భీమిలీ రెండు అయినా అవంతికి చోటు లేదా ?
వైసీపీ ఓటమి తరువాత తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఒకసారి జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశానికి హాజరైన అవంతి ఆ తరువాత మౌన ముద్ర దాల్చారు.
By: Satya P | 15 Oct 2025 12:58 AM ISTమాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు రాజకీయం ఆగిపోయినట్లు అయింది. ఆయన పదిహేనేళ్ళ రాజకీయ జీవితంలో 2024 ఎన్నికల్లో ఓటమి భారీ షాక్ అయితే ఆ తరువాత జరిగిన పరిణామాలు కూడా ఆయనకు ఏ మాత్రం కలసి రావడం లేదు అని అంటున్నారు. దానికి కారణాలు ఏమిటి అంటే అవంతి స్వయంకృతం అని కొందరు అంటూంటే రాజకీయాల్లో మారిన పరిస్థితులను అంచనా వేయకపోవడం అని కొందరు అంటున్నారు. మొత్తం మీద చూస్తే భీమిలీ నుంచి రెండు సార్లు గెలిచి ఏకంగా మూడేళ్ళ పాటు వైసీపీలో మంత్రిగా అధికారం అందుకున్న అవంతి శ్రీనివాసరావు ఇపుడు ఏమీ కాకుండా అయిపోయారు అని అంటున్నారు.
పార్టీలు మారిన రికార్డు :
వర్తమానంలో రాజకీయంగా చూస్తే పార్టీలు మారడం ఏమంత తప్పు కాదు, అందరూ అదే చేస్తున్నారు. అయితే మారిన తరువాత ఎలా వ్యవహరించాలి, ఏ విధంగా భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకోవాలి అన్న దాంట్లోనే అవంతి సరిగ్గా వ్యవహరించలేదని అంటున్నారు ఆయన వైసీపీ మంత్రిగా ఉన్నపుడు టీడీపీ మీద జనసేన మీద దూకుడుగా చేసిన రాజకీయం విమర్శలే ఈ రోజున ఆయనకు రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయని అంటున్నారు. ఇక చూస్తే కనుక అవంతి ప్రజారాజ్యం, కాంగ్రెస్ టీడీపీ వైసీపీ ఇలా నాలుగు పార్టీలు మారారు. మొత్తం రాజకీయమంతా అధికార పార్టీలలోనే గడిపి అదృష్టవంతుడు అనిపించుకున్నారు.
వైసీపీకి గుడ్ బై :
వైసీపీ ఓటమి తరువాత తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఒకసారి జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశానికి హాజరైన అవంతి ఆ తరువాత మౌన ముద్ర దాల్చారు. ఇక 2024 డిసెంబర్ లో ఏకంగా పార్టీకే గుడ్ బై కొట్టేశారు. అప్పట్లో ఆయన జగన్ మీద విమర్శలు చేసి కూటమి పాలన భేష్ అని పొగిడారు. దాంతో ఆయన కూటమి వైపే అన్న సంకేతాలు అందరినీ అలా పంపించారు. కానీ ఏడాదికి దగ్గర అవుతున్నా ఆయనకు కూటమి పార్టీల నుంచి పిలుపు రాలేదని అంటున్నారు.
ఆ రెండు పార్టీలతో :
టీడీపీలో చేరాలనే అవంతి పెద్ద ప్రయత్నం చేశారు అని ప్రచారంలో ఉంది. అందుకోసం ఆయన వైసీపీ మేయర్ మీద అవిశ్వాసానికి కార్పోరేటర్ అయిన తన కుమార్తె చేత వ్యతిరేకంగా ఓటు చేయించి టీడీపీ మేయర్ గద్దె నెక్కడానికి కారణం అయ్యారు. దాంతో ఆయన సైకిలెక్కెస్తారు అని అంతా అనుకున్నారు. కానీ అదేమీ లేకుండా పోయింది, ఆయన రాకను భీమిలీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ అడ్డుకుంటున్నారు అని అంటున్నారు అంతే కాదు అధినాయకత్వం కూడా ఆయన విషయంలో పెద్దగా ఆసక్తిని చూపించడం లేదని అంటున్నారు
రెండు అయితే కూడా :
ఇక జనసేనలో చేరాలని చూసినా ఆయనకు అక్కడా గ్రీన్ సిగ్నల్ రాలేదని అంటున్నారు ఆయన ప్రజారాజ్యం నుంచే రాజకీయంగా అరంగేట్రం చేశారు. అయితే ఇతర పార్టీలను ఆశ్రయించిన ఆయన జనసేన వైపు గతంలో చూడలేదని అధినాయకత్వానికి ఆగ్రహం ఉంది. ఇక భీమిలీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అవంతికి ఉంది. అయితే టీడీపీ జనసేన రెండూ అక్కడ బలంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గం రెండుగా మారితే చెరో సీటుని పంచుకుంటాయని అంటున్నారు. దాంతో అవంతికి చాన్స్ లేదని చెబుతున్నారు. మొత్తం మీద చూస్తే అవంతి రాజకీయం మాత్రం అయోయమంగా ఉందని అంటున్నారు.
