నగరంలో జరిగిన `హ్యాండ్స్ ఆఫ్ అవర్ ఓట్` ర్యాలీలో ఆయన మాట్లాడుతూ త్వరలో రానున్న మధ్యంతర ఎన్నికలు దేశ భవిష్యత్తుకు చాలా కీలకమని పేర్కొన్నారు. ఓటింగ్ హక్కులను పరిమితం చేయడానికి.. ఎన్నికలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని.. దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా ట్రంప్‌ను ఉద్దేశించి తీవ్ర పదజాలం వాడుతూ ఆయన్ను త్వరలోనే పదవి నుంచి సాగనంపాలని పిలుపునిచ్చారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ భద్రతా లోపాలు, సైబర్ సెక్యూరిటీ అంశాలపై ఆందోళన వ్యక్తం చేసిన రఫాలో... ఎలన్ మస్క్ ప్రమేయంపైనా హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు ఎలాంటి భయాలకు లోనుకాకుండా, ఐక్యంగా ఉండి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. కాగా గతంలో పారామౌంట్-వార్నర్ బ్రదర్స్ విలీనంపై ఆయన చేసిన వ్యాఖ్యలు యూదు సంఘాల నుంచి తీవ్ర విమర్శలకు, యాంటీసెంటిజమ్ ఆరోపణలకు దారితీయగా.. రఫాలో ఆ ఆరోపణలను ఖండించిన సంగతి తెలిసిందే.
నైతికత లేని నాయకుడు..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలు, నిర్ణయాలపై హాలీవుడ్‌లో మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. ముఖ్యంగా ప్రముఖ నటులు రాబర్ట్ డి నిరో, జాన్ క్యూసాక్, జేమీ లీ కర్టిస్ , క్రిస్టినా ఆపిల్‌గేట్ వంటి స్టార్స్ ట్రంప్‌పై బహిరంగంగానే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్రంప్ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి, మానవ హక్కులకు తీవ్ర ముప్పుగా పరిణమించాయని వారు చాలా వేదికలపై మండిపడ్డారు.
ఆస్కార్ గ్రహీత రాబర్ట్ డి నిరో అయితే ట్రంప్‌పై తీవ్ర పదజాలం ఉపయోగిస్తూ.. అతడికి నైతికత లేదని.. దేశ భద్రతను ప్రమాదంలోకి నెడుతున్నారని పలుమార్లు నిలదీశారు. అలాగే ఇతర స్టార్ల మాదిరిగానే `అవెంజర్స్` నటుడు మార్క్ రఫాలో తాజాగా ఓటింగ్ హక్కులు, పౌర స్వేచ్ఛ పరిరక్షణ కోసం జరుగుతున్న ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ ట్రంప్ పరిపాలనను తీవ్రంగా విమర్శించారు. ట్రంప్ అనుసరిస్తున్న నియంతృత్వ పోకడలను.. విదేశీ విధానాలను హాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నారు.
ప్రభుత్వ విధానాలపై గళం విప్పడం సెలబ్రిటీలుగా తమ బాధ్యతని వీరంతా భావిస్తున్నారు. భావప్రకటన స్వేచ్ఛను హరించేలా... ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసేలా ఉన్న ఏ నిర్ణయాన్నైనా తాము వ్యతిరేకిస్తామని ఈ స్టార్స్ స్పష్టం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా.. బహిరంగ సభల్లో ట్రంప్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అమెరికన్ రాజకీయాల్లో నిత్యం చర్చనీయాంశంగా మారుతున్నారు.
